-
-
Home » Telangana » Karimnagar » Increased cotton cultivation area in the district
-
పత్తికి..మద్దతు లభించేనా..?
ABN , First Publish Date - 2020-10-07T06:13:55+05:30 IST
సీఎం కేసీఆర్ సూచన మేరకు నియంత్రిత సాగు విధానంలో జిల్లాలో ఈ సీజన్‌లో పత్తి సాగు విస్తీర్ణం పెరిగింది. అయినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి, పత్తి

జిల్లాలో పెరిగిన పత్తి సాగు విస్తీర్ణం
వర్షాలకు దెబ్బతిన్న పంట
ఆశించిన దిగుబడులు రావడం కష్టమే
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
సీఎం కేసీఆర్ సూచన మేరకు నియంత్రిత సాగు విధానంలో జిల్లాలో ఈ సీజన్‌లో పత్తి సాగు విస్తీర్ణం పెరిగింది. అయినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి, పత్తి గింజలకు డిమాండ్ లేకపోవడంతో రైతులకు మద్దతు ధరలు దక్కడం ప్రశ్నార్థకంగా మారింది. ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద పత్తి మార్కెట్లుగా వరంగల్ ఏనుమాముల, జమ్మికుంట, భైంసా, ఆదిలాబాద్ మార్కెట్‌లు ఉన్నాయి. ఈ మార్కెట్లకు ఇప్పుడిప్పుడే పంట ఉత్పత్తులు వస్తున్నాయి. వాటికి మద్దతు ధరలు దక్కకపోవడం ఆందోళన కలిగిస్తున్నది.
‘మద్దతు’పై అనుమానాలు..
ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం పంట ఉత్పత్తులకు మద్దతు ధరలను పెంచుతుంది. వాటిని అక్టోబర్ 1వ తేదీ అమల్లోకి తీసుకవస్తుంది. అందులో భాగంగా మీడియం స్టేబుల్ గల పత్తి ధర 5255 నుంచి 5515కు, లాంగ్ స్టేబుల్ గల పత్తి ధర 5550 నుంచి 5825 రూపాయలకు పెంచారు. ఈ ధరలు ఈ సీజన్‌లో రైతులకు లభించడం కష్టమేనని తెలుస్తున్నది. గత ఏడాది సీజన్‌లో సీసీఐ కేంద్రాల్లో మినహా వ్యాపారులు, మధ్య దళారులు, ఆడ్తి వ్యాపారులు మద్దతు ధరలు పెట్టకపోవడం గమనార్హం. ఈ ఏడాది మద్దతు ధరలు పెరిగినప్పటికీ, గత ఏడాది ధరలు రావడం కష్టమేనని తెలుస్తున్నది. జిల్లాలో 75,931 ఎకరాల్లో పత్తి సాగుచేయగా, 9 లక్షల క్వింటాళ్ల వరకు పంట దిగుబడులు వస్తాయని మార్కెటింగ్ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు.
కొనుగోళ్లకు ఏర్పాట్లు..
జిల్లాలో పత్తి కొనుగోళ్ల కోసం జిన్నింగ్ మిల్లుల వద్ద సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం జమ్మికుంట మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మొదటి రకం పత్తికి క్వింటాలుకు 5 వేల రూపాయల ధర కూడా పలక లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో బేల్ ధరలు తగ్గుముఖం పట్టడం వల్లనే ఇక్కడ డిమాండ్ తగ్గింది. పత్తి గింజలకు కూడా ధర అంతంత మాత్రంగానే ఉన్నది. దీంతో పత్తికి మద్దతు ధరలు దక్కే అవకాశాలు కనబడడం లేదు. రైతులు తమ ఇష్టారాజ్యంగా పంటలను సాగు చేస్తున్నారని, దీని వల్ల మద్దతు ధరలు దక్కడం లేదని భావించిన సీఎం కేసీఆర్ ప్రాంతాల వారీగా డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని సూచించారు. నియంత్రిత విధానంలో పంటలను సాగు చేయాలని పిలుపునిచ్చారు. ఈ సీజన్‌లో మొక్కజొన్న పంటను సాగు చేయవద్దని సూచించిన మేరకు రైతులు ఆ పంటను వేయలేదు. దానికి ప్రత్రామ్నాయంగా పత్తి, కంది సాగును పెంచాలని సూచించడంతో ఆ మేరకు జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం పెరిగింది. మద్దతు ధరలే ప్రశ్నార్థకంగా మారాయి.
దెబ్బతీసిన వర్షాలు..
ఈ ఏడాది భారీ వర్షాలు పడడంతో చాలా వరకు పంటలు దెబ్బతిన్నాయి. వీటి వల్ల కూడా రైతులు నష్టపోతున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది దిగుబడులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. రైతులు తొందర పడకుండా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా 8 నుంచి 12 శాతం లోపు తేమ ఉండే విధంగా పత్తిని సీసీఐ కేంద్రాలకు తీసుకవచ్చి విక్రయించుకుంటే మద్దతు ధరలు దక్కనున్నాయని జిల్లా మార్కెటింగ్ శాఖాధికారి ప్రవీణ్ రెడ్డి సూచించారు.