వద్దంటున్నా వరిసాగు
ABN , First Publish Date - 2020-02-08T11:51:40+05:30 IST
జిల్లాలో గత ఏడాది నుంచి పంట సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతోంది. ఈ ఏడాది వద్దంటే వరి అన్నట్లుగా రికార్డు స్థాయిలో లక్ష్యాన్ని మించి

- జిల్లాలో రికార్డు స్థాయిలో వరి పంట సాగు
- ఇప్పటికే లక్ష్యాన్ని మంచి 172.2 శాతం మేరకు సేద్యం
- కొనుగోళ్లలో ఎదురుకానున్న ఇబ్బందులు
- పెరుగుతున్న విద్యుత్ వాడకం
ఆంధ్రజ్యోతి, జగిత్యాల: జిల్లాలో గత ఏడాది నుంచి పంట సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతోంది. ఈ ఏడాది వద్దంటే వరి అన్నట్లుగా రికార్డు స్థాయిలో లక్ష్యాన్ని మించి 172.2 శాతం మేరకు వరి పంటను సాగు చేశారు. ఖరీఫ్ సీజన్‌లో 120 శాతం మేరకు వరి పంట సాగు చేయగా, కొనుగోళ్లలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. రైస్‌మిల్లర్లు ముందుకు రాకపోవడంతో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి.
జగిత్యాల జిల్లాలో వరి పంట సాధారణ సాగు విస్తీర్ణం 41,733 హెక్టార్లు కాగా, జనవరి 30 వరకు 71,851 హెక్టార్లలో పంట సాగు చేశారు. సాధారణ సాగుతో పోల్చి చూస్తే 172.2 శాతం మేరకు వరి పంట సాగైంది. జగిత్యాల జిల్లాలో అన్ని రకాల పంటలు కలిపి రబీలో 69,666 హెక్టార్లలో పంటలు సాగవుతాయని అధికారులు అంచనాలు వేయగా, 88,252 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. సాధారణ సాగుతో పోల్చి చూస్తే 126.7 శాతం మేరకు జిల్లాలో పంటలు సాగయ్యాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో పుష్కలంగా నీరు ఉండటంతో ఇప్పటికే వారబందీ పద్ధతిన నీటిని కాకతీయ కాలువ ద్వారా విడుదల చేస్తున్నారు. దీనికితోడు భారీ వర్షాలు కురియడంతో చెరువులు, కుంటలు, బావుల్లో భూగర్భ జలాలు బాగా పెరిగాయి. దీంతో రైతులు వరి పంటవైపే మొగ్గు చూపుతున్నారు. వరి కోసేందుకు కూడా హార్వెస్టర్లు (యంత్రాలు) రావడం తో పాటు ఆయా గ్రామాల్లోనే వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో వరి పంట సాగు రైతు కు ఎలాంటి ఇబ్బంది లేకుండా మారింది. అలాగే ఇటీవల వరి పంటకు కూడా చీడపీడల బెడద కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో రైతులు వరి పంట వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలోని ఆయకట్టేతర ప్రాంతాలైన మల్యాల, కొడిమ్యాల, మేడిపల్లి మండలాల్లో కూడా మామిడి తోటలను తొలగించి రైతు లు వరి పంట సాగు చేయడం చూస్తుంటే జిల్లాలో ఏ స్థాయిలో వరి పంట వైపు మొగ్గు చూపుతున్నారని అర్థమవుతోంది. వ్యవసాయాధికారులతో పాటు నీటి పారుదల శాఖ అధికారులు వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చూపిస్తున్నా వరి వైపే మొగ్గు చూపుతున్నారు.
తలెత్తనున్న ఇబ్బందులు
వరిసాగులో చివరి సమయంలో సాగునీటికి కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. నిజానికి జనవరి 15 వరకే వరినాట్లు వేయాల్సి ఉండగా, ఫిబ్రవరి మొదటి వారం గడుస్తున్నా ఇంకా రైతులు వరి నాట్లు వేస్తూనే ఉన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి ఎనిమిది తడుల నీటిని ఇవ్వాలని నిర్ణయించగా, మార్చి 31 వరకు గడువు ముగియనుంది. వరి పంట నాట్లు ఇంకా రైతులు వేస్తుండటంతో ఆలస్యంగా వేసిన వరి పంట ఏప్రిల్ నెలాఖరు వరకు కోతకు వచ్చే అవకాశం ఉంది. ఈసారి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనుండగా, సాగునీటి సమస్య కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికితోడు కొనుగోలు సమస్య రైతులను ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశాలు ఉన్నాయి. ఖరీఫ్ కొనుగోళ్లలోనే అనేక ఇబ్బందులు వచ్చాయి. సీఎంఆర్ కింద రైస్‌మిల్లర్లు వరిధాన్యం తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. గత రబీలో ఇచ్చిన సీఎంఆర్ లక్ష్యాన్ని రైస్‌మిల్లర్లు పూర్తి చేయలేదు. మొన్నటి ఖరీఫ్‌లో సీఎంఆర్ కింద వరిధాన్యాన్ని రైస్‌మిల్లర్లకు బలవంతంగా అంటగట్టారు. రైస్‌మిల్లర్లు తీసుకున్న వరిధాన్యాన్ని నూర్పిడి చేసి బియ్యంగా ప్రభుత్వానికి అందించాలంటే ఆగస్టు, సెప్టెంబరు వరకు సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో రబీలో రికార్డు స్థాయిలో ఉత్పత్తి కానున్న వరిధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు రైస్‌మిల్లర్లు చేతులెత్తేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే జగిత్యాల జిల్లాలో గోడౌన్‌లు కూడా లేకపోవడంతో రైస్‌మిల్లర్లు ఇస్తున్న బియ్యం ప్రభుత్వం నిల్వ చేసే అవకాశం లేదు. కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు ఇక్కడి నుంచి పంపాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో జిల్లాలో వరి పంట సాగు విస్తీర్ణం కొత్త సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి.
పెరుగుతున్న విద్యుత్ వినియోగం
జగిత్యాల జిల్లాలో పంటల విస్తీర్ణం భారీగా పెరుగడంతో విద్యుత్ వాడకం కూడా పెరిగింది. రికార్డు స్థాయిలో వరి పంటతో పాటు మొక్కజొన్నలాంటి పంటల విస్తీర్ణం బాగా పెరిగింది. దీంతో విద్యుత్ వాడకం కూడా జిల్లాలో బాగానే పెరిగింది. జిల్లాలో సగటున 2.2 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం ఉంటుండగా, పక్షం రోజులుగా పెరుగుతూ వచ్చి ప్రస్తుతం 3.16 మిలియన్ యూనిట్లకు చేరింది. రానున్న రోజుల్లో విద్యుత్ వాడకం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. పంట చివరి దశలో శ్రీరాంసాగర్ నుంచి ఆయకట్టు చివరి భూములకు నీరందనట్లయితే రైతులంతా పంపుసెట్లపైనే ఆధారపడాల్సి వస్తుంది. దీంతో విద్యుత్ వాడకం భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.