మత్స్యకారుల్లో ఆశలు
ABN , First Publish Date - 2020-09-20T07:32:40+05:30 IST
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో నీటి వనరులు పెరగడంతో గత ఏడాది నుంచి చేపల ఉత్పత్తి పెరుగుతూ వస్తున్నది...

జీవధారగా మారిన గోదావరి, మానేరు నదులు
నిండుగా జలాశయాలు, చెరువులు, కుంటలు
జిల్లాలో రెండింతలు పెరిగిన చేపల ఉత్పత్తి
గత ఏడాది రూ.57.76 కోట్ల విలువైన చేపల ఉత్పత్తి
కోల్డ్ స్టోరేజీలు, మార్కెట్ సౌకర్యాలు కరువు
నేడు జిల్లాలో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పర్యటన
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో నీటి వనరులు పెరగడంతో గత ఏడాది నుంచి చేపల ఉత్పత్తి పెరుగుతూ వస్తున్నది. పట్టిన చేపలను నిల్వచేసేందుకు కోల్డ్ స్టోరేజీ, చేపలు విక్రయించేందుకు పలు ప్రాంతాల్లో ప్రత్యేక మార్కెట్ల సౌకర్యం లేకపోవడంతో మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేయాలని మత్స్యకారులు పలుసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినప్పటికీ ఆ సమస్య తీరడం లేదు. జిల్లాలో ప్రవహిస్తున్న గోదావరి, మానేరు నదులు జీవధారలు మారాయి. వీటిలో ప్రవహించే నీటిని నిల్వ చేస్తుండడంతో చేపల ఉత్పత్తి పెరిగింది. గడిచిన ఏడాది 7220 టన్నుల చేపల ఉత్పత్తి జరిగింది. సగటున టన్ను చేపలకు 80 వేల చొప్పున లెక్క గట్టినా 57 కోట్ల 76 లక్షల రూపాయల ఆదాయం సమకూరుతున్నది.
నిండుగా గోదావరి
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మొదలు మేడిగడ్డ వరకు గోదావరి నిండుగా ఏడదంతా జలకళతో ఉట్టి పడుతున్నది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, సుందిళ్ల వద్ద గల పార్వతీ బ్యారేజీ, అన్నారం వద్ద గల సరస్వతీ బ్యారేజీలో గత ఏడాది నుంచి పెద్ద ఎత్తున చేపలను పెంచుతున్నారు. ఈ బ్యారేజీలు పెద్దపల్లి జిల్లాకు చెందిన మత్స్యకారులకే గాకుండా మంచిర్యాల జిల్లా మత్స్యకారులకు కూడా ఎంతగానో ఉపయోగపడుతున్నది. గత ఏడాదే కాళేశ్వరం బ్యారేజీలు పూర్తికావడంతో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఈ బ్యారేజీలే గాకుండా ధర్మారం మండలం నందిమేడారం చెరువును విస్తరించి రిజర్వాయర్‌గా మార్చారు. ఇందులో కూడా పెద్దఎత్తున చేపలు పెంచుతున్నారు. జలశయాలే గాకుండా 1,076 చెరువులు, కుంటలు ఉన్నాయి. ఇవేగాకుండా మానేరు నదిపై పలుచోట్ల చెక్‌డ్యామ్‌లు ఉండగా, నూతనంగా మరో 8 నిర్మాణాలు కావాల్సి ఉన్నాయి. చేపల పెంపకంపై మత్స్యకారులు ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 134 మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా, వీటిలో 9,014 మంది సభ్యులు ఉన్నారు. 20 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా వీటిలో 615 మంది సభ్యులు ఉన్నారు. 7 మత్స్య ప్రాథమిక మార్కెటింగ్ సోసైటీలు ఉండగా వీటిలో 360 మంది సభ్యులు ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందు జిల్లాలో చేపల ఉత్పత్తి 2,500 టన్నులకు మించలేదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండితేనే చెరువులు, కుంటల్లో కాస్త నీళ్లు ఉండేవి. గత ఏడాది నుంచి పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తుండడంతో జలాశయాలన్నీ జలకళతో ఉట్టి పడుతున్నాయి. ఒకవేళ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండకున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు వచ్చేవి. ఇక నుంచి జిల్లాలో చెరువులు, కుంటలు ఎండిపోయే పరిస్థితి లేదు.
రెండింతలైన చేపల ఉత్పత్తి
గత ఏడాది నుంచి జిల్లాలో చేపల ఉత్పత్తి గతంలో కంటే రెండింతలు పెరిగింది. ఈ ఏడాది 57 కోట్ల 76 లక్షల రూపాయల విలువైన 7,220 టన్నుల చేపల ఉత్పత్తి జరిగింది. మధ్య వ్యాపారులు మత్స్యకారుల నుంచి చేపలను కొనుగోలు చేసి మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, గుజరాత్ వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ వ్యాపారాన్ని మత్స్యకారులే సొంతంగా నిర్వహించేందుకు గాను కావాల్సిన కోల్డ్ స్టోరేజీ సౌకర్యం లేక పోవడంతో మధ్య వ్యాపారులకు తక్కువ ధరలకు విక్రయించాల్సి వస్తున్నది. పెంచుతున్న చేపలు హైబ్రీడ్ చేపలు కావడంతో పట్టిన వెంటనే అవి తొందరగా చనిపోతాయి. పట్టిన వెంటనే వాటిని ఐస్ ట్రేలలో వేసి కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసుకుంటే వారం రోజుల వరకు వాటిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకునే అవకాశాలు ఉంటాయి. స్థానికులకు ఏ రోజు పట్టిన చేపలు అదే రోజు లభిస్తున్నప్పటికీ, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకునేందుకు అవకాశాలు లేకుండా పోతున్నాయి. స్థానికంగా కిలో బొబ్చె, రోహు, బంగారు తీగ చేపలు స్థానికంగా కిలోకు 100 నుంచి 150 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఎగుమతి చేస్తే దాదాపు అంతే ధర వచ్చే అవకాశాలున్నాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడా కోల్డ్ స్టోరేజీలు లేవు. గోదావరిఖని, రామగుండం, పెద్దపల్లి, మంథని ప్రాంతంలో గానీ కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేస్తే నాలుగు జిల్లాల మత్స్యకారులు మరింత అభివృద్ధి చెందేందుకు ఉపయుక్తంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే రామగుండం, గోదావరిఖని, సుల్తానాబాద్ కేంద్రాల్లో ప్రత్యే చేపల మార్కెట్లను ఏర్పాటు చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. ఆదివారం జిల్లాలో పర్యటిస్తున్న రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై మత్స్యకారులు ఆశలు పెంచుకున్నారు. ఈ పర్యటనలోనే కోల్డ్ స్టోరేజీలు, మార్కెట్ల ఏర్పాటుకు హామీ ఇస్తారని ఆశిస్తున్నారు.
జిల్లాలో మంత్రి తలసాని పర్యటన నేడు..
రాష్ట్ర మత్స్య సహకార శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం ఉదయం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు అంతర్గాం మండలం కుందనపల్లి వద్ద నాలుగున్న ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న గొర్రెలు, మేకల మార్కెట్ యార్డు నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ పి రాజన్న తెలిపారు. ఈ యార్డుకు శాఖ ద్వారా 25 లక్షల రూపాయలు మంజూరయ్యాయని, ఇతరత్రా షెడ్లు, ప్లాట్‌ఫామ్‌ల నిర్మాణాల కోసం కూడా నిధులు మంజూరు కానున్నాయని తెలిపారు. 11 గంటలకు గోదావరి నదిలో చేప పిల్లలను వదిలి పెట్టనున్నారు.