శిలాఫలకం వేశారు... పనులు మరిచారు

ABN , First Publish Date - 2020-03-02T12:41:03+05:30 IST

రైతులకు మెరుగైన సేవలు అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విత్తన శుద్ధి కేంద్రం శిలాఫలకానికే పరిమితమైంది. సీడ్‌ బౌల్‌ ఆఫ్‌

శిలాఫలకం వేశారు... పనులు మరిచారు

  • కలగానే మిగిలిన సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌
  • రెండేళ్లయినా జాడలేని పనులు
  • ప్రారంభిస్తే జిల్లా రైతులకు ఎంతో ఉపయోగకరం

ఆంధ్రజ్యోతి, జగిత్యాల: రైతులకు మెరుగైన సేవలు అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విత్తన శుద్ధి కేంద్రం శిలాఫలకానికే పరిమితమైంది. సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ తెలంగాణగా ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ఆలోచనలో భాగంగా జగిత్యాల జిల్లాలో సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎంపీ కవిత సహకారంతో నిధులు విడుదల చేసి శిలాఫలకం వేశారు. ఇప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంపై రైతులు విమర్శిస్తున్నారు. 


సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు రూ.7 కోట్లు


జగిత్యాల జిల్లా వ్యవసాయ రంగానికి పెట్టింది పేరు. ఈ జిల్లాలో వరి, మొక్కజొన్న, పసుపు పంటలు ఎక్కువగా సాగవుతుంటాయి. అయితే యేటా రైతులు విత్తనాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. నకిలీ విత్తనాలతో దిగుబడులు రాక నష్టపోతున్నారు. దీనిని అరికట్టాలనే ఆలోచనతో అప్పటి ఎంపీ కవిత జగిత్యాలలో సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు మంజూరు తెప్పించారు. ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విత్తన శుద్ధి కర్మాగారం, గిడ్డంగి నిర్మాణానికి పూనుకున్నారు. అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డితో మాట్లాడి సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ నిర్మించేందుకు కృషి చేశారు. ఇందుకోసం రూ.7 కోట్లను కూడా మంజూరయ్యాయి. అయితే వ్యవసాయంలో ఆదర్శంగా నిలిచే జగిత్యాల రూరల్‌ మండలంలోని లక్ష్మీపూర్‌ గ్రామ శివారులో ఈ సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను, గోదాంలను నెలకొల్పితే జిల్లా రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావించారు. ఈ మేరకు ముందుగా రూ.7 కోట్లను మంజూరు చేశారు. అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఎంపీ కవిత 2018 మార్చి 3వ తేదీన లక్ష్మీపూర్‌లో సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. దీంతో జిల్లాలోని రైతులు ఎంతో ఆనందపడినప్పటికీ వారి ఆశలు అడియాశలుగా మిగిలాయి. రెండేళ్లు గడుస్తున్నప్పటికీ నేటికీ తట్టెడు మట్టి కూడా ముట్టకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు.


శిలాఫలకానికే పరిమితం


తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దాలనేది సీఎం కేసీఆర్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గానికి ఓ వ్యవసాయ ఆధారిత పరిశ్రమను ఏర్పాటు చేయబోతున్నామని అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగానే లక్ష్మీపూర్‌లో విత్తనశుద్ధి కర్మాగారం, గిడ్డంగిలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటిచారు. అయితే జగిత్యాల జిల్లా పూర్తిగా వ్యవసాయాధారితం కావడంతో, ఇక్కడ విత్తనోత్పత్తికి అపార అవకాశాలు ఉన్నాయి. అలాగే జిల్లాలో ఒక్కటంటే ఒక్కటి కూడా వ్యవసాయాధారిత పరిశ్రమ లేదు. దీంతో మాజీ ఎంపీ కవిత లక్ష్మీపూర్‌లో విత్తనశుద్ధి కర్మాగారం, గోదాంల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే నిధులు మంజూరై రెండేళ్లు కావస్తున్నప్పటికీ తట్టెడు మట్టి కూడా ముట్టుకోలేదు. ఇంకా టెండర్ల దశలోనే ఉన్నట్లు పేర్కొంటున్నారు. విత్తన శుద్ధి కర్మాగారం నిర్మాణానికి శంకుస్థాపన చేయడంపై చూపిన శ్రద్ధ, దాని పనుల ప్రారంభం, పురోగతిపై చూపడంలేదని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. శంకుస్థాపన రోజు వేసిన శిలాఫలకాలు నేటికి అలాగే ఖాళీగా మిగిలిపోయి వెక్కిరిస్తున్నాయి. విత్తన శుద్ధి పరిశ్రమపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జిల్లా రైతులు రెండేళ్లు కావస్తున్నా పనులు ప్రారంభం కాకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదే పదే రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పుకుంటున్న అధికార పార్టీ నాయకులు కనీసం ఇప్పటికైనా విత్తన శుద్ధి కర్మాగారం పనులను ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.

రైతులకు ఎంతో మేలు

జగిత్యాల రైతులు వరిధాన్యం ఉత్పత్తిలో ఇప్పటికే తెలంగాణలో గుర్తింపు పొందారు. ఇక్కడ చేసిన విత్తనోత్పత్తి దేశవ్యాప్తంగా కొనుగోలు చేసే స్థాయికి ఎదగాలని అప్పటి ఎంపీ కవిత పలు వేదికలపై మాట్లాడారు. అయితే లక్ష్మీపూర్‌ విత్తన శుద్ధి కర్మాగారం నిర్మాణం పూర్తయితే రైతులకు విత్తనాలు ఇచ్చి మళ్లీ రైతుల నుంచి మార్కెట్‌ ధరకన్నా 20 శాతం ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తారని అప్పుడే ప్రకటించారు. లక్ష్మీపూర్‌ రైతులు ఇప్పటికే లక్ష్మీపూర్‌ బ్రాండ్‌ పేరిట బియ్యం అమ్ముతూ గుర్తింపు పొందారు. ఇదే ప్రాంతంలో విత్తన శుద్ధి కర్మాగారం నిర్మిస్తే జిల్లా రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. రెండేళ్లు కావస్తున్నా పనులు ప్రారంభం కాకపోవడం రైతులను నిరాశకు గురి చేస్తోంది. సంబంధిత ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దీనిపై దృష్టి సారించి ఇప్పటికైనా విత్తనశుద్ధి కర్మాగారం, గిడ్డంగి పనులు ప్రారంభించి పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా రైతులు కోరుతున్నారు.


రెండేళ్లవుతున్నా పనులు ప్రారంభం కాలేదు..


పన్నాల తిరుపతి రెడ్డి, రైతు ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు, జగిత్యాల


లక్ష్మీపూర్‌లో సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ కోసం శిలాఫలకం వేసి రెండేళ్లు అవుతోంది. ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ప్రాసెసింగ్‌ యూనిట్‌ కోసం రూ.7 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. పనులు ఎందుకు ప్రారంభించడం లేదో ఇప్పటికీ తెలియడం లేదు.

Updated Date - 2020-03-02T12:41:03+05:30 IST