బీజేపీ నూతన అధ్యక్షుడిగా కృష్ణారెడ్డి

ABN , First Publish Date - 2020-10-03T10:17:00+05:30 IST

భారతీయ జనతా పార్టీ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణరావుకు ఉద్వాసన చెప్పారు.

బీజేపీ నూతన అధ్యక్షుడిగా కృష్ణారెడ్డి

‘బాస’కు ఉద్వాసన...

రాసలీలలే కొంప ముంచాయి..


కరీంనగర్‌, అక్టోబర్‌ 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): భారతీయ జనతా పార్టీ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణరావుకు ఉద్వాసన చెప్పారు. శుక్రవారం ఆయనను తొలగిస్తూ ఆయన స్థానంలో గంగడి కృష్ణారెడ్డిని నూతన అధ్యక్షుడిగా నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అధ్యక్షుడి మార్పు వ్యవహారానికి కారణమేమిటో ఆ ఉత్తర్వుల్లో పేర్కొనకున్నా ఆ పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఒక లోకల్‌ ఛానల్‌లో వీడియో, ఆడియో క్లిప్పులు ప్రసారం కావడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. దీన్ని బలపరిచే విధంగా భారతీయ జనతా పార్టీకి చెందిన వివిధ గ్రూపుల్లో ఈ వ్యవహారాన్ని విమర్శిస్తూ పలువురు కార్యకర్తలు, నాయకులు పోస్టింగ్‌లు చేశారు.


కొద్ది రోజులుగా చాటుమాటున చర్చించుకుంటున్న ఈవ్యవహారం కాస్త ఒక ఛానల్‌లో రావడంతో బీజేపీ శ్రేణులు పార్టీకి చెడ్డపేరు వచ్చినట్లు భావిస్తున్నారు. అధ్యక్షుడు, ఆయన వ్యతిరేక వర్గం మధ్య జరిగిన ఆధిపత్య పోరులో పార్టీ బదునామై జవాబు చెప్పలేని స్థితికి నెట్టిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ స్వంత జిల్లాలోనే ఈ వ్యవహారం జరుగడం పార్టీలో కలకలం సృష్టించింది.  వేటుకు గురైన అధ్యక్షుడు బాస సత్యనారాయణరావు పార్టీకి చెందిన మహిళా కార్యకర్త ఇంట్లో అనుచిత రీతిలో ఉన్న దృశ్యం, ఆయన మాటలకు సంబంధించిన ఆడియోలను లోకల్‌ ఛానల్‌ ప్రసారం చేసింది.  ఈ వ్యవహారం కొద్ది నెలల క్రితం జరుగగా పార్టీ వర్గాల్లో జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు చర్చనీయాంశంగా మారింది. ఈలోగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణరావు స్థానిక పోలీసు అధికారుల వద్దకు వెళ్ళి వ్యవహారాన్ని సద్దుమణిగేలా చూసుకునేందుకు ప్రయత్నించారని తెలిసింది. ఈ సందర్భంగా ఆ వీడియో, ఆడియో క్లిప్పులు ఉన్న ఫోన్‌ను సదరు మహిళ వద్ద నుంచి పోలీసులు స్వాధీన పరుచుకొని  ఫార్మట్‌ చేసినట్లు ఆ మహిళ ఆరోపిస్తున్నది. ఆమె ఫోన్‌ను కూడా ఇవ్వలేదని, ఆమె తన ఆడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ గొడవ చిలికిచిలికి గాలివానలా మారుతూ పార్టీ పరువు బజారున పడే విధంగా ఉన్నదని భావించిన రాష్ట్రస్థాయి ముఖ్యనాయకుడొకరు వారిద్దరిని మందలించి రూ.13 లక్షలు మహిళకు ఇవ్వాలని సూచించి వ్యవహారం సద్దుమణిగేలా చేశారని పార్టీ వర్గాలు అంటున్నాయి.


అయితే  ఆ డబ్బులో  రూ.9 లక్షలు మాత్రమే మహిళకు ముట్టాయని, ఫోన్‌ కూడా తిరిగి ఇవ్వలేదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆడియో, వీడియో క్లిప్పులు ప్రైవేట్‌ ఛానల్‌కు అంది టెలీకాస్ట్‌ అయ్యాయి. దీని కారణంగానే  ఆయనపై వేటు వేశారని భావిస్తున్నారు.  జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణరావుకు అలాగే పార్టీకి చెందిన మరొకరికి మధ్య జిల్లా, రాష్ట్ర స్థాయిలో పదవుల పంపకం వ్యవహారంతోపాటు వ్యక్తిగతంగా ఏర్పడిన తగాదాల నేపథ్యంలోనే ఈ వీడియో, ఆడియో క్లిప్పులను బయటకు లీక్‌ చేశారని పార్టీవర్గాలు అనుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో  మరికొన్ని ఆడియో, వీడియోలను కూడా ఇరువర్గాల వారు బయటపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. 


కార్యకర్తకు పెద్దపీట: 

 బీజేపీ నూతన అధ్యక్షుడిగా వీణవంక మండలం నర్సింగాపూర్‌కు చెందిన గంగాడి కృష్ణారెడ్డికి అవకాశం దక్కింది. హుజురాబాద్‌లో న్యాయవాద వృత్తిని కొనసాగిస్తున్న ఆయన జిల్లా ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు. కృష్ణారెడ్డి విద్యార్థిగా ఏబీవీపీలో క్రియాశీలపాత్ర వహించి, హుజురాబాద్‌ నగర కార్యదర్శిగా, కరీంనగర్‌ జిల్లా సహ ప్రముఖ్‌గా పనిచేశారు. ఏబీవీపీ పూర్తిసమయ కార్యకర్తగా చెన్నయ్‌ కేంద్రంగా తమిళనాడులో ఏబీవీపీ సంఘటన కార్యదర్శిగా పనిచేశారు. బీజేపీ కమలాపూర్‌ నియోజకవర్గ కన్వీనర్‌గా వ్యవహరించిన ఆయన జిల్లా కార్యదర్శిగా, జిల్లా ఉపాధ్యక్షుడిగా, జిల్లా సంస్థాగత శిక్షణ కమిటీ కన్వీనర్‌గా కూడా వ్యవహరించారు. సామాన్య కార్యకర్తగా పార్టీలో ప్రవేశించి సంస్థాగతంగా అంచెలంచెలుగా ఎదుగుతున్న ఆయన జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 25 సంవత్సరాలుగా సంస్థలో కొనసాగుతూ వచ్చిన ఆయనను జిల్లా అధ్యక్షుడిగా  నియమించి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందన్న సంకేతాలు ఇచ్చారని పార్టీవర్గాలు భావిస్తున్నాయి. 

Updated Date - 2020-10-03T10:17:00+05:30 IST