-
-
Home » Telangana » Karimnagar » District SP Sindhusharma
-
ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి
ABN , First Publish Date - 2020-03-24T11:29:38+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 31 వరకు జిల్లాలో లాక్‌డౌన్ అమలులో ఉందని, ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ పాటించాలని జిల్లా ఎస్పీ సింధుశర్మ అన్నారు.

జిల్లావ్యాప్తంగా చెక్‌పోస్టులు, పెట్రోలింగ్ పార్టీలు
జీవో నెం.45 ఉల్లంఘనతో 149 వాహనాలు సీజ్
హోం ఐసోలేషన్ ఉల్లంఘనపై ఆరు కేసులు నమోదు
నేటి నుంచి బయట తిరిగితే నాన్ బెయిలబుల్ కేసులు
జిల్లా ఎస్పీ సింధుశర్మ
జగిత్యాల టౌన్, మార్చి 23: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 31 వరకు జిల్లాలో లాక్‌డౌన్ అమలులో ఉందని, ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ పాటించాలని జిల్లా ఎస్పీ సింధుశర్మ అన్నారు. జగిత్యాల జిల్లావ్యాప్తంగా పోలీసులు సోమవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు ప్రతి వాహనం పరిశీలిస్తారని, ప్రైవేట్ వెహికిల్స్ ఎమర్జెన్సీ పనులకు మాత్రమే ఉపయోగించాలన్నారు. నేటి నుంచి ఈ నెల 31 వరకు జిల్లాలో ఐదుగురు వ్యక్తులు ఎక్కడ గుమిగూడి కనిపించకూడదని ఆదేశాలు జారీ చేశారు. అవసరాల నిమిత్తం ఒక వ్యక్తికి మాత్రమే బయటకు రావడానికి అనుమతి ఉంటుందన్నారు. ప్రతి బైక్‌పై ఒక వ్యక్తి, ఫోర్ వీలర్‌పై ఇద్దరికి మాత్రమే అనుమతి ఉందని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా రోడ్లపై ఇష్టానుసారంగా తిరిగిన 149 వాహనాలను సీజ్ చేశామని వివరించారు. విదేశాల నుంచి వచ్చి హోం ఐసోలేషన్‌లో ఉండకుండా జనసాంద్రత గల ప్రదేశాల్లో తిరిగిన ఆరుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరిగిందని వివరించారు. జీవో నెం.45లోని అంశాలను ఉల్లంఘించిన మరో ఆరుగురిపై కూడా కేసులు పెట్టామని వివరించారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా ఇష్టారీతిలో ఎవరైనా ప్రవర్తిస్తే 188, 269, 270, 271 సెక్షన్‌ల ప్రకారం నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామన్నారు. అనంతరం జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద అదనపు ఎస్పీ దక్షిణామూర్తి ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టారు. వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు ప్రత్యేక బారీకేడ్లు ఏర్పాటు చేశారు.