నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2020-03-04T11:04:24+05:30 IST

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

- ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు 

- హాజరుకానున్న 36,091 మంది విద్యార్థులు 

- నిమిషం ఆలస్యంగా వచ్చినా నో ఎంట్రీ


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 23వ తేదీ వరకు జరిగే ఇంటర్మీడియట్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి రాజ్యలక్ష్మి కన్వీనర్‌గా మరో ముగ్గురు సభ్యులతో కలిపి జిల్లా ఎగ్జామినేషన్‌ కమిటీని, హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లాలోని 11 ప్రభుత్వ, 11 మోడల్‌ స్కూల్‌, 4 టీఎస్‌డబ్ల్యూఆర్‌, 1 గిరిజన, 1 బీసీ వెల్ఫేర్‌, 45 ప్రైవేట్‌, 5 కేజీబీవీ, 11 ప్రైవేట్‌ ఒకేషనల్‌ జనరల్‌ జూనియర్‌ కళాశాలల్లో 36,091 మంది విద్యార్థులు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ పరీక్షలు రాయనున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 17,559 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 18,532 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. వీరి కోసం 47 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో పరీక్షా కేంద్రానికి ఒక్కొక్కరు చొప్పున 47 మందిని చీఫ్‌ సూపరింటెండెంట్లను, 47 మంది డిపార్టుమెంట్‌ అధికారులను నియమించారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు  కల్పించారు. విద్యార్థులకు అత్యవసర వైద్య చికిత్సలను అందించేందుకు అన్ని కేంద్రాల వద్ద ఫస్ట్‌ ఎయిడ్‌ చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మెడికల్‌ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పరీక్షల సమయంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగకుండా ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాలకు వెళ్ళే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది.


రెండు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, నాలుగు సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాల ఏర్పాటు

కాపీయింగ్‌ జరుగకుండా ఉండేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు రెండు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, నాలుగు సిట్టింగ్‌ స్వ్వాడ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందంలో పోలీసు, రెవెన్యూ అధికారులు, సిట్టింగ్‌ స్క్వాడ్‌లో ఎనిమిది మంది ప్రభుత్వ కళాశాలల లెక్చరర్లు, లైబ్రరీయన్లను సభ్యులుగా నియమించారు. పరీక్షా కేంద్రానికి సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌ నుంచి పరీక్ష జరిగే రోజున ఉదయం 8.30 గంటలకు ప్రశ్నపత్రాలను సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్స్‌ నేతృత్వంలో తీసుకొని వెళ్లి 8.45 గంటలకు చీఫ్‌సూపరింటెండెంట్‌, డిపార్టుమెంట్‌ అధికారి, లెక్చరర్‌ సమక్షంలో తెరుస్తారు. 9 గంటలకు పరీక్షలను ప్రారంభించి 12 గంటల వరకు పూర్తిచేస్తారు. పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్‌ అమలుతోపాటు ఆయా ప్రాంతాల్లోని జిరాక్సు సెంటర్లను మూసివేస్తారు. 


నిమిషం ఆలస్యంగా వచ్చినా నో ఎంట్రీ

ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు 8.30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తారు. 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యంగా వచ్చినా వారిని లోనికి అనుమతించరు. పరీక్షా కేంద్రాల్లోకి హాల్‌టికెట్‌తోపాటు పరీక్షా ప్యాడ్‌, పెన్నులను మాత్రమే అనుమతిస్తారు. ఎలకా్ట్రనిక్‌ వాచ్‌లు, క్యాలిక్యులేటర్లు, మొబైల్‌ ఫోన్స్‌ ఇతర వస్తువులను అనుమతించరు. 


హాల్‌ టికెట్లు ఆన్‌లైన్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు

హాల్‌ టికెట్లను కళాశాల నుంచి లేదా నేరుగా బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎగ్జామినేషన్స్‌ ఆన్‌లైన్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటును కల్పించారు. గతంలో ఫీజులు చెల్లించకుంటే హాల్‌ టికెట్లు ఇవ్వమని కళాశాల యజమాన్యాలు ఇబ్బందులకు గురిచేసిన సందర్భాలున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఉన్నతాధికారులు ఈసారి ఆన్‌లైన్‌ హాల్‌టికెట్లపై ఎవరి సంతకం కూడా అవసరం లేదని, నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకొని హాల్‌టికెట్‌తో పరీక్ష రాయవచ్చని ప్రకటించారు.  ఎక్కడైనా విద్యార్థులకు ఇబ్బందులు ఉంటే 9848309006, 9848795199, 9440555066, 9912981450 నంబర్లలో సంప్రదించాలని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి వి రాజ్యలక్ష్మి ప్రకటించారు. 

Updated Date - 2020-03-04T11:04:24+05:30 IST