వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు గ్రీన్‌ సిగ్నల్‌

ABN , First Publish Date - 2020-12-11T05:43:27+05:30 IST

వ్యవసాయేతర భూములు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు గ్రీన్‌ సిగ్నల్‌

- పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లకు హైకోర్టు అనుమతి

- ముందుగా స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాల్సిందే..

- మూడు నెలల తర్వాత పునఃప్రారంభం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

వ్యవసాయేతర భూములు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ధరణి ద్వారా కాకుండా పాత పద్ధతిలో కంప్యూటర్‌ ఆధారిత పద్ధతిలో రిజిస్ట్రేషన్లకు అనుమతించింది. ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్య ఖచ్చితంగా ఉండాలన్న నిబంధనను అంగీకరించింది. రిజిస్ట్రేషన్ల కోసం ఎప్పటిలాగానే విక్రయ, అమ్మకందారులు స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో మూడు మాసాల నుంచి నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు ఒకటి, రెండు రోజుల్లో ప్రారంభంకానున్నది. భూములు, ఇతర ఆస్తుల అమ్మకాల్లో పారదర్శకతను తీసుకవచ్చేందుకు ప్రభుత్వం రెవెన్యూ చట్టంలో మార్పులు తీసుకవచ్చి ధరణి వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఈ వెబ్‌సైట్‌ ద్వారానే వ్యవసాయ, వ్యవసాయేతర భూములను వేర్వేరుగా రిజిస్ట్రేషన్‌ చేసే విధానాన్ని తీసుకవచ్చింది. వ్యవసాయ భూములను మండల తహసీల్దార్‌ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్‌ చేసుకునే విధంగా చర్యలు చేపట్టింది. రిజిస్ట్రేషన్‌ రోజే మ్యూటేషన్‌ చేసి పట్టాదారు పాసుపుస్తకాలను జారీచేసే విధానాన్ని తీసుకవచ్చిన విషయం తెలిసిందే. ఈ విధానం నవంబర్‌ 2 నుంచి అమలవుతున్నది. 

మూడు నెలల తర్వాత..

వ్యవసాయేతర భూములు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను సబ్‌ రిజిష్ట్రార్‌ కార్యాలయాల ద్వారా చేపట్టనున్నారు. ధరణి తీసుకవస్తున్న నేపథ్యంలో సబ్‌రిజిష్ట్రార్‌ కార్యాలయాల్లో సెప్టెంబర్‌ 8వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. వ్యవసాయేతర భూములు, ఆస్తుల విషయంలో ధరణిలో అధికారులు వివరాలను నమోదు చేశారు. ఈ సందర్భంగా కులం, ఆధార్‌, ఇతర వ్యక్తిగత వివరాలను సేకరించారు. దీనిపై పలువురు హైకోర్టును ఆశ్రయించడంతో తుది ఆదేశాలు ఇచ్చేవరకు రిజిస్ట్రేషన్లు చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను ప్రారంభించలేదు. గురువారం వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లకు అనుమతించింది. పిటిషన్లపై విచారణ పూర్తిచేసి తుది తీర్పు వెలువరించే వరకు పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు అనుమతించింది. మూడు మాసాల నుంచి భూముల రిజిస్ట్రేషన్లు కాక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు నిలిచిపోగా, నూతనంగా చేపట్టాల్సిన గృహ నిర్మాణాలు నిలిచిపోయాయి. భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తయితేనే భవన నిర్మాణాలకు అనుమతులు లభిస్తాయి. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం కూడా నిలిచిపోయింది. రిజిస్ట్రేషన్లకు హైకోర్టు అనుమతించడంతో చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలో రియల్‌ వ్యాపారం పెద్దఎత్తున సాగుతున్నది. రిజిస్ట్రేషన్ల నిలిపివేతతో పెద్దపల్లి, మంథని, గోదావరిఖని, సుల్తానాబాద్‌లో ఆస్తుల క్రయవిక్రయాలు ముందుకు సాగనున్నాయి. పాత విధానంలో ఒకటి, రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్లను మొదలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. 

Updated Date - 2020-12-11T05:43:27+05:30 IST