జిల్లాలో పెండింగ్‌ పనులన్నీ వేగంగా పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2020-12-31T04:55:01+05:30 IST

జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి గంగుల కమలాకర్‌ అధికారులను ఆదేశించారు.

జిల్లాలో పెండింగ్‌ పనులన్నీ వేగంగా పూర్తిచేయాలి
కరీంనగర్‌లోని పర్మిట్‌ రూం

మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి గంగుల కమలాకర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ కె శశాంక అధ్యక్షతన జిల్లా అభివృద్ధి, సంక్షేమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందన్నారు. ముఖ్యంగా జిల్లాలో రెండు పడకల గదుల నిర్మాణ పనుల కొరకు డీఎంఎఫ్‌టీ, మున్సిపాలిటీ నిధులు కేటాయించి కొంతవరకు పనులు పూర్తి చేశామన్నారు. వాటి నిర్మాణ పనులు పూర్తి చేయుటకు కరోనా వలన నిధులకు కొంత సమస్య ఏర్పడిందన్నారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆ నిధులను మంజూరి చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ను మంత్రి కోరారు.

నిధుల కేటాయింపునకు చర్యలు తీసుకుంటాం..

- ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్‌కుమార్‌

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో నెలకొన్న సమస్యలన్నింటినీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్లి త్వరలో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా జిల్లాలో ఇప్పటికే కేటాయించిన, మంజూరు చేసిన రెండు పడక గదుల ఇళ్లు, వాటిలో ఎన్ని పూర్తైనవి, ఎన్ని మిగిలి ఉన్నవి, ఇంకా ఎన్ని పనులు ప్రారంభించలేదు, వాటికి ఎదురవుతున్న సమస్యలపై సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులకు సూచించారు. మానకొండూర్‌, చొప్పదండి హుస్నాబాద్‌ ఎమ్మెల్యేలు నియోజకవర్గస్థాయిలో పెండింగ్‌ పనులు, వాటికి అవసరమైన నిధుల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.

పెండింగ్‌ పనులన్నీ ఫిబ్రవరి15 నాటికి పూర్తి చేసేందుకు చర్యలు

- కలెక్టర్‌ కె శశాంక

కలెక్టర్‌ కె శశాంక మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన వివిధ ఇంజనీరింగ్‌ విభాగాల పనులు, రెండు పడకల ఇళ్ల నిర్మాణాలు, చెక్‌డ్యాంల నిర్మాణాలు, యాసంగిలో నీటి ఎద్దడి నివారణకు, నిరంతరాయ విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన ప్రత్యేక ప్రణాళికలు తయారు చేశామని తెలిపారు. త్వరలోనే నాలుగు నియోజకవర్గాల్లో నియోజకవర్గస్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి మిగిలి ఉన్న పనులన్నీ ఫిబ్రవరి 15వ తేదీ నాటికి పూర్తి చేస్తేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ వి లక్ష్మికాంతారావు, జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, మానకొండూర్‌, చొప్పదండి, హుస్నాబాద్‌ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, సతీష్‌ కుమార్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌, మేయర్‌ వై సునీల్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-31T04:55:01+05:30 IST