వడ్లు కొనేదెప్పుడు..?

ABN , First Publish Date - 2020-10-27T10:42:54+05:30 IST

రికార్డు స్థాయిలో వరిసాగును చేసి గణనీయమైన వరి ఉత్పత్తిని సాధిస్తున్న జిల్లా రైతులు ధాన్యం కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారు.

వడ్లు కొనేదెప్పుడు..?

30 శాతానికిపైగా వరికోతలు పూర్తి

ఇంకా ప్రారంభంకాని కొనుగోలు కేంద్రాలు

కల్లాల్లో నిండిన ధాన్యం

వాతావరణ మార్పులతో ఆందోళన చెందుతున్న రైతులు


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

రికార్డు స్థాయిలో వరిసాగును చేసి గణనీయమైన వరి ఉత్పత్తిని సాధిస్తున్న జిల్లా రైతులు ధాన్యం కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వరికోతలు పూర్తిచేసి కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం కుప్పలు పోసిన రైతులు కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో పడిగాపులు కాస్తున్నారు. రెండు మూడు రోజలకొకసారి ఏర్పడుతున్న అల్ప పీడనాలతో ఎప్పుడు వర్షాలు కురిసి వరిధాన్యం నానిపోతుందోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 352 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పండిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా ఇప్పటికీ కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ జిల్లాస్థాయిలో రెండుసార్లు ఉన్నతాధికారులతో, కొనుగోలు ఏజెన్సీలు, రైస్‌ మిల్లర్లతో సమావేశాలు నిర్వహించి వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించినా రెండు మూడు చోట్ల మినహా కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. 


ఏ గ్రామంలో చూసినా ధాన్యం రాశులే..

జిల్లావ్యాప్తంగా 250 నుంచి 300 చైన్‌ వరి కోత యంత్రాలు, మరో 200 సాధారణ వరికోత మిషన్లు నిర్విరామంగా కోతలు పూర్తిచేస్తుండడంతో ప్రతిరోజు 3 నుంచి 4 వేల ఎకరాల వరకు పంట నూర్పిడి పూర్తవుతున్నది. దీంతో రైతులు ధాన్యాన్ని ఇంట్లో నిల్వ పోసుకునే అవకాశం లేక కొనుగోలు కేంద్రాలకే నేరుగా తరలిస్తున్నారు. గత 15, 20 రోజులుగా ధాన్యం కుప్పలు కుప్పలుగా కొనుగోలు కేంద్రాల్లో నిండిపోయాయి. కొత్తగా కోతలు పూర్తి చేసుకునేవారికి ధాన్యం మార్కెట్‌కు తీసుకువస్తే అవకాశం లేకుండా పోయింది. 


352 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం

జిల్లావ్యాప్తంగా ఈ వానాకాం 2,51,666 ఎకరాల్లో వరిసాగు చేశారు. వీటిలో 1,21,970 ఎకరాల్లో సన్నరకం వరి, 1,30,789 ఎకరాల్లో దొడ్డురకం వరిని సాగు చేశారు. సన్నరకం వరి ఎకరాకు 20 నుంచి 21 క్వింటాళ్ల చొప్పున 25 లక్షల క్వింటాళ్లు, దొడ్డురకం వరి ఎకరాకు 23 క్వింటాళ్ల చొప్పున 30.08 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా 56 లక్షల క్వింటాళ్ల వరి దిగుబడి వస్తుందని అంచనా వేసినా జిల్లా యంత్రాంగం జిల్లాలోని 311 గ్రామ పంచాయతీల్లో 352 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లాలో పండిన 56 లక్షల క్వింటాళ్ల వరిధాన్యంలో స్థానిక అవసరాలకు 7 లక్షల క్వింటాళ్ల మేరకు రైతులు వినియోగించుకునే అవకాశం ఉందని, మిగతా 49 లక్షల క్వింటాళ్ల వరిధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అక్టోబర్‌ నెలలో 4,72,228 క్వింటాళ్లు, నవంబర్‌ నెలలో 20,25,027 క్వింటాళ్లు, డిసెంబర్‌ నెలలో 23,07,641 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇందుకోసం ప్రతి గ్రామంలో ఒకటి చొప్పున, పెద్ద గ్రామాల్లో రెండేసి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఏ పంచాయతీకి చెందినవారు తమ పంచాయతీ పరిధిలోనే ధాన్యం విక్రయించుకునే అవకాశం కల్పించాలని జిల్లా యంత్రాంగం ప్రణాళిక రూపొందించింది. ప్రాథమిక సహకార సంఘాల ద్వారా 222 కొనుగోలు కేంద్రాలను, ఐకేపీ ద్వారా 78 కొనుగోలు కేంద్రాలను, డీసీఎంఎస్‌ ద్వారా 42 కొనుగోలు కేంద్రాలను, మార్కెటింగ్‌శాఖ ద్వారా 8 కొనుగోలు కేంద్రాలను, హాకా, మెప్మా ద్వారా ఒక్కో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి వీటి ద్వారా కేంద్రాలకు వచ్చిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. 


ప్రారంభమైన కేంద్రాలు ఐదు

మానకొండూర్‌ నియోజకర్గంలో రెండు, హుజురాబాద్‌ ప్రాంతంలో ఒకటి, రెండు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు తప్ప ఇప్పటి వరకు ఎక్కడా కొనుగోలు కేంద్రాలను తెరవలేదు. ముందస్తుగా సన్నద్ధ సమావేశాలను ఏర్పాటు చేసి ప్రణాళికను రూపొందించి అన్ని ఏర్పాట్లు చేసినా ధాన్యం కొనాల్సిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఐకేపీ, డీసీఎంఎస్‌, మార్కెటింగ్‌ ఏజెన్సీలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. అక్టోబర్‌లో వర్షాలు కురియడంతో తడిసిన ధాన్యం, పూర్తిగా ఆరని ధాన్యం, తేమశాతం ఎక్కువగా ఉన్న ధాన్యం మార్కెట్‌కు వచ్చి వాటిని కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన చేస్తారనే భావనతో కొనుగోళ్లు ప్రారంభించడం లేదని అంటున్నారు. 


ఆందోళనలో అన్నదాతలు

కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో మార్కెట్‌లో పోసిన ధాన్యం పూర్తిస్థాయిలో ఆరినా మళ్లీ వర్షాలు వస్తే ఎక్కడ తడుస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కోతకు వచ్చిన పొలాలు ఉన్నా వాటిని కోయలేని పరిస్థితి రైతులకు ఎదురవుతున్నది. ఒకేరోజులో పంట నూర్పిడి పూర్తయ్యే పరిస్థితి ఉండడంతో  ఆ ధాన్యం తీసుకువచ్చి నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో రైతులు పొలాలను కోయలేక పోతున్నారు. కోయకుండా ఉన్న పొలాల్లో కూడా వర్షం వస్తే గింజలు రాలిపోయే ప్రమాదం  ఉంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ధాన్యాన్ని కొని మిల్లులకు తరలించాలని  రైతులు అంటున్నారు. 

Updated Date - 2020-10-27T10:42:54+05:30 IST