అర్హులైన రైతులకు సొమ్ము అందేలా కృషి చేయాలి

ABN , First Publish Date - 2020-12-18T05:04:21+05:30 IST

రైతుబంధు, ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాల ద్వారా అర్హులైన ప్రతి రైతుకు సొమ్ము అందేవిధంగా కృషి చేయాలని కలెక్టర్‌ కె శశాంక అధికారులను ఆదేశించారు.

అర్హులైన రైతులకు సొమ్ము అందేలా కృషి చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ కె శశాంక

కలెక్టర్‌ కె శశాంక

కరీంనగర్‌, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రైతుబంధు, ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాల ద్వారా అర్హులైన ప్రతి రైతుకు సొమ్ము అందేవిధంగా కృషి చేయాలని కలెక్టర్‌ కె శశాంక అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వ్యవసాయ, హార్టికల్చర్‌, ఆత్మ, డీఆర్డీవో, శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ధరణిలో నమోదైన 1,76,138 మంది రైతుల వివరాలు రైతుబంధు పోర్టల్‌లో పొందుపర్చామని తెలిపారు. కొత్తగా ఎవరైనా రైతుబంధు కొరకు అకౌంట్‌ ఇవ్వాలనుకుంటే ఈనెల 21లోపు వ్యవసాయ విస్తరణ అధికారులకు దరఖాస్తు ఫారం, పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌, బ్యాంకు అకౌంట్‌ ఇవ్వాలని కోరారు. నుస్తులాపూర్‌ విజయబ్యాంకు అకౌంట్‌ వివరాలు మారినందున తిమ్మాపూర్‌, చిగురుమామిడి, గన్నేరువరం, మానకొండూర్‌ మండలాల్లోని దాదాపు 1100మంది రైతుల వివరాల మార్పునకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయాధికారులు సాంకేతిక నైపుణ్యం ప్రదర్శించాలని సూచించారు. ప్రతి మండల వ్యవసాయాధికారి తమతమ గ్రామాల్లో రైతు లకు అధిక దిగుబడి వచ్చేవిధంగా ఆత్మ, కేవీకే, ఉద్యానశాఖ సమన్వయంతో సాంకేతిక సలహాలు అందించాలని ఆదే శించారు. కల్లాలు నిర్మించుకోవడానికి రైతులను ప్రోత్సహించడంతోపాటు వచ్చే ఏడాదికి సంబంధించిన హరితహారం లక్ష్యానికి అనుగుణంగా ఎలాంటి మొక్కలైతే రైతుల పొలాల చుట్టూ అనువుగా ఉంటాయో ప్రణాళికా సిద్ధం చేసి నర్సరీల్లో మొక్కలను పెంచాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌, డీఆర్‌వో వెంకటేశ్వర్‌రావు, ఆత్మ పీడీ, హార్టికల్చర్‌ డీడీ, టెక్నికల్‌ సిబ్బంది, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-18T05:04:21+05:30 IST