చుక్కచుక్కకూ లెక్క

ABN , First Publish Date - 2020-11-20T05:28:29+05:30 IST

రామగుండం నగరపాలక సంస్థలో ప్రజలు వాడుకునే ప్రతి నీటి చుక్క ఇక లెక్కలోకి రానున్నది.

చుక్కచుక్కకూ లెక్క
నల్లాలకు బిగిస్తున్న మీటర్‌

- రామగుండంలో నల్లాలకు మీటర్లు

- అమృత్‌ పథకంలో రూ.5కోట్ల కేటాయింపు

- 36,683 మీటర్లకు బిగించే చర్యలు

- నాసిరకం సామగ్రి తెచ్చారంటూ విమర్శలు

కోల్‌సిటీ, నవంబరు 19: రామగుండం నగరపాలక సంస్థలో ప్రజలు వాడుకునే ప్రతి నీటి చుక్క ఇక లెక్కలోకి రానున్నది. ఈమేరకు ఇంటింటికి నల్లాలకు మీటర్లు బిగిస్తున్నారు. ఇందుకోసం అమృత్‌ పథకం నుంచి రూ.5కోట్లు కేటాయించారు. ఎల్‌అండ్‌టీ సంస్థ ఆధ్వర్యంలో ఈ బిగింపు పనులు జరుగుతున్నాయి. రామగుండం నగరపాలక సంస్థలో ప్రస్తుతం 39వేలకుపైగా నల్లా కనెక్షన్లు ఉన్నాయి. పాతవి 18500కనెక్షన్లు కాగా అమృత్‌ పథకంలో ఎల్‌అండ్‌టీ సంస్థ 21,400 కనెక్షన్లు ఇచ్చింది. రూ.90కోట్ల వ్యయంతో రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో అమృత్‌ పథకం కింద పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా భీమునిపట్నం, సీఎస్‌పీకాలనీ, విఠల్‌నగర్‌లో ఓవర్‌హెడ్‌ ట్యాంకుల నిర్మాణం పూర్తయ్యింది. పలు ట్యాంకులకు పంపింగ్‌ మెయిన్‌లు, పలు కాలనీల్లో డిస్ర్టిబ్యూషన్‌ లైన్లు నిర్మిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమృత్‌ పథకంలో ప్యాకేజీ-1 కింద రామగుండంలో పనులను ఎల్‌అండ్‌టీ సంస్థకు అప్పగించింది. ఈ ప్యాకేజీలో 20వేల కొత్త నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. దీంతో పాటు ప్రతి నల్లా కనెక్షన్‌కు మీటర్లు బిగించే పనిని అప్పగించారు. కార్పొరేషన్‌లో ఎల్‌అండ్‌టీ సంస్థ కొత్తగా 18,500 కనెక్షన్లు ఇచ్చినట్టు పేర్కొంటున్నది. ఇప్పటికే ఉన్న కనెక్షన్లతో పాటు కొత్త కనెక్షన్లకు మీటర్లు బిగిస్తున్నారు. ఒక్కో వాటర్‌ మీటర్‌, బాక్స్‌కు రూ.1,136 చొప్పున వెచ్చిస్తున్నారు. సుమారు రూ.5కోట్లు వీటికే వ్యయం కానున్నది. బిగింపు పనులకు రూ.76లక్షలు, మీడియం డెన్సిటీ పైప్‌నకు రూ.53లక్షలు, బాల్‌ వాల్వ్‌లకు  రూ.కోటి కేటాయించారు. ప్రతి ఇంట్లోని నల్లాకు మీటర్లు బిగించి బాక్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈ బాక్స్‌కు తాళం సౌకర్యం ఇచ్చారు. ఇప్పటికే పలు డివిజన్లలో బిగింపు ప్రక్రియ కూడా పూర్తయ్యింది. 

ప్రతి నీటి బొట్టుకు లెక్క

రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో సంస్థకు మిషన్‌ భగీరథ ద్వారా ఎల్లంపల్లి నుంచి నీటి సరఫరా చేస్తున్నారు. గత పదేళ్లుగా రోజు విడిచి రోజే నీటి సరఫరా జరుగుతుంది. నెలలో 15రోజులు నీటి సరఫరా చేస్తున్నారు. నెలకు వంద రూపాయలు నల్లా బిల్లులు వసూలు చేస్తున్నారు. మీటర్లు బిగించడం ద్వారా అర్బన్‌ ఏరియాలో మున్సిపల్‌ కార్పొరేషన్‌లో నిర్ణీత రేట్లు పెట్టి వసూలు చేయనున్నారు. వాటర్‌ గ్రిడ్‌లో అర్బన్‌లో రోజూ 135లీటర్లు సరఫరా చేయాలని లెక్క ఉంది. 

