ఈ నెలాఖరువరకు ఉచిత బియ్యం పంపిణీ
ABN , First Publish Date - 2020-04-05T10:43:19+05:30 IST
ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం ఈనెలాఖరు వరకు కొనసాగుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, ఆహారపౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

బియ్యం తీసుకోకున్నా ప్రతి కుటుంబానికి రూ.1500 ఇస్తాం
ఆందోళన వద్దు..
దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించాలి
గ్రామాల్లో ఇళ్లకు బియ్యం పంపిణీ చేయడం శుభసూచకం
చౌకధరల దుకాణాల ఆకస్మిక తనిఖీ
రాష్ట్ర బీసీ సంక్షేమ, ఆహారపౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 4: ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం ఈనెలాఖరు వరకు కొనసాగుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, ఆహారపౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెల్లరేషన్కార్డుదారులందరికీ బియ్యం అందే వరకు రేషన్ దుకాణాలను తెరిచే ఉంచుతారని అన్నారు. అందరికీ బియ్యం పంపిణీ జరుగుతుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి భరోసా ఇచ్చారు. శనివారం ఆయన నగరంలోని చౌకఽదుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసి డీలర్లు, ప్రజలతో మాట్లాడారు. సర్వర్ సమస్యతో కొంత జాప్యం జరుగుతోందని డీలర్లు చెప్పడంతో ప్రజలు ఆందోళన చెందవద్దని అన్నారు.
సీఎం ప్రకటించిన విధంగా ప్రతి ఒక్కరికి బియ్యం పంపిణీ చేస్తామని అన్నారు. అలాగే బియ్యం తీసుకున్నా తీసుకోక పోయినా ప్రతి కుటుంబానికి 1500 చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. బియ్యం తీసుకోకుంటే డబ్బులు ఇవ్వరనే వదంతులను నమ్మవద్దని చెప్పారు. రాష్ట్రంలో రూ.1100కోట్ల వ్యయంతో రెండు కోట్ల 80లక్షల మందికి ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అయితే అన్ని దుకాణాల్లో ఒక్కసారి ప్రజలు బియ్యం కోసం రావడంతో సర్వర్ సమస్యతో పంపిణీ కొంత జాప్యమవుతోందని అన్నారు.
87 లక్షల తెల్లరేషన్ కార్డుదారుల్లో ఇప్పటికే 35శాతం బియ్యం పంపిణీ పూర్తిచేశామని, మిగిలిన తెల్లరేషన్ కార్డులందరికీ బియ్యం అందే వరకు రేషన్ పంపిణీ కొనసాగిస్తామని చెప్పారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకు అర్బన్ ఏరియలో వరుసగా మూడుసార్లు బియ్యం తీసుకోని వారి బయోమెట్రిక్ తీసుకుంటున్నామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బయోమెట్రిక్ అవసరం లేకుండానే బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. చాలా గ్రామాల్లో జనం బయటికి రాకుండా ఉండేందుకు ఇళ్ల వద్దనే స్థానిక ప్రజాప్రతినిధులు రేషన్‌బియ్యం పంపిణీ చేయడం శుభసూచకమని అన్నారు.
రాష్ట్రంలో కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. లాక్డౌన్ సందర్భంగా నగరంలో చాలా మంది నిరుపేదలు, వలస కూలీలు ఆకలితో పస్తులుండకూడదనే సంకల్పంతో ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి 12కిలోల బియ్యం పంపిణీ చేస్తోందని అన్నారు. ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా కరీంనగర్‌కు చెందిన భద్రుబాయ్ 50వేల రూపాయలను వలస కూలీలకు అందజేశారు. మంత్రి వెంట మేయర్ సునీల్‌రావు ఉన్నారు.