అల్లుడికి జ్వరం వచ్చిందని పరామర్శకు వెళ్తే.. కరోనా కలకలం.. ఒకేరోజు నలుగురికి..

ABN , First Publish Date - 2020-06-18T16:55:52+05:30 IST

కరీంనగర్ జిల్లాలోని సుల్తానాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా వైరస్‌ నిర్ధారణ కావడంతో కలకలం రేగుతున్నది. దీనికంటే ఒక రోజు ముందు అదే మండలంలోని కనుకుల గ్రామానికి చెందిన

అల్లుడికి జ్వరం వచ్చిందని పరామర్శకు వెళ్తే.. కరోనా కలకలం.. ఒకేరోజు నలుగురికి..

ఒకేరోజు సుల్తానాబాద్‌లో నలుగురికి కరోనా

ముందురోజే కనుకులలో ఒకరికి పాజిటివ్‌

జిల్లాలో పెరుగుతున్న కాంటాక్టు కేసులు

12కు పెరిగిన కేసుల సంఖ్య


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి): కరీంనగర్ జిల్లాలోని సుల్తానాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా వైరస్‌ నిర్ధారణ కావడంతో కలకలం రేగుతున్నది. దీనికంటే ఒక రోజు ముందు అదే మండలంలోని కనుకుల గ్రామానికి చెందిన ఒక యువకుడికి కరోనా వైరస్‌ సోకింది. వీరందరికీ హైదరాబాద్‌లో ఉండి వచ్చిన వారిని కలిసిన కారణంగానే వైరస్‌ సోకడం గమనార్హం. కరీంనగర్‌ పట్టణానికి చెందిన ఒక కానిస్టేబుల్‌హైదరాబాద్‌లో స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ విభాగంలో ప్రత్యేక విధులు నిర్వహిస్తుంటాడు. ఈనెల 5న ఆయన కరీంనగర్‌కు వచ్చాడు. వచ్చినరోజే ఆయనకు జ్వరం రావడంతో ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చూపించుకున్నారు. కానిస్టేబుల్‌ అత్తగారి ఊరు సుల్తానాబాద్‌ కాగా, అతడికి జ్వరం వచ్చిన విషయం తెలుసుకున్న మామ, అత్త, మామగారి తల్లి, కోడలు కరీంనగర్‌లోని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. అతడికి జ్వరం తగ్గకపోవడంతో సివిల్‌ ఆసుపత్రికి వెళ్లి చేరగా అక్కడి వైద్యులు అతడికి కరోనా పరీక్ష నిర్వహించగా, ఈనెల 9న నిర్ధారణ కావడంతో వైద్యం చేస్తున్నారు. 


ఇతడిని కలిసిన అత్తగారి నలుగురు కుటుంబ సభ్యులతో పాటు పలువురిని కరీంనగర్‌ ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు. వారికి మంగళవారం కరోనా పరీక్షలు చేశారు. కరోనా వచ్చినట్లుగా బుధవారం నిర్ధారణ కావడంతో వారికి అక్కడే చికిత్సను అందిస్తున్నారు. సుల్తానాబాద్‌ పాత బజారులోని శివాలయం వీధిలో ఉండే వీఆర్‌ఏ స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో వీఆర్‌ఏగా పని చేస్తున్నారు. అలాగే సుల్తానాబాద్‌ మండలం కనుకుల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. తన సోదరుడు ఇటీవల హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో మృతిచెందడంతో ఆయన మృతదేహాన్ని కనుకులకు తీసుకవచ్చి కుటుంబ సభ్యులతో కలిసి అంత్యక్రియలు జరిపించారు. నాలుగైదు రోజులుగా గుండెనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. అనుమానం వచ్చిన డాక్టర్లు అతడి రక్త నమూనాలను సేకరించి కరోనా పరీక్షకు పంపించారు. మంగళవారం రాత్రి పాజిటివ్‌ అని నిర్ధారణ కావడంతో కరీంనగర్‌ ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. పలువురికి హోం క్వారంటైన్‌ చేశారు. 


పెరుగుతున్న కేసులు..

అంతకంటే ముందు మర్కజ్‌కు వెళ్లి వచ్చిన రామగుండం అన్నపూర్ణ కాలనీకి చెందిన వ్యక్తి ఒకరికి, మర్కజ్‌కు వెళ్లిన వారు ప్రయాణించిన రైలులో వచ్చిన గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన ఒక విద్యార్థికి పాజిటివ్‌ రాగా, వారిద్దరు డిశ్చార్జి అయ్యారు. ముంబైకి వలస వెళ్లి వచ్చిన ధర్మారం మండలం న్యూకొత్తపెల్లికి చెందిన ఒకరికి కరోనా వచ్చింది. కమాన్‌పూర్‌ మండలం నాగారంనకు చెందిన ఒక మహిళకు, అన్నపూర్ణ కాలనీకి చెందిన ఒకరికి, పోతనకాలనీకి చెందిన సింగరేణి కార్మికుడికి, మరోక సింగరేణి అధికారికి కరోనా వచ్చింది. వీళ్లంతా హైదరాబాద్‌లోని వివిధ ఆసుపత్రులకు వెళ్లినప్పుడే కరోనా సోకింది. ఇందులో అన్నపూర్ణ కాలనీకి చెందిన ఒకరు, పోతన కాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు ఇద్దరు మృతిచెందారు. వీరంతా హైదరాబాద్‌కు వెళ్లి వచ్చిన కారణంగానే కరోనా వైరస్‌ సోకింది. తాజాగా సుల్తానాబాద్‌ మండలానికి చెందిన ఐదుగురికి హైదరాబాద్‌ కాంటాక్టుల కారణంగానే వైరస్‌ సోకడం జిల్లా ప్రజలను వణికిస్తున్నది. వేసవి ముగిసి వర్షాకాలం ప్రారంభమై వాతావరణం చల్లబడడంతో వైరస్‌ విజృంభిస్తున్నది. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు, శానిటైజర్లను తప్పనిసరిగా వాడాలని, భౌతిక దూరం పాటించాలని, సామూహిక కార్యక్రమాలకు వెళ్లకూడదని అధికారులు ప్రజలను కోరుతున్నారు.

Updated Date - 2020-06-18T16:55:52+05:30 IST