జనతా కర్ఫ్యూ సంపూర్ణం

ABN , First Publish Date - 2020-03-23T10:59:08+05:30 IST

రోనా వైరస్‌ అరికట్టడం కోసం చేపట్టిన జనతా కర్ఫ్యూ జిల్లాలో సంపూర్ణంగా విజయవంతమైందని జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి అన్నారు.

జనతా కర్ఫ్యూ సంపూర్ణం

ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించడం అభినందనీయం

కరోనాపై విషప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు

జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి


జగిత్యాల, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ అరికట్టడం కోసం చేపట్టిన జనతా కర్ఫ్యూ జిల్లాలో సంపూర్ణంగా విజయవంతమైందని జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోవిడ్‌-19 మహమ్మారిని అందరం కలిసికట్టుగా ఎదుర్కోవాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ఉదయం 7 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ప్రజలంతా ఇళ్లకే పరిమితమై స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించారని అన్నారు. జిల్లాలోని అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు, కూరగాయల మార్కెట్లు, పెట్రోల్‌ బంక్‌లు, ఆర్టీసీ బస్సులు, ఆటోలు, రవాణా సంస్థ పూర్తిగా స్తంభించిందని అన్నారు. జనతా కర్ఫ్యూను పాటించడం ద్వారా మనలను మనం కాపాడుకోవడంతో పాటు దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడుకోవచ్చునని తెలిపారు.


కరోనా వైరస్‌తో ప్రజలు పూర్తి అవగాహనతో జనతా కర్ఫ్యూలో భాగస్వాములై స్వచ్ఛందంగా ఎవరికి వారే బంద్‌ ప్రకటించుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం కోరిక మేరకు సక్సెస్‌ చేసినందుకు జిల్లా ప్రజలకు కలెక్టర్‌ అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుననుసరించి రెవెన్యూ, పోలీస్‌, వైద్య శాఖ, శానిటేషన్‌, విద్యుత్‌ తదితర అత్యవసర శాఖల సిబ్బంది విధులు నిర్వర్తించారని, మిగిలిన వారందరూ స్వచ్ఛందంగా ఇళ్లలోనే ఉండి కర్ఫ్యూ పాటించడం వైరస్‌ నివారణ చర్యల్లో భాగమన్నారు. ఈ మహమ్మారిని ప్రారదోలేందుకు ఇతర దేశాల నుంచి జిల్లాకు వచ్చినవారిని గుర్తించి సమాచారం అందించాలని, స్వచ్ఛందంగా వారికి వారే ఇంటిలో ప్రత్యేక గదిలో 14 రోజుల పాటు ఉండాలని అన్నారు. జిల్లా యంత్రాంగానికి సహకరించాలని, అప్పుడే జిల్లాలో ఎలాంటి  కేసులు నమోదు కాకుండా ఉంటాయని అన్నారు. ఆదివారం జనతా కర్ఫ్యూలో ప్రజలంతా ఏ విధంగా స్వచ్ఛందంగా సహకరించారో, అదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో కరోనా వైరస్‌పై చేపట్టే యుద్ధానికి సహకరించాలని కలెక్టర్‌ కోరారు.


కరోనాపై విషప్రచారం మానుకోండి..

అత్యంత ప్రమాదకరంగా మారిన కోవిడ్‌-19 (కరోనా)పై విష ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలకు వెనుకాడేది లేదని జిల్లా కలెక్టర్‌ జి.రవి ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. కరోనా నియంత్రణకు జిల్లాలో అవసరమైన చర్యలను చేపట్టామన్నారు. ప్రింట్‌ మీడియా, ఎలకా్ట్రనిక్‌, సోషల్‌ మీడియా ద్వారా అసత్య ప్రచారం నిర్వహిస్తే సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైౖనింగ్‌, డాక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ సర్వీసెస్‌, జిల్లా కలెక్టర్‌లను సంప్రదించి, నిజ నిర్ధారణ తర్వాతనే ప్రచారం నిర్వహించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2020-03-23T10:59:08+05:30 IST