ఈఏడాది సీజనల్‌ జ్వరాలు లేనట్లే..

ABN , First Publish Date - 2020-09-14T10:35:47+05:30 IST

ప్రతి ఏటా వర్షాకాలం సీజన్‌లో ప్రబలే డెంగ్యూ, చికున్‌గున్యా, ఇతరత్రా వైరల్‌ జ్వరాలు కరోనా మాటున తాత్కాలికంగా కనుమరుగు కావడంతో ప్రజలంతా ఊపిరి

ఈఏడాది సీజనల్‌ జ్వరాలు లేనట్లే..

డెంగ్యూ, చికున్‌గున్యా తాత్కాలికంగా కనుమరుగు

ఊపిరి పీల్చుకున్న ప్రజలు, ప్రభుత్వం

కరోనా వైరస్‌తోనే తీవ్ర ఆందోళన..


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ప్రతి ఏటా వర్షాకాలం సీజన్‌లో ప్రబలే డెంగ్యూ, చికున్‌గున్యా, ఇతరత్రా వైరల్‌ జ్వరాలు కరోనా మాటున తాత్కాలికంగా కనుమరుగు కావడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. టైఫాయిడ్‌ జ్వరాలు మినహా ఇతరత్రా జ్వరాలు రావడం లేదు. ఇప్పుడు భయమంతా కరోనాతోనే.. మార్చిలో రాష్ట్రంలో ప్రవేశించిన కరోనా వైరస్‌ ఇక్కడ, అక్కడ అని గాకుండా పట్టణాలు, పల్లెలకు కూడా పాకింది. కరోనా వైరస్‌ వ్యాప్తి కోసం లాక్‌ డౌన్‌లు, ఇతరత్రా కట్టడులు చేపట్టినా కూడా వ్యాప్తి ఆగడం లేదు. కరోనాతో సహ జీవనం చేయాల్సి వస్తున్నది. టీకాలు వచ్చే వరకు కరోనా వ్యాప్తి ఆగదనే విషయం అందరికి అర్థం అయ్యింది. కరోనా రాకుండా భౌతికదూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ, శానిటైజర్లను వినియోగిస్తున్నారు. ఈ కరోనాతో మనుషుల జీవన శైలి పూర్తిగా మారగా, ప్రకృతిలోనూ పలు మార్పులు చోటుచేసుకున్నాయి. 


వర్షాకాలం ప్రారంభంలోనే..

సాధారణంగా ప్రతిఏటా వర్షాకాలం సీజన్‌ ప్రారంభం కాగానే వైరల్‌ జ్వరాలు, డెంగ్యూ, చికున్‌ గున్యా, మలేరియా జ్వరాలు వస్తుంటాయి. కానీ ప్రస్తుతానికి కరోనా మాటున జిల్లాలో ఆ జ్వరాలు ప్రబలడం లేదు. సాధారణంగా చలికాలంలో ప్రబలే టైఫాయిడ్‌ జ్వరాలు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ఉంటే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం చెబుతున్నది. ఆ మేరకు చాలా మంది జిల్లాలో కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. సాధారణ జ్వరాలు లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటుండగా, కరోనా వైరస్‌ ఏవైపు నుంచి వస్తుందోనని భయాందోళనకు చెందుతున్నారు. వైరల్‌ జ్వరాలు వస్తే డాక్టర్లను సంప్రదించి మందులు వాడేవాళ్లు. డెంగ్యూ, చికున్‌గున్యాలాంటి జ్వరాలు వస్తే తప్పనిసరిగా ఆసుపత్రిలో చేరేవాళ్లు. డెంగ్యూ జ్వరం తగ్గాలంటే రక్త కణాల సంఖ్య పెరిగే వరకు ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తుంది. ఒక్కోసారి మరణాలు కూడా సంభవిస్తుంటాయి. ఆ భయంతోనే చాలామంది ఆసుపత్రుల్లో చేరి చికిత్స తీసుకుంటూ ఉంటారు. ఇందుకోసం 10వేల నుంచి 50 వేల రూపాయల వరకు ఖర్చు అయిన సందర్భాలు ఉన్నాయి. 


కరోనాతోనే ఆందోళన...

కరోనా వచ్చిన వాళ్లకు మాత్రం ప్రస్తుతం వ్యాధి తీవ్రత ఎక్కువగా లేకుంటే ఇంటివద్దనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. శ్వాసకోశ సమస్యలు, మూత్రకోశ వ్యాధులు, షుగర్‌, బీపీలాంటి సమస్యలు ఉన్న వారికి మాత్రం కరోనా వస్తే తప్పనిసరిగా ఆసుపత్రికి తీసుకవెళుతున్నారు. రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోతుండడంతో ప్రమాదంలో పడుతున్నారు. కరోనా బారి నుంచి తమను తాము రక్షించుకునేందుకే ప్రజలు ఆరాటపడుతున్నారు. ప్రభుత్వం కూడా వర్షాకాలం సీజన్‌లో కరోనాకు తోడు సీజనల్‌ వ్యాధులు ప్రబలితే చికిత్స అందించడం కష్టం అని ఒకింత ఆందోళనకు గురయ్యింది. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉండడంతో ప్రభుత్వం కూడా ఊపిరి పీల్చుకున్నది. కరోనా వచ్చిన వారికి చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తున్నది.


జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు కేవలం 21 మందికి డెంగ్యూ జ్వరం వచ్చిందని, ఒకరికి స్వైన్‌ఫ్లూ జ్వరం వచ్చిందని, చికున్‌గున్యా ముగ్గురికి వచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ ప్రమోద్‌కుమార్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ప్రతి ఏటా ఈ సమయంలో జ్వరాలు అధికంగా ఉండేవని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, పూర్తి భిన్నంగా ఉందన్నారు. కేవలం టైఫాయిడ్‌ జ్వరం మాత్రమే వస్తుందని, టైఫాయిడ్‌ వచ్చిన వారందనీ కూడా కరోనా పరీక్షలు చేసుకోవాలని చెబుతున్నామని, అందులో కొందరికి పాజిటివ్‌ వస్తున్నదని, ఆ మేరకు వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు.

Updated Date - 2020-09-14T10:35:47+05:30 IST