హరహర మహదేవ

ABN , First Publish Date - 2020-12-01T05:44:33+05:30 IST

వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం కార్తీకమాసం మూడో సోమవారం సందర్భంగా శివనామస్మరణతో మార్మోగింది. పవిత్రమైన కార్తీక మాసంలో శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన సోమవారం రోజున స్వామివారిని దర్శించుకోవడానికి సుమారు 30 వేల మందికిపైగా భక్తులు తరలివచ్చారు.

హరహర మహదేవ
వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ ఆవరణలో భక్తుల సందడి

- శివనామస్మరణతో మార్మోగిన రాజన్న క్షేత్రం

- 30వేల మందికిపైగా భక్తుల రాక 

వేములవాడ, నవంబరు 30: వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం కార్తీకమాసం మూడో సోమవారం సందర్భంగా శివనామస్మరణతో మార్మోగింది. పవిత్రమైన కార్తీక మాసంలో శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన సోమవారం రోజున స్వామివారిని దర్శించుకోవడానికి  సుమారు 30 వేల మందికిపైగా భక్తులు తరలివచ్చారు. కొవిడ్‌-19 నిబంధనల మేరకు లఘుదర్శనం అమలు చేస్తుండడంతో నందీశ్వరుడి వద్ద నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు  స్వామివారి కోడెమొక్కులు చెల్లించుకున్నారు.  స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం వంటి ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు.  భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌ నేతృత్వంలో అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేశారు.


ఘనంగా మహాపూజ 

కార్తీక పౌర్ణమి సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామివారికి సోమవారం రాత్రి మహాపూజ ఘనంగా నిర్వహించారు. కార్తీకమాసం మూడో సోమవారం సందర్భంగా ఉదయం ఆలయ అర్చకులు రాజరాజేశ్వరస్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సాయంత్రం  స్వామివారి కల్యాణమండపంలో మహాలింగార్చన వంటి కార్యక్రమాలు చేపట్టారు.  కార్తీక పౌర్ణమి వేడుకల్లో భాగంగా ప్రధాన ఆలయం ఆవరణలో భక్తులు లింగాకారంలో కార్తీక దీపాలను వెలిగించారు.  రాజగోపురం వెలుపల రాత్రి 7-00 గంటలకు నిర్వహించిన జ్వాలాతోరణం కన్నులపండువగా సాగింది. అనంతరం ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ నేతృత్వంలో అర్చకులు, వేదపండితులు రాత్రి 10-15 గంటలకు  రాజరాజేశ్వరస్వామివారికి మహాపూజ నిర్వహించారు.  కార్యక్రమంలో ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-01T05:44:33+05:30 IST