పచ్చని పంటలు

ABN , First Publish Date - 2020-09-13T10:20:06+05:30 IST

వ్యవసాయ రంగానికి పెట్టింది పేరైన జిల్లా పంటల సాగులో ఈ యేడు సరికొత్త రికార్డు నమోదు చేసుకుంది.

పచ్చని పంటలు

సాగులో ఆల్‌టైమ్‌ రికార్డు

149 శాతం సాగుతో రాష్ట్రంలో రెండవ స్థానం

రికార్డు స్థాయిలో వరి పంట 


ఆంధ్రజ్యోతి, జగిత్యాల: వ్యవసాయ రంగానికి పెట్టింది పేరైన జిల్లా పంటల సాగులో ఈ యేడు సరికొత్త రికార్డు నమోదు చేసుకుంది. సాధారణ సాగుకు మించి 149 శాతం మేరకు పంటలు సాగు కావడంతో రాష్ట్రంలోనే అత్యధికంగా సాగు చేసిన రెండవ జిల్లాగా రికార్డుల్లోకి ఎక్కింది. 154 శాతం సాగుతో మేడ్చల్‌ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది.


జగిత్యాల జిల్లాలో పంటల సాధారణ విస్తీర్ణం 2.35 లక్షల ఎకరాలు కాగా, ఈ సారి 3.43 లక్షల ఎకరాల సాగు చేసి సరికొత్త రికార్డు నమోదు చేసింది.  ఇక్కడ ప్రతి యేటా వరి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది. వరి సాధారణ సాగు లక్షా 28 వేల 606 ఎకరాలు కాగా, ఈ వానాకాలంలో 2,64,979 ఎకరాలు సాగైంది. గడిచిన వానాకాలంలో లక్షా 58 వేల ఎకరాల్లో పంట సాగు చేశారు. దీంతో జిల్లాలో ఈ వానాకాలంలో వరి సాగు విస్తీర్ణం బాగా పెరిగినట్లు అయింది. ఇందులో దాదాపు లక్ష ఎకరాల వరకు సన్న రకం వరిధాన్యం సాగు చేశారు. మొక్కజొన్న సాగు విస్తీర్ణం సగానికి తగ్గింది. మొక్కజొన్న సాధారణ సాగు 55,727 ఎకరాలు కాగా, ఈ వానాకాలంలో ఇప్పటివరకు 29,586 ఎకరాలలో మాత్రమే సాగు చేశారు. పసుపు, పత్తి పంట సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. కంది పంట 1,2174 ఎకరాల్లో, పసుపు 17 వేల 941 ఎకరాల్లో, పెసర 1,555 ఎకరాల్లో, సోయా 5,651 ఎకరాల్లో, పత్తి పంట 26,919 ఎకరాల్లో, చెరుకు 648 ఎకరాల్లో సాగు చేశారు. 53 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగవుతున్నాయి.  


పెరిగిన నీటి వనరులు

 జిల్లాలో ఈ సీజన్‌లో నీటి వనరులు బాగా పెరిగాయి. సాధారణ వర్షపాతం మేరకు వర్షాలు కురువడంతో పాటు శ్రీరాంసాగర్‌ నుంచి నీటిని కూడా విడుదల చేస్తున్నారు. దీనికితోడు చెరువులు, కుంటల్లో నీరు పుష్కలంగా ఉంది. దీనికి తోడు వరద కాలువ నుంచి కూడా తూముల ద్వారా చెరువులోకి నీరు చేర్చుతున్నారు. దీంతో జిల్లాలో సాగు విస్తీర్ణం బాగా పెరిగింది.

Updated Date - 2020-09-13T10:20:06+05:30 IST