కన్నీరు పెట్టించిన కరోనా

ABN , First Publish Date - 2020-12-31T05:02:38+05:30 IST

కరోనా జిల్లాలో కలవరం సృష్టించింది.. ఎందరినో కన్నీరు పెట్టించింది... ఎన్నో జీవితాలను, ఎన్నో రంగాలను తలకిందులు చేసింది.. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది...

కన్నీరు పెట్టించిన కరోనా

రాజకీయంగా జిల్లాకు గుర్తింపు

ఆర్థికంగా కుదేలైన పలు రంగాలు

2020 మెరుపులు.. మరకలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కరోనా జిల్లాలో కలవరం సృష్టించింది.. ఎందరినో కన్నీరు పెట్టించింది... ఎన్నో జీవితాలను, ఎన్నో రంగాలను తలకిందులు చేసింది.. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది... ఇండోనేషియన్ల రాకతో జిల్లాలో ప్రవేశించిన ఈ వ్యాధి అధికారుల లెక్కల ప్రకారమే ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 52 వేల మందికి సోకి 466 మందిని పొట్టన పెట్టుకున్నది. రాష్ట్రంలో మార్చి 2వ తేదీన తొలి కరోనా కేసు నమోదు కాగా కరీంనగర్‌ జిల్లాలో మార్చి 17న తన ఉనికిని చాటింది. ఈ యేడాది మార్చి 16న ఇండోనేషియన్లు జిల్లాకు రాగా వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా 17న వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ తర్వాత మర్కజ్‌ వెళ్లి వచ్చిన వారితో మరికొన్ని కేసులు, గల్ఫ్‌ దేశాలు, ముంబయి తదితర ప్రాంతాలకు వలస వెళ్లినవారు తిరిగి రావడంతో పట్టణాలకు పరిమితమైన వ్యాధి పల్లెలకు పాకింది. ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 52 వేల మందికి కరోనా వ్యాధి నిర్ధారణ కాగా అందులో కరీంనగర్‌ జిల్లాకు చెందినవారే 24,494 మంది ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 11,526 మందికి, జగిత్యాల జిల్లాలో 10,500 మందికి, పెద్దపల్లి జిల్లాలో 5,476 మందికి వ్యాధి సోకింది. కరీంనగర్‌ జిల్లాలో 240 మంది, సిరిసిల్ల జిల్లాలో 122 మంది, జగిత్యాల జిల్లాలో 55 మంది, పెద్దపల్లి జిల్లాలో 50 మంది వ్యాధి బారినపడి మరణించారు. ఇప్పటికి రోజుకు వంద మందికిపైగా వ్యాధి బారిన పడుతూనే ఉన్నారు. కరోనా సోకిన వారి కుటుంబాలు వేలాది రూపాయలు వెచ్చించి చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

ఇబ్బందులు పడ్డ సామాన్య జీవులు

వ్యాపార, వాణిజ్య రంగాలు, పరిశ్రమలు, చిన్న వ్యాపారులు, రోజువారి పనిచేసే ఉద్యోగులు, వేతన జీవులు తమ ఆదాయ మార్గాలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయారు. ప్రైవేట్‌ రంగంలో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. కుటుంబ పెద్దలను కోల్పోయిన కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. 

తొమ్మిది నెలలు.. భయంభయంగా

మార్చి 17న కరీంనగర్‌లో రెడ్‌ జోన్‌ ఏర్పాటు చేసిన నాటి నుంచి డిసెంబర్‌ 31 వరకు కరోనా కాలంగానే మారిపోయింది. రెండున్నర మాసాలు మినహా మిగతా తొమ్మిదిన్నర మాసాలు కరోనాతోనే భయం భయంగా గడుపుతూ ప్రజలు ఏ పనులు చేసుకోకుండా అన్నివిధాలా అవస్థలు పడ్డారు. మొత్తానికి 2020 మొత్తం కరోనా నామ సంవత్సరంగా మారింది. మార్చి 22న ప్రధాని పిలుపు మేరకు దేశ ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటించగా ఆ రోజునుంచే లాక్‌డౌన్‌ మొదలయింది. మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 14 వరకు మొదటి లాక్‌డౌన్‌, ఏప్రిల్‌ 15 నుంచి మే 3 వరకు రెండో లాక్‌డౌన్‌, మే 4 నుంచి మే 17 వరకు మూడోలాక్‌డౌన్‌, మే 18 నుంచి 31 వరకు నాలుగో విడత లాక్‌డౌన్‌ విధించారు. జూన్‌ 1 నుంచి లాక్‌డౌన్‌ సడలించగా క్రమేపీ కరోనా కేసులు పెరుగుతూ పోయాయి. జూలై, ఆగస్టు, సెప్టెంబరులో విజృంభించిన వైరస్‌ అక్టోబర్‌ నుంచి తగ్గుముఖం పడుతూ వచ్చింది.  ఇప్పటికీ ప్రతిరోజూ ఉమ్మడి జిల్లా పరిధిలో రోజుకు సగటున 150 నుంచి 200 కేసులు నమోదవుతూ వస్తున్నాయి. 

