బీజేపీలో వర్గపోరు

ABN , First Publish Date - 2020-12-27T04:44:59+05:30 IST

పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ భారతీయ జనతాపార్టీలో వర్గపోరు తీవ్రతరం అవుతున్నది.

బీజేపీలో వర్గపోరు

- పెద్దపల్లి అసెంబ్లీ నియోజకర్గంలో రాజకీయ రగడ

- రాష్ట్ర ప్రధానకార్యదర్శి తీరుపై మండల అధ్యక్షుల అసంతృప్తి 

- అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మండిపాటు

- తీరు మారకుంటే రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేస్తామన్న నేతలు 

- పార్టీ అధ్యక్షులను బాధ్యతల నుంచి తప్పించాలని ప్రదీప్‌ వర్గీయుల డిమాండ్‌

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ భారతీయ జనతాపార్టీలో వర్గపోరు తీవ్రతరం అవుతున్నది. బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గీయులు బహిరంగంగా పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇటీవల జూలపల్లి మండల కేంద్రంలో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రదీప్‌కుమార్‌ ‘ఏ పార్టీకి చెందిన మండల అధ్యక్షుడైనా ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పార్టేనట అని ఒకాయన అంటున్నాడని.. ఏ పార్టీ అధ్యక్షుడినైనా మనోహర్‌రెడ్డే నియమిస్తాడట.. చుక్కలు చుపిస్తాం.. ఇతర పార్టీ మండల అధ్యక్షులను నేనే నియమిస్తా.. వారికి వేతనాలు ఇస్తా.. ప్రదీప్‌ వస్తున్నాడంటే మాజీ ఎమ్మెల్యేలు గజగజ వణికిపోతున్నారు.. అందరు సిండికేట్‌ అయ్యారు..’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల్లో తీవ్ర కలవరాన్ని సృష్టించాయి. ఈ వ్యాఖ్యలు తమను ఉద్దేశించే చేశారని నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీకి చెందిన అన్ని మండలాల అధ్యక్షులు గురువారం సుల్తానాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి దుగ్యాల ప్రదీప్‌కుమార్‌ తీరును తప్పుబట్టారు. తమను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి నియమించారని, ప్రతినెల వేతనం కూడా ఇస్తున్నారని ఆరోపించడం ఎంతవరకు సబబని వారు ప్రశ్నించారు. పార్టీ నాయకత్వమే మండల అఽధ్యక్షులను నియమిస్తుందనే విషయం ఒక రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా ఉన్న ఆయనకు తెలియకపోవడం విచారకరమని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయనను టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలే నియమించారా అని ప్రశ్నించారు. మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే తమ మండలాల్లో తిరగనివ్వమని, బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ప్రదీప్‌ కుమార్‌ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ ఎమ్మెల్యే సూచన మేరకే పార్టీ మండల అధ్యక్షులు ప్రెస్‌మీట్‌ పెట్టి పార్టీ ప్రతిష్టను దిగజార్చారని, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, పార్టీ బాధ్యతల నుంచి తప్పించాలని ప్రదీప్‌ వర్గీయులు డిమాండ్‌ చేశారు. 

వచ్చే ఎన్నికల కోసం పోటాపోటీ..

నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌ వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని తహతహలాడుతున్నారు. పార్టీ టికెట్‌ తనకే వస్తుందనే ధీమాతో ఆయన కొన్ని రోజుల నుంచి నియోజకవర్గంలోని ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. 1994 ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గుజ్జుల రామకృష్నారెడ్డి గెలుపొందారు. అప్పటినుంచి ఆయన వరుసగా పోటీ చేస్తున్నప్పటికీ విజయం సాధించడం లేదు. నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న గుజ్జుల రామకృష్ణారెడ్డి వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని భావిస్తున్నారు. రాష్ట్ర పార్టీ అఽధ్యక్షుడిగా కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ను నియమించడంతో ఒక్కపారిగా సమీకరణాలు మారిపోయాయి. సంజయ్‌కుమార్‌ అధ్యక్షుడిగా నియామకం కాక ముందు రామకృష్ణారెడ్డి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. అదే సమయంలో దుగ్యాల ప్రదీప్‌కుమార్‌కు ప్రాధాన్యం లేని పోస్టు ఇచ్చారు. సంజయ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రాష్ట్ర కార్యవర్గంలో ప్రదీప్‌కుమార్‌కు రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా పదవి దక్కగా, రామకృష్ణరెడ్డికి ఎలాంటి పదవి దక్కలేదు. ఆయన నియోజకవర్గ ఇన్‌చార్జిగానే కొనసాగుతున్నారు. నియోజకవర్గంలోని పెద్దపల్లి, సుల్తానాబాద్‌, ఓదెల, జూలపల్లి, ఎలిగేడు, కాల్వశ్రీరాంపూర్‌ మండలాలకు పార్టీ అధ్యక్షులను గుజ్జుల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలోనే నియమించారు. గుజ్జుల రామకృష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్‌ల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీ రెండు వర్గాలుగా కొనసాగుతున్నది. వచ్చే ఎన్నికల్లో ఇద్దరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పార్టీ టిక్కెట్‌ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రదీప్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారాన్ని లేపాయి. దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధించడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ జెండాను ఎగురవేస్తామని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో నియోజకవర్గ నేతల్లో సమన్వయం లేక ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటుండడంతో కార్యకర్తలు అందోళన గురవుతున్నారు. పార్టీ నాయకత్వం చొరవ తీసుకుని ఇరువర్గాలుగా ఉన్న నేతలను ఒక్కటి చేయాలని కార్యకర్తలు కోరుతున్నారు. 

Updated Date - 2020-12-27T04:44:59+05:30 IST