పెరుగుతున్న కేసులు

ABN , First Publish Date - 2020-05-17T10:39:30+05:30 IST

ముంబయి వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌ వస్తుండటంతో జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. ముంబాయి నుంచి వచ్చిన వారిపై నిఘా

పెరుగుతున్న కేసులు

వలస కార్మికులపై అధికారుల నిఘా

ముంబాయి నుంచి వచ్చిన మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌

పట్టణంలో పనిచేయని సరి, బేసి


ఆంధ్రజ్యోతి, జగిత్యాల: ముంబయి వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌ వస్తుండటంతో జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. ముంబాయి నుంచి వచ్చిన వారిపై నిఘా పెట్టాలని కలెక్టర్‌ రవి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హోం క్వారంటైన్‌లో ఉంటున్నప్పటికీ ఎవరూ నిబంధనలు ఉల్లంఘించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శనివారం మరో ఇద్దరు వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇప్పటి వరకు ముంబాయి నుంచి వచ్చిన ఎనమిది మందికి వైరస్‌ సోకడంతో ఇప్పుడు వలస కార్మికుల్లో ఆందోళన నెలకొంది. వారం, పది రోజుల క్రితం వీరు ముంబాయి నుంచి రాగా, వ్యాధి లక్షణాలు కనిపిస్తున్న వారికి పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. వారి కుటుంబసభ్యులు హోం క్వారంటైన్‌లో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ముంబాయి నుంచి వస్తున్న వలస కూలీల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా జిల్లాలో కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. 


మరో ఇద్దరికి పాజిటివ్‌

ధర్మపురి మండలం నేరళ్లకు చెందిన ఓ వ్యక్తి ఆయన కుమారునితో కలిసి ముంబాయిలో కల్లు దుకాణం నడుపుకుంటూ జీవిస్తుంటాడు. భార్య నేరెళ్లలోనే ఉంటుంది. ఈ నెల 8న ఆయన, ఆయన కుమారునితో పాటు కల్లు దుకాణంలో పనిచేసే మరో వ్యక్తి కలిసి ట్యాక్సీ తీసుకుని నేరెళ్లకు వచ్చారు. మొదట్లో వీరికి ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో స్టాంపులు వేసి హోం క్వారంటైన్‌లో ఉండాలంటూ వైద్యాధికారులు సూచించారు. రెండు, మూడు రోజులుగా ఒళ్లంతా నొప్పులతో పాటు వాపులు రావడంతో వైద్యాధికారులకు సమాచారం అందించారు. వారి సూచన మేరకు అతన్ని జగిత్యాల ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్‌లో పెట్టారు. రక్త నమూనాలు తీసి వరంగల్‌కు పంపగా, శనివారం కరోనా పాజిటివ్‌ అని తేలింది. జగిత్యాలలో ఉన్న ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.


కలెక్టర్‌ రవి ఆదేశాల మేరకు జగిత్యాల ఆర్డీవో డాక్టర్‌ జి.నరేందర్‌ నేరెళ్లకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. వీధుల్లో సోడియం హైపోక్లోరైడ్‌ పిచికారీ చేయించారు. అయితే ముంబాయి నుంచి వచ్చిన వ్యక్తికి ఇద్దరు కుమారులు కాగా, ఒకరు ఆయనతో ముంబాయి నుంచి రాగా, మరో కుమారుడు నేరెళ్లలోనే ఉంటాడు. ఆయన స్థానికంగా ఉన్న వాటర్‌ ప్లాంట్‌తో పాటు ఓ కిరాణం షాపునకు వెళ్లినట్లు అధికారులు గుర్తించి, ఆ రెండు షాపులను మూసివేశారు. వారి కుటుంబసభ్యులను హోం క్వారంటైన్‌లో ఉండాలంటూ సూచించారు. అలాగే కథలాపూర్‌ మండలం చింతకుంటకు చెందిన మరో వ్యక్తికి కూడా శనివారం కరోనా పాజిటివ్‌ అని తేలింది. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తితో పాటు ఆయన భార్య, పిల్లలు, ఆయన సోదరునితో పాటు భార్యాపిల్లలు కలిసి ఈ నెల 9న ఏడుగురు అద్దెకు కారు తీసుకుని ముంబాయి నుంచి చింతకుంటకు వచ్చారు. మొదట్లో వీరికి ఎలాంటి వైరస్‌ లక్షణాలు లేకపోగా, మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. స్థానిక వైద్యాధికారులు గమనించి, జగిత్యాలకు తరలించి పరీక్షలు చేయించగా ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. జిల్లా వైద్యాధికారి శ్రీధర్‌ చింతకుంటకు వెళ్లారు. ఈ ఇద్దరు వ్యక్తులు వారం రోజులుగా ఇంట్లోనే ఉన్నారా, ఎవరెవరిని కలిశారు అనే వివరాలు సేకరిస్తున్నారు.  