అందుబాటులోకి ‘కాళేశ్వరం’ జలాలు

ఆర్థిక వ్యవస్థను, జనజీవనాన్ని చిన్నాభిన్నం చేసిన ఈ సంవత్సరం కొన్ని అరుదైన రికార్డులను జిల్లాకు సాధించి పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చి శ్రీపాద ఎల్లంపల్లి, లోయర్‌ మానేరు డ్యాం, మిడ్‌ మానేరు డ్యాం జలకళను సంతరించుకున్నాయి. శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవ ప్రాజెక్టు పూర్తయి శ్రీరాంసాగర్‌కు దిగువ నుంచి నీటిని ఎత్తిపోసే మార్గం సుగమం అయింది. నాలుగు ప్రాజెక్టులు నీటితో నిండి సుమారు 13 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యే పరిస్థితి నెలకొన్నది. రికార్డు స్థాయిలో వానాకాలం, యాసంగి సాగును చేపట్టిన రైతులు పెద్ద ఎత్తున వరి దిగుబడులను సాధించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 16 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి సాధించారు.

అభివృద్ధి వైపు అడుగులు

రామగుండం ఎరువుల కర్మాగారం దాదాపుగా పూర్తి కావచ్చింది. మరో నెల రోజుల్లోగా ఇక్కడ ఎరువులు ఉత్పత్తి అయ్యే పరిస్థితి ఏర్పడింది. కరీంనగర్‌ జిల్లాలో నెలకొల్పిన ఐటీ టవర్‌ జూలైలో ప్రారంభమయింది. 1300 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభించాయి. కరీంనగర్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు పడ్డాయి. మానేరు రివర్‌ ఫ్రంట్‌కు శ్రీకారం చుట్టి కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతోంది. స్మార్ట్‌ సిటీలో భాగంగా కరీంనగర్‌ సుందరీకరణ వేగవంతంగా సాగుతోంది. 

రాజకీయాల్లో కరీంనగర్‌ ముద్ర

2020 సంవత్సరంలో కరీంనగర్‌ నేతలు రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ ఈ యేడాది మార్చిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. జగిత్యాలకు చెందిన ఎల్‌ రమణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా జిల్లాకే చెందిన చాడ వెంకటరెడ్డి తన పదవిని నిలుపుకోగా బండ సురేందర్‌ రెడ్డి ఫార్వర్డ్‌ బ్లాక్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొత్త రాజకీయాలకు తెరలేపారు. కేడీసీసీబీ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు టెస్కాబ్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. కరీంనగర్‌ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతలను ఈ సంవత్సరం కోల్పోవాల్సి వచ్చింది. మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు, జడ్పీ మాజీ చైర్మన్‌ కేవీ రాజేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యే మాతంగి నర్సయ్య ఈ యేడాదిలో కన్నుమూశారు

జాతీయస్థాయిలో గుర్తింపు

కరీంనగర్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వరుసగా నాలుగోసారి జాతీయ స్థాయిలో అత్యుత్తమ బ్యాంకు అవార్డును దక్కించుకున్నది. ఈ బ్యాంకు అధ్యక్షుడిగా ఉన్న కొండూరి రవీందర్‌రావు జాతీయ కో-ఆపరేటివ్‌ బ్యాంకు సమాఖ్య (నాఫ్స్‌క్యాబ్‌) చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇదే సందర్భంలో ఆయన బెస్ట్‌ ఫర్ఫార్మెన్స్‌ అవార్డును అందుకున్నారు. జమ్మికుంట పోలీస్‌ స్టేషన్‌కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో గుర్తింపును ఇచ్చింది. జాతీయ స్థాయిలో ఈ పోలీస్‌ స్టేషన్‌కు మెరుగైన సేవలందించడంలో 10వ ర్యాంకు దక్కింది. కరీంనగర్‌ జిల్లా గందగి ముక్తి అవార్డును దక్కించుకున్నది. పెద్దపల్లి జిల్లా మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా జాతీయ అవార్డు పొందింది. 


Updated Date - 2020-12-31T05:02:38+05:30 IST