జిల్లాలో భారీ వర్షం

ABN , First Publish Date - 2020-08-18T11:13:40+05:30 IST

కరీంనగర్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అల్పపీడనం ప్రభావంతో ఐదు రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి

జిల్లాలో భారీ వర్షం

కరీంనగర్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అల్పపీడనం ప్రభావంతో ఐదు రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్‌ జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఈనెల 15న జిల్లావ్యాప్తంగా సగటున 10.8 సెంటీమీటర్లు, 16న 8.1 సెంటీమీటర్లు, 17న 5.7 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లావ్యాప్తంగా 24,803 ఎకరాల్లో పంటలు నీటమునిగాయి.


56 గ్రామాల పరిధిలో 404 మంది రైతులకు చెందిన7,276 ఎకరాల్లో వేసిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నీట మునిగిన పంటల్లో కూడా చాలా మట్టుకు రైతులు నష్టపోయే ప్రమాదమున్నదని భావిస్తున్నారు. మరో రెండు రోజులపాటు వర్షాలు ఇలాగే కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో పంట చేళ్ళలో ఉన్న నీరు తొలిగి పోకుండా ఉండడంతోపాటు మరింత కొత్త వరద వచ్చి చేరే ప్రమాదం లేక పోలేదని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సోమవారం జిల్లాలో సగటున 5.7 సెంటీ మీటర్ల వర్షాపాతం నమోదుకాగా అత్యధికంగా గంగాధరలో 7.9 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. జమ్మికుంటలో 7.8, హుజురాబాద్‌లో 7.7, రామడుగులో 7.5 సెంటీ మీటర్ల వర్షం కురిసింది.


పంటలు దెబ్బతిన్న ప్రాంతాలతోపాటు ఇళ్లలోకి నీరు ప్రవేశించిన లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ళు కూలిపోయి ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో మంత్రులు గంగుల కమలాకర్‌, ఈటల రాజేందర్‌ పర్యటించారు. కరీంనగర్‌ నియోజకవర్గంలో మంత్రి గంగుల కమలాకర్‌, హుజురాబాద్‌ నియోజకవర్గంలో మంత్రి ఈటల రాజేందర్‌ పర్యటించి నష్టాలను అంచనా వేయాలని అధికారులను ఆదేశించడంతోపాటు పంటలు దెబ్బతిన్న ఇతరత్రా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కరీంనగర్‌ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ తన నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించారు.

Updated Date - 2020-08-18T11:13:40+05:30 IST