పట్టణంలో కనిపించని సరి, బేసి

జగిత్యాల జిల్లాలో వ్యాపారులు లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెటపల్లి, రాయికల్‌, ధర్మపురి మున్సిపాలిటీలు ఉండగా, ఆయా మున్సిపాలిటీల్లో సరి, బేసి విధానం పాటించాల్సి ఉంది. 50 శాతం మేరకు షాపులు తెరువాలని, పక్క పక్క షాపులు తెరుచుకోకుండా సరి, బేసి విధానం పాటించేలా ఎంపిక చేశారు. రెండు, మూడు రోజుల పాటు బాగానే ఉన్నా.. శనివారం ఎక్కడ చూసినా నిబంధనలు పాటించినట్లు కనిపించలేదు. జగిత్యాలలోనైతే యావర్‌ రోడ్డు, టవర్‌ సర్కిల్‌ ప్రాంతంలో వరుసగా అన్ని షాపులు తెరిచి ఉంచడం కనిపించింది. షాపుల్లో కూడా భౌతిక దూరం లేకపోగా, కనీసం మాస్క్‌లు కూడా పెట్టుకుని కనిపించలేదు. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో జగిత్యాల జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో సరి, బేసి విధానం అమలు జరుగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాహనాలపై వెళ్లేవారిని పట్టుకుని కేసులు పెడుతున్న పోలీసులు వ్యాపార సంస్థల యాజమానులు నిబంధనలు ఉల్లంఘించినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


వలస కార్మికులతో వణుకుతున్న జిల్లావాసులు

జగిత్యాల జిల్లా ప్రజలు ముంబాయి వలస కార్మికులకు రోజుకో చోట కరోనా పాజిటివ్‌ వస్తుండటంతో వణికి పోతున్నారు. ఇప్పటికే జగిత్యాల 4,218 మంది వలస కార్మికులు జిల్లాకు చేరుకున్నారు. ఇందులో ముంబాయి నుంచి వచ్చినవారే 3 వేల మందికి పైగా ఉన్నారు. ముంబాయి నుంచి వస్తున్నవారికి నామ్‌కేవాస్తేగా పరీక్షలు చేసి, వ్యాధి లక్షణాలు లేవంటూ స్టాంపులు అధికారులు వేసి ఇంటికి పంపుతున్నారు. గొల్లపల్లి మండలం చెందోళి, చిల్వాకోడూర్‌, మల్యాల మండలం తాటిపెల్లి, వెల్గటూర్‌ మండలం గుల్లకోట, మల్లాపూర్‌, కోరుట్ల మండలంలోని రెండు, మూడు గ్రామాలు మినహాయిస్తే అన్ని చోట్ల ముంబాయి నుంచి వచ్చినవారు ఇళ్లలోనే ఉంటున్నారు.


అయితే వీరు క్వారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘించడంతో పల్లె ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. అధికారులు వస్తున్నప్పుడు ఇళ్లల్లోనే ఉంటున్నా ఆ తర్వాత స్నేహితులతో కలిసి తిరుగుతుండటంతో పల్లె ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.  ఇప్పటికైనా అధికారులు, నాయకులు చొరవ తీసుకుని ముంబాయి నుంచి వచ్చినవారందరినీ ప్రభుత్వ క్వారంటైన్‌లలో ఉంచి పరీక్షలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.  


Updated Date - 2020-05-17T10:39:30+05:30 IST