ఎమ్మెల్యే ప్రోద్భలంతోనే సస్పెండ్‌ చేశారు

ABN , First Publish Date - 2020-11-22T04:46:15+05:30 IST

ఎమ్మెల్యే ప్రోద్భలంతోనే కలెక్టర్‌ తనను సస్పెండ్‌ చేశారని గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి సర్పంచ్‌ తాళ్ల విజయలక్ష్మి ఆరోపించారు.

ఎమ్మెల్యే ప్రోద్భలంతోనే సస్పెండ్‌ చేశారు
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న లక్ష్మీదేవిపల్లి గ్రామస్థులు


లక్ష్మీదేవిపల్లి సర్పంచ్‌ తాళ్ల విజయలక్ష్మి

కలెక్టరేట్‌ ఎదుట గ్రామస్థుల ధర్నా

సుభాష్‌నగర్‌, నవంబరు 21: ఎమ్మెల్యే ప్రోద్భలంతోనే కలెక్టర్‌ తనను సస్పెండ్‌ చేశారని గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి సర్పంచ్‌ తాళ్ల విజయలక్ష్మి ఆరోపించారు. శనివారం కరీంనగర్‌లోని ప్రెస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వైకుంఠధామం నిర్మించేందుకు తాము చర్యలు తీసుకున్నప్పటికీ, ఇద్దరు రైతులు అడ్డుకున్నారని ఆరోపించారు. అధికారులు బాధ్యులపైచర్యలు తీసుకోవాల్సిందిపోయి తనను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. గ్రామంలోని సర్వే నెంబర్‌189లో శ్మశాన వాటిక నిర్మాణానికి స్థలం కేటాయించారని అన్నారు. అయితే 190 సర్వే నెంబర్‌లో దారి చూపించారని తెలిపారు. రెండు అగ్రవర్ణ కుటుంబాలవారు అడ్డుకున్నారని ఆరోపించారు. శ్మశానవాటిక నిర్మా ణంలో అడ్డంకులపై కలెక్టర్‌ మధ్యాహ్నం 2గంటలకు టైమ్‌ ఇచ్చి రాత్రి 9 గంటల వరకు కరీంనగర్‌లో వెయిట్‌ చేయించారని పేర్కొన్నారు. ఆ సమావేశంలోనూ కలెక్టర్‌ తనను అవమానికి గురిచేశారని ఆరోపించారు. ఏకపక్షంగా నోటీసులు జారీచేసి కక్షపూరితంగా సస్పెండ్‌ చేశారని ఆరోపించారు. దళిత మహిళనైన తనను మానసిక క్షోభకు గురిచేసి సస్పెండ్‌కు బాధ్యులైన అధికారులపై న్యాయం పోరాటం చేస్తామని చెప్పారు. న్యాయస్థానంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, న్యాయం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు. అనంతరం లక్ష్మీదేవిపల్లి సర్పంచ్‌  సస్పెండ్‌ను నిరసిస్తూ గ్రామ ప్రజలు, ప్రజా సంఘాల ప్రతినిధులు కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ భాగ్యలక్ష్మి, దళిత సంక్షేమ సంఘం కన్వీనర్‌ కనకం వంశీ, తెలంగాణ అంబేద్కర్‌ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి మహేశ్‌, టీఏవైఎస్‌ రాష్ట్ర కార్యనిర్వాహకుడు సుద్దాల లక్ష్మణ్‌, కేవీపీఎస్‌ సురేష్‌, మేడి అంజయ్య, రేమీల రమేశ్‌, ఇరుగురాళ్ల గంగవ్వ, పొన్నం పర్శరాం, గుర్రం రాజిరెడ్డి, పెరుమల్ల ప్రభాకర్‌, బొలుమల్ల సంజీవ్‌, తాళ్ల రవి పాల్గొన్నారు. 

Read more