-
-
Home » Telangana » Karimnagar » Farmers have to pay compensation
-
రైతులకు నష్టపరిహారం చెల్లించాలి..
ABN , First Publish Date - 2020-08-20T11:04:52+05:30 IST
వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం పొలిట్ బ్యూరో

కాలువలను నాసిరకంగా నిర్మించిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి
సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు
తిమ్మాపూర్/హుజూరాబాద్, ఆగస్టు 19: వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. తిమ్మాపూర్ మండలంలోని మొగిళిపాలెం, హుజూరాబాద్ మండలం చెల్పూర్, చిగురుమామిడి మండలంలోని సీతారంపూర్‌లో ఆయన బుధవారం పర్యటించారు. వర్షాలతో కూలి పోయిన ఇళ్లను, నీట మునిగిన పంటలను పరిశీలించి భాదితులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాలతో వేలాది ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నదన్నారు. ఈ ప్రాంతంలో నాణ్యతాలోపంతో కాలువలు నిర్మించడంతో అవి తెగిపోయి చాలా గ్రామాల్లో పంటలు నీట మునిగాయని అన్నారు. తోటపల్లి రిజర్వాయర్‌కు అనుసంధానంగా ఉన్న మూడు కాలువలకు గండ్లు పడ్డాయన్నారు. ప్రభుత్వం, అధికారులు, కాంట్రాక్టర్ల అక్రమాల వల్లనే రైతులు నష్టపోయారని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా తెగిపోయిన గండ్లను తిరిగి సక్రమమైన పద్దతిలో పూడ్చక పోతే మళ్లి ఇదే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. భారీ వర్షంతో ఇళ్లు కోల్పోయిన నిరుపేదలకు ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్లను మంజురు చేయాలని డిమాండ్ చేశారు.
పంట పొలాల్లో ఇసుక మేటలు వేసి భారీ నష్టం వాటిల్లిందని, తక్షణమే ప్రభుత్వం ఇసుక మేటలను తొలగించాలన్నారు. వర్షం వల్ల నష్టపోయిన మొక్కజొన్న, పత్తి, వరి పంటలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు సరియైునా పరిహారం అందించాలని బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిన్న, మొన్న చేసిన ప్రకటనలు సంతృప్తికరంగా లేవని, ఎకరాకు ఎంత నష్ట పరిహారం ఇస్తారో ప్రకటించాలని కోరారు. వర్షాల వల్ల జరిగిన నష్టంపై తమ బృందంతో పర్యటించి, నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామని బీవీ రాఘవులు తెలిపారు. కొవిడ్-19 విషయంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రులను స్వాధీనం చేసుకొని రోగులకు సేవలందించాలన్నారు. కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యుడు జి నాగయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు జ్యోతి, రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, కార్యవర్గ సభ్యులు వర్ణ వెంకట్‌రెడ్డి,మొగిళిపాలెం సర్పంచ్ మోరపల్లి సుస్మిత రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.