మొదలైన ప్రచారం

ABN , First Publish Date - 2020-02-12T12:22:03+05:30 IST

సహకార ఎన్నికల ప్రచారం మొదలైంది. నామినేషన్ల ఉప సంహరణ ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారం హోరెత్తిస్తున్నారు.

మొదలైన ప్రచారం

స్థానిక సంస్థల ఎన్నికలను తలపిస్తున్న పోరు

ఓట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నాలు

గ్రామాలుగా విడిపోతున్న ఓటర్లు

క్యాంపునకు తరలుతున్న ఏకగ్రీవ డైరెక్టర్లు


ఆంధ్రజ్యోతి, జగిత్యాల: సహకార ఎన్నికల ప్రచారం మొదలైంది. నామినేషన్ల ఉప సంహరణ ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారం హోరెత్తిస్తున్నారు. స్థానిక సంస్థలను తలపించేలా అభ్యర్థులు రైతులను కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఓట్లు రాబట్టుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. తమ అనుచరులను గెలిపించుకునేందుకు ముఖ్య నేతలు రంగంలోకి దిగి ఆయా రైతు సంఘాల ముఖ్యులను కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మరోవైపు ఏకగ్రీవంగా ఎన్నికైన డైరెక్టర్లను చైర్మన్‌ అభ్యర్థులు క్యాంపులకు తరలిస్తున్నారు. 


ఓట్ల వేటలో అభ్యర్థులు

సహకార సంఘాల ఎన్నికల్లో ప్రచారం హోరెత్తుతోంది. ఈ నెల 15న సహకార సంఘాల పరిధిలోని డైరెక్టర్‌ పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. జిల్లాలో మొత్తం 51 సహకార సంఘాలు ఉండగా, వీటిలో 651 డైరెక్టర్‌ పదవులు ఉన్నాయి. ఇందులో 302 డైరెక్టర్‌ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. 349 డైరెక్టర్‌ పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం 849 మంది పోటీలో ఉన్నారు. పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, బీజేపీ సానుభూతిపరులు రంగంలోకి దిగారు. ఇందులో 270కి పైగా డైరెక్టర్‌ పదవులను టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందినవారు గెలుచుకోగా, మిగిలిన చోట కాంగ్రెస్‌, బీజేపీకి చెందినవారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


మిగిలిన 349 స్థానాల్లో పట్టు నిలుపుకునేందుకు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు ప్రచారంలోకి దిగాయి. ఒక్కో డైరెక్టర్‌ పదవికి ముగ్గురు, నలుగురు పోటీ పడుతున్నారు. ఒక్కో డైరెక్టర్‌  స్థానంలో మూడు, నాలుగు గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల నుంచి ఆశావహులు బరిలో నిలువగా, ఓటర్లు కూడా గ్రామాలుగా విడిపోయినట్లు ప్రచారం సాగుతోంది. తమ గ్రామానికి చెందినవారికే ఓటు వేసి గెలిపించుకోవాలని తీర్మానాలు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల తాము గెలుపొందితే గ్రామాభివృద్ధికి కొంత నగదు ఇచ్చేందుకు అభ్యర్థులు ముందుకు వస్తున్నట్లు తెలిసింది.


ప్రచారంలోకి ముఖ్య నేతలు

సహకార సంఘ ఎన్నికలకు మరో రెండు రోజులే ప్రచారం చేసుకునే వెసులుబాటు ఉండటంతో ముఖ్య నేతలంతా రంగంలోకి దిగారు. స్థానిక సంస్థల ఎన్నికల తరహాలోనే ఓటర్లను కలుస్తూ మచ్చిక చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల మందు, విందులు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. జిల్లాలోని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వీలున్న చోట ముఖ్య నేతలను కలుస్తుండగా, ఎక్కువగా ఫోన్‌ల ద్వారానే నాయకులతో మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేల అనుచరులే రంగంలోకి దిగి తమ అనుచరులను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. జగిత్యాల ప్రాంతంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సహకార ఎన్నికల్లో కాంగ్రెస్‌ శ్రేణులను గెలిపించుకునేందుకు ప్రచారం చేస్తున్నారు.


ఇప్పటికే సారంగాపూర్‌, బీర్‌పూర్‌, రాయికల్‌, జగిత్యాల ప్రాంతంలోని ముఖ్య నేతలతో మాట్లాడారు. ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఇప్పటికే తన నియోజకవర్గంలోని 9 చోట్ల మెజార్టీ సభ్యులను గెలిపించుకోగా, మిగిలిన మూడు చోట్ల కూడా మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుని క్లీన్‌ స్వీప్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ మొన్న జరిగిన మున్సిపల్‌ ఎన్నికల తరహాలోనే మెజార్టీ స్థానాలను గెలిపించుకునేందుకు పావులు కదుపుతున్నారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు తన అనుభవంతో సభ్యులను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే వేములవాడ ఎమ్మెల్యే రమేష్‌బాబు, చొప్పదండి ఎమ్మెల్యే రవి శంకర్‌లు కూడా తమ నియోజకవర్గం పరిధిలోని సహకార సంఘాల డైరెక్టర్‌లను గెలిపించుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. సహకార సంఘాల్లో పోరు తారా స్థాయికి చేరుకుంది.

Updated Date - 2020-02-12T12:22:03+05:30 IST