రామగుండంలో ఇది రెండోసారి

రామగుండం మున్సిపాలిటీగా ఉన్న సమయంలో 2001-02 ఆర్థిక సంతవత్సరంలో పాత మున్సిపల్‌ కార్యాలయం, సంజయ్‌గాంధీనగర్‌, అశోక్‌నగర్‌, శారదానగర్‌ ట్యాంకుల పరిధిలో నల్లాలకు మీటర్లు బిగించారు. నల్లా కనెక్షన్లు ఇచ్చే సమయంలోనే మీటర్ల చార్జీలను కూడా వసూలు చేసే వారు. అశోక్‌నగర్‌, పాత మున్సిపల్‌ కార్యాలయం ట్యాంకుల పరిధిలో నిరంతర నీటి సరఫరాను ప్రయోగత్మాకంగా కొన్ని రోజులు నిర్వహించారు. అప్పుడు తక్కువ కనెక్షన్లు ఉండడంతో  కొనసాగింది. కనెక్షన్లు పెరగడంతో ఎత్తివేశారు. కానీ రోజూ 500 లీటర్ల వినియోగానికి ఒక యూనిట్‌ చొప్పున లెక్కించి రీడింగ్‌ తీసేవారు. కనిష్ఠంగా రూ.60వసూలు చేశారు. ఇక వాడకాన్ని బట్టి బిల్లులు వచ్చేవి. రామగుండం నగరపాలక సంస్థలో మళ్లీ మీటర్ల రీడింగ్‌ ఆధారంగానే బిల్లులు వసూలు చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. 

భగీరథ నీరు వచ్చినా...

రామగుండం నగరపాలక సంస్థలో  మిషన్‌ భ గీరథ జలాలు అందుబాటులోకి వచ్చినా ఇంకా రోజు విడిచి రోజే నీటి సరఫరా జరుగుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్‌కు నీటిని పంపింగ్‌ చేసి ప్రతిరోజు నీటి సరఫరా చేస్తున్నారు. కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో సైతం ప్రతి రోజు నీటి సరఫరా ఉంది. కానీ రామగుండంలో మాత్రం భగీరథ జలాలు అందుబాటులోకి వచ్చినా రోజు విడిచి రోజే నీటి సరఫరా జరుగుతుంది. 

సామగ్రిలో నాణ్యత లేదనే విమర్శలు

అమృత్‌ పథకం కింద సుమారు రూ.6కోట్ల వ్యయంతో మీటర్ల బిగింపు కార్యక్రమం జరుగుతుంది. ఇందులో సామగ్రిలో నాణ్యత లేదనే విమర్శలున్నాయి. ముఖ్యంగా బాల్‌ వాల్వ్‌లు, పైపులు, బాక్స్‌ తదితర సామాగ్రి నాణ్యతతో లేదు. ఇప్పటికే పలు డివిజన్లలో మీటర్లు బిగించిన తెల్లవారే పైపులు ఊడిపోవడం, నీటి సరఫరా సరిగా లేకపోవడం వంటివి జరుగుతున్నాయి. నగరపాలక సంస్థ పర్యవేక్షణ లేకపోవడంతో దీనిని పట్టించుకునే పరిస్థితి లేదు.

మీటర్ల బిగింపుపై విమర్శలు

రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో పదేళ్లుగా సరైన నీటి సరఫరాల ఏదు. ఇప్పటికీ రోజు విడిచి రోజే నీటి సరఫరా జరుగుతుంది. ప్రతి రోజు నీటి సరఫరా చేయడంపై దృష్టి పెట్టని నగరపాలక సంస్థ ఇప్పుడు మీటర్లు బిగిస్తుండడం పట్ల ప్రజల్లో విమర్శలు తలెత్తుతున్నాయి. 

Updated Date - 2020-11-20T05:28:29+05:30 IST