జయహో..జనతా కర్ఫ్యూ

ABN , First Publish Date - 2020-03-23T10:46:17+05:30 IST

కరోనాపై కరీంనగర్‌ నిశ్శబ్ధ యుద్ధం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్‌ ఇచ్చిన జనతా కర్ఫ్యూకు సానుకూలంగా స్పందించి జిల్లా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు.

జయహో..జనతా కర్ఫ్యూ

జిల్లావ్యాప్తంగా విజయవంతం 

వీధులన్నీ నిర్మానుష్యం..

కరోనాపై పోరాటం జరుపుతున్న వారికి చప్పట్లతో అభినందలవెల్లువ

ఐక్యతాస్పూర్తిని చాటిన జిల్లావాసులు

31 వరకు లాక్‌డౌన్‌ 


(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌): కరోనాపై కరీంనగర్‌ నిశ్శబ్ధ యుద్ధం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్‌ ఇచ్చిన జనతా కర్ఫ్యూకు సానుకూలంగా స్పందించి జిల్లా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి వైద్య, ఆరోగ్యశాఖ పారామెడికల్‌ సిబ్బంది, మున్సిపల్‌, రెవెన్యూ, పోలీసు ఉద్యోగులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి అందిస్తున్న సేవలకు కృతజ్ఞతగా జనం తమ గుండె చప్పుళ్లను చప్పట్లుగా మార్చారు. భారత జాతి ఐక్యతా స్పూర్తిని ప్రదర్శించారు.  ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూపాటించాలని ప్రకటించినప్పటికి తెల్లవారిన నుంచి ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు.


ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ వాహనాలు, ట్యాక్సీలు, ఆటోలను కూడా నిలిపివేయడంతో జనజీవనం స్తంభించింది. హాస్పిటల్స్‌, మెడికల్‌ షాప్స్‌ మినహా వ్యాపార, వాణిజ్య సంస్థలతోపాటు పెట్రోల్‌ పంపులు, థియేటర్లు, వైన్స్‌లు, హోటళ్లు, టిఫిన్‌సెంటర్లన్నీ మూసివేశారు. గ్రామాల నుంచి వచ్చే పాలు, కూరగాయల వ్యాపారులు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో బస్టాండ్‌తోపాటు ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. నిత్యం రద్దీగా ఉండే  కూరగాయల మార్కెట్‌, రైతు బజార్లు, క్లాక్‌టవర్‌, తెలంగాణ చౌక్‌, కమాన్‌చౌరస్తా, రాజీవ్‌చౌక్‌ వంటి ప్రధాన కూడళ్లలో పోలీసులు, మీడియా ప్రతినిధులు మినహా ఇతరులు ఒక్కరు కూడా కనిపించలేదు.


మఽధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పిన్‌డ్రాప్‌ సైలెంట్‌ వాతావరణం చోటుచేసుకుంది. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌,  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌, కలెక్టర్‌ కె శశాంక, పోలీసు కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి, నగర మేయర్‌ సునీల్‌రావుతోపాటు ప్రముఖులంతా ఇంట్లోనే కుటుంబసభ్యులతో గడిపారు. 


సాయంత్రం 5 గంటలకు పోలీసు, అగ్నిమాపకశాఖ వాహనాలతో సైరన్‌ మోగించడంతో ప్రజలంతా ఒక్కసారిగా ఇళ్ల ఎదుట, బాల్కానీలు, కిటికీల వద్దకు వచ్చి గంటానాథం, చప్పట్లు కొడుతూ భారత్‌మాతాకీ జై...జైజై భారత్‌ అంటూ నినాదాలు చేస్తూ కరోనా నియంత్రణకు కృషిచేస్తున్న వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, మున్సిపల్‌ కార్మికులు, రెవెన్యూ, పోలీసులకు అభినందనలు తెలిపారు. మంత్రి గంగుల, ఎంపీ సంజయ్‌, కలెక్టర్‌ శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి, మేయర్‌ సునీల్‌రావు కుటుంబసభ్యులతో  కలిసి చప్పట్లు కొట్టి వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులకు అభినందనలు తెలిపారు. 


