లెక్క తప్పింది..

ABN , First Publish Date - 2020-12-21T04:14:35+05:30 IST

వానాకాలం సాగు లెక్క తప్పింది. సమృద్ధిగా కురిసిన వర్షాలు నియంత్రిత సాగు విధానంతో అధిక దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. లక్ష్యానికి చేరువయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

లెక్క తప్పింది..
రాజన్న సిరసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు

- ధాన్యం దిగుబడి లక్ష్యం 3.25 లక్షల మెట్రిక్‌ టన్నులు 

-  2 లక్షలు కూడా దాటని పరిస్థితి 

- ఇప్పటి వరకు జిల్లాలో 1.57 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు 

- వానాకాలం సాగులో 1.39 లక్షల ఎకరాల్లో వరి పంట

-  226  కొనుగోలు కేంద్రాల ఏర్పాటు 

- ఇప్పటికే 44 కేంద్రాల మూత

- నియంత్రిత సాగుతో నష్టపోయిన రైతులు 

 (ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

 వానాకాలం సాగు లెక్క తప్పింది. సమృద్ధిగా కురిసిన వర్షాలు నియంత్రిత సాగు విధానంతో అధిక దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. లక్ష్యానికి చేరువయ్యే పరిస్థితి కనిపించడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 226 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం 1,57,841 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే 44 మూసివేశారు. జనవరి మొదటి వారంలో పూర్తిగా కొనుగోళ్లు నిలిచిపోనున్నాయి. 


3.25 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి అంచనా

వానాకాలం పంటల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధిక దిగుబడి వస్తుందని అంచనా వేశారు. నియంత్రిత సాగుతో జిల్లాలో 2 లక్షల 50 వేల 220 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. వరి లక్షా 39 వేల ఎకరాల్లో వేశారు. దీంతో 3 లక్షల 25 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడిని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరో 20 రోజుల్లో కొనుగోళ్లు పూర్తవుతున్న దశలో ఇప్పటి వరకు కేవలం 1,57,841 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ఇందులో సన్నరకం 22,132 మెట్రిక్‌ టన్నులు ఉంది. ఐకేపీ ద్వారా 41,352 మెట్రిక్‌ టన్నులు, సింగిల్‌ విండోల ద్వారా 1,08,407 మెట్రిక్‌ టన్నులు, డీసీఎంస్‌ ద్వారా 3,226 మెట్రిక్‌ టన్నులు, మెప్మా ద్వారా 1255 మెట్రిక్‌ టన్నులు, మార్కెట్‌ యార్డుల ద్వారా 3,557 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు 39,931 రైతుల నుంచి రూ.297.83 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేపట్టారు. దిగుబడి అంచనా మాత్రం తగ్గింది. 


సన్నాల విక్రయానికి కష్టాలు 

 నియంత్రిత సాగులో భాగంగా సన్నరకం వరి పంట వేయాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఇందులో భాగంగా  జిల్లాలో 1.39 లక్షల ఎకరాల్లో వరి వేశారు. ఇందులో దొడ్డురకం 73,070 ఎకరాలు, సన్నరకం 6,662 ఎకరాల్లో  వేశారు. అల్పపీడన ప్రభావంతో పంట దెబ్బతినగా సన్నరకానికి కనీస మద్దతు ధర లభించని పరిస్థితి ఏర్పడింది. దొడ్డు రకం క్వింటాల్‌కు రూ.1,887 కొనుగోలు చేస్తే సన్నరకం సాధారణ రకంగా రూ.1868కి కోనుగోలు చేశారు. ప్రభుత్వం సన్నరకాన్ని ప్రోత్సహించినా కనీస మద్దతు ధర ఇవ్వలేకపోయింది. రైతులు మద్దతు ధర కోసం ఆందోళనలు చేపట్టారు. దిగుబడి లేక కొందరు రైతులు పంటను కూడా దగ్ధం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 22,132 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మిగతా సన్నరకం ధాన్యాన్ని రైతులు  నేరుగా మిల్లర్లకే అమ్ముకొని నష్టపోయారు. వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయకపోవడంతోనే దిగుబడి లెక్క తప్పినట్లుగా భావిస్తున్నారు. 

Updated Date - 2020-12-21T04:14:35+05:30 IST