లాక్‌డౌన్‌తో ఊపందుకున్న ‘స్మార్ట్‌సిటీ’ పనులు
ABN , First Publish Date - 2020-04-26T10:38:50+05:30 IST
కరోనా పుణ్యమా అని కరీంనగర్‌లో స్మార్ట్‌సిటీ పనుల్లో వేగం పెరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించడంతో నిత్యం వాహనాలతో

రేయింబవళ్లు సాగుతున్న రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు
మాస్క్‌లు, భౌతిక దూరం పాటిస్తున్న కార్మికులు
కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 25: కరోనా పుణ్యమా అని కరీంనగర్‌లో స్మార్ట్‌సిటీ పనుల్లో వేగం పెరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించడంతో నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
కరోనా కట్టడికి అత్యవసరమైతే తప్పా ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ ప్రభుత్వం ఆంక్షలు విధించడం, పోలీసులు కూడా రోడ్డుపైకి వచ్చే వారి వాహనాలను పెద్ద ఎత్తున సీజ్ చేస్తుండడంతో ఉదయం 11 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు దాదాపుగా ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ సమయంలో పనులను వేగంగా చేసేందుకు వీలవుతుందని భావించి స్మార్ట్‌సిటీ పథకం కింద రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ కె శశాంక అనుమతి తీసుకున్న కాంట్రాక్టర్ రేయింబవళ్లు రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణ పనులు పూర్తి చేయిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పరిమిత కార్మికులతో పనులు చేయిస్తున్నారు.
జనసంచారం లేకపోవడంతో పనుల్లో వేగం
కార్మికులు విధిగా మాస్కులు, గ్లౌజులు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటిస్తూ పనుల్లో వేగం పెంచారు. ఇదే తరహాలో పనులు చేపడితే రెండు నెలల్లో స్మార్ట్‌సిటీ రోడ్డు పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలో లాక్‌డౌన్‌తో ఎక్కడికక్కడే పనులు నిలిచిపోగా వాటిని కొనసాగించడానికి కలెక్టర్ అనుమతించారు. లాక్‌డౌన్‌తో రహదారులు నిర్మానుష్యంగా మారడంతో పనులు వేగంగా సాగుతున్నాయి.
స్మార్ట్‌సిటీ పరిధిలోని 31 డివిజన్లలో స్మార్ట్‌సిటీ పనులు చేసేందుకు 1,878 కోట్లతో ప్రతిపాదనలను పంపించగా వాటికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా మొదటి విడతలో 21 ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు టెండర్లు పిలవగా అందులో కొన్ని ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 266.66 కోట్లతో చేపట్టే పనులకు టెండర్లు పూర్తి కాగా అందులో రోడ్లు, మురుగు కాల్వలకు సంబంధించి 217.7 కోట్ల పనులు ఉన్నాయి. 53.7 కోట్లతో ప్యాకేజీ-3 కింద, 84 కోట్లతో ప్యాకేజీ-1, 80 కోట్లతో ప్యాకేజీ-2 కింద రహదారుల నిర్మాణ పనులను ప్రారంభించారు. వీటిలో శాతవాహన యూనివర్సిటీ నుంచి జ్యోతినగర్, కలెక్టరేట్ నుంచి ఎల్‌ఐసీ కార్యాయం, కలెక్టరేట్ నుంచి భగత్‌నగర్, అంబేద్కర్ స్డేడియం వైపు, గౌతమినగర్, రాంచంద్రాపూర్‌కాలనీ బైపాస్ రోడ్డు, కిసాన్‌నగర్ రైల్వే స్టేషన్ రోడ్డు, గాంధీరోడ్డు నుంచి రాజీవ్‌చౌక్ రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయి.
మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ కె.శశాంక, మేయర్ వై సునీల్‌రావు, కమిషనర్ వల్లూరి క్రాంతి స్మార్ట్‌సిటీ పనులను పరుగుపెట్టించేందుకు వివిధశాఖల అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశాలను నిర్వహించి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. కాంట్రాక్టర్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్ అధికారులు కూడా పర్యవేక్షిస్తూ పనుల్లో వేగం పెంచేందుకు సహకరిస్తున్నారు. మేయర్, కమిషనర్ రోడ్లను ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ పరిశీలిస్తున్నారు. ఏడాది కాలంగా కొనసాగుతున్న స్మార్ట్‌సిటీ రోడ్డు పనులు దసరా వరకు పూర్తయితే ప్రజల కష్టాలు చాలా మేరకు తీరిపోవడమే కాకుండా కరీంనగర్ స్మార్ట్‌సిటీగా రూపుదిద్దుకుంటుంది.