పోలీసు కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి కమిషనరేట్‌ పరిధిలో  పర్యవేక్షిస్తూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయఘటనలు చోటుచేసుకోకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతతున్న ఇండొనేషియా దేశస్తులతో అత్యంత సన్నిహితంగా మెదిలిన పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా నాయకుడు కరీంనగర్‌కు చెందిన జమీల్‌ అహ్మద్‌ను అదుపులోకి తీసుకుని వైద్యపరీక్షల అనంతరం క్వారంటైన్‌కు తరలించారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వాహనదారులను పోలీసులు అడ్డుకొని అత్యవసర వైద్యసేవలుంటే తప్పా అనుమతించకుండా వాహనాలను సీజ్‌ చేశారు. 


31వరకు లాక్‌డౌన్‌ 

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన జనతా కర్ఫ్యూ విజయవంతమైనప్పటికి కరోనా భూతం ఇంకా తొలిగిపోకపోవడంతోపాటు రాష్ట్రంలో కొత్తగా మరో 5 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో ఈ నెలాఖరు వరకు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు. వ్యాధులు ప్రబలినప్పుడు తీసుకునే చర్యలో భాగంగా 1897 యాక్టును అనుసరించి చర్యలు చేపడుతున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.


ఈనెలాఖరువరకు జనతా కర్ఫ్యూ సందర్భంగా స్పందించిన విధంగానే ప్రజలెవ్వరూ బయటకు రాకుండా సహకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. మన కోసం మనం.. జనం కోసం జనం.. అందరి కోసం అందరం.. అనే స్పూర్తితో ఇళ్లకే పరిమితమై కరోనా వ్యాధిని అరికట్టడానికి ప్రజలు సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు.  రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులు, టాక్సీలు, ఆటోలను కూడా నిలిపివేస్తున్నారు. రాష్ట్రానికి వచ్చే అన్ని దారులను మూసివేయనున్నారు. ఈమేరకు కరీంనగర్‌ జిల్లాలో కూడా లాక్‌డౌన్‌ నిబంధనలు వర్తించనున్నాయి.


వ్యాపారవాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు, వైన్స్‌, బార్లు, థియేటర్లు, అన్ని మూసివేస్తారు. అత్యవసర సర్వీసులకు సంబంధించిన ఉద్యోగులు మినహా ఇతర ప్రభుత్వ ఉద్యోగులు రోటేషన్‌ చొప్పున 20 చొప్పున పనిచేయాల్సి ఉంటుంది. ప్రైవేట్‌ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు వేతనాలను కూడా చెల్లించాలని ప్రభుత్వం సూచించింది. అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడనున్నాయి. విద్యాశాఖలో పరీక్షలతోపాటు స్పాట్‌ వాల్యుయేషన్‌ను నిలిపివేశారు. లాక్‌డౌన్‌ కారణంగా పేదలందరికి ఆహారానికి ఇబ్బంది కలుగకుండా ఒక్కో వ్యక్తికి 12 కిలోల చొప్పున బియ్యం అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో  2,75,020 కార్డులు ఉండగా ఆయా కార్డులున్న కుటుంబాలలో 8లక్షల 20వేల 28 మంది పేదలున్నారు. వీరందరికి ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున లక్ష క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేయనున్నారు.


కుటుంబానికి 1500 చొప్పున 2,75,020 కార్డులున్నవారికి 41 కోట్ల 25 లక్షల 30వేల రూపాయలు ఆర్థిక సహాయం అందనున్నది. మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో ప్రసవానికి ఉన్న మహిళలకు రాష్ట్ర ప్రభుత్వమే వాహనాలను సమకూర్చి ఆస్పత్రులకు తీసుకొని వచ్చి వైద్యసేవలందించనున్నది. లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రజలెవరూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం సూచించింది. కర్ఫ్యూ సందర్భంగా ఎలా వ్యవహరిస్తారో అలా ఇళ్లకు పరిమితమై బయటకు రాకుండా ఉండి కరోనా వైరస్‌ను అరికట్టడానికి సహకరించాలని ప్రభుత్వం సూచించింది. పాలు, కూరగాయలు, మందులలాంటి అత్యవసరాల కోసం ఇంటి నుంచి ఒకరు బయటకు వచ్చి అవసరాలు తీర్చుకోవచ్చుగానీ గుంపులుగా తిరగవద్దని సూచించారు. 


కరోనా నియంత్రణ పోరులో కరీంనగర్‌ ఆదర్శం.. మంత్రి గంగుల కమలాకర్‌ 

కరోనా వైరస్‌ నియంత్రణ పోరులో కరీంనగర్‌ ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. రాష్ట్రంలో గరిష్టంగా ఒకేసారి కరీంనగర్‌లోనే 10 కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయని, దీంతో ఆ వైరస్‌ను కట్టడిచేసేందుకు అధికార యంత్రాంగం సైనికుల్లా యుద్దమే చేస్తుందని అన్నారు. వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా ఉండేందుకు కరీంనగర్‌ ప్రజలు స్వీయ నిర్బంధంతో అడ్డుకుంటున్నారని చెప్పారు. కరీంనగర్‌ నుంచి కరోనాను తరిమికొట్టాలన్న సీఎం కేసీఆర్‌ మాటాలను స్పూర్తిగా తీసుకొని జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాల సిబ్బంది సైనికుల్లా మారి ఆ మహమ్మారిపై పోరాటం చేస్తున్నారని అన్నారు.


నిత్యం నగరంలోని గల్లీలో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ సిబ్బందిలో స్ఫూర్తి నింపుతున్నామని, 700 కార్మికులతో పారిశుధ్య పనులు చేపడుతున్నామని చెప్పారు. నగరవాసులను చూస్తుంటే గర్వంగా ఉందని అన్నారు. నగరానికి ఇలాంటి దుస్థితి వస్తుందని అనుకోలేదని, నగర ప్రజల ఐక్యత, ఓపిక ముందు కరోనా వైరస్‌ నిలువలేదనే ధీమాను మంత్రి వ్యక్తం చేశారు. కరీంనగర్‌ వాసుల స్వీయ నియంత్రణకు మంత్రి సెల్యూట్‌ చేశారు. 


జనతా కర్ఫ్యూ... ప్రపంచానికే స్పూర్తిదాయకం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌

 జనతా కర్ఫ్యు ప్రపంచానికే స్పూర్తిదాయకమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం ఇంట్లోనే క్వారెంటైన్‌ విధించుకుని, సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి చప్పట్లతో సంఘీభావం ప్రకటించారు. ప్రధాని మోదీ పిలుపుతో దేశం యావత్తు స్వీయ నిర్బంధం విధించుకుందని, కరోనాతో యుద్ధం చేస్తున్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీస్‌, మీడియాతో పాటు ఇతర సిబ్బందికి చప్పట్లతో సంఘీభావం ప్రకటించి ఐక్యతను చాటిందన్నారు. దేశవాసులంతా జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొని కరోనాపై యుద్ధానికి సన్నద్ధమవడం స్పూర్తిదాయకమన్నారు. కొత్త వ్యక్తుల సమాచారాన్ని వెంటనే అధికారులకు అందించాలన్నారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్‌ వచ్చిన బృందం పర్యటన, ఇతర సమాచారాన్ని దాచిపెట్టడంతోనే ఇతరులకు నష్టం జరిగే పరిస్థితి తలెత్తిందన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలను ప్రజలు తప్పకుండా పాటించాలన్నారు.

Updated Date - 2020-03-23T10:46:17+05:30 IST