సిరిసిల్ల బల్దియా బడ్జెట్‌ 74.54 కోట్లు

ABN , First Publish Date - 2020-05-22T10:20:43+05:30 IST

బల్దియా చరిత్రలోనే తొలిసారిగా బడ్జెట్‌ సమావేశం టెలీకాన్ఫరెన్స్‌తో ముగిసింది. ఫోన్‌లలో సాగిన సంభాషణలతోనే 2020-21 బడ్జెట్‌ రూ

సిరిసిల్ల బల్దియా బడ్జెట్‌ 74.54 కోట్లు

అభివృద్ధి పనులకు రూ. 41.61 కోట్లు కేటాయింపు

గ్రీన్‌ బడ్జెట్‌ రూ. 2.36 కోట్లు

టెలీ కాన్ఫరెన్స్‌తో కౌన్సిల్‌ ఆమోదం


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల): బల్దియా చరిత్రలోనే తొలిసారిగా బడ్జెట్‌ సమావేశం టెలీకాన్ఫరెన్స్‌తో ముగిసింది. ఫోన్‌లలో సాగిన సంభాషణలతోనే 2020-21 బడ్జెట్‌ రూ 74.54 కోట్లు ఆమోదించారు. గురువారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి అధ్యక్షతన సిరిసిల్ల మున్సిపల్‌ బడ్జెట్‌ 2020-21, సవరణ బడ్జెట్‌ 2019-20 సమావేశం జరిగింది. బడ్జెట్‌ సమావేశానికి అదనపు కలెక్టర్‌ అంజయ్య హాజరయ్యారు. తొలిసారిగా మున్సిపల్‌కు రావడంతో కౌన్సిల్‌ ఆయనను ఘనంగా సన్మానించింది.


కరోనా వైరస్‌ నియంత్రణ, లాక్‌డౌన్‌ నిబంధనలు దృష్టిలో పెట్టుకొని మున్సిపల్‌ సమావేశ మందిరం నుంచి ఉదయం 11 గంటలకు టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా మొదలైన సమావేశం సాయంత్రం 4 గంటల వరకు సుదీర్ఘంగా కొనసాగింది. కౌన్సిలర్లందరూ టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా బడ్జెట్‌పై చర్చించారు. 2020-21 సంవత్సరానికి గాను రూ 74.54 కోట్లు బడ్జెట్‌ను కౌన్సిల్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రీన్‌ బడ్జెట్‌ కింద రూ. 2.36 కోటు,్ల పట్టణంలోని అభివృద్ధి ప్రాజెక్టుల కోసం రూ. 41.61 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. మున్సిపల్‌ విలీన గ్రామాలకు, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ. 81 లక్షలు, మౌలిక వసతుల కల్పన కోసం రూ. 1.70 కోట్లు, కరెంటు బిల్లుల కోసం రూ. 2.02 కోట్లు కేటాయించారు. కౌన్సిలర్లు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. బడ్జెట్‌ సమావేశంతో పాటు సాధారణ సమావేశంలో 12 అంశాలను చర్చించారు. పట్టణ ప్రగతిలో భాగంగా వివిధ అభివృద్ధి పనులు చేపట్టడానికి రూ. 4.66 కోట్లకు ఆమోదం తెలిపారు. ఇందులో పబ్లిక్‌ టాయిలెట్ల కోసం రూ. 62 లక్షలు, ఓపెన్‌ జిమ్‌ల కోసం రూ. 84 లక్షలు, శానిటేషన్‌ వాహనాల కొనుగోలుకు రూ. 25 లక్షలు, పట్టణంలో వ్యర్థాల నిర్వీర్యం యూనిట్‌కోసం రూ. 19.50 కోట్లు కేటాయించారు.


వివిధ వార్డులలో 39 అభివృద్ధి పనుల కోసం రూ. 1.57 కోట్లతో ఆమోదం తెలిపారు. రగుడు జంక్షన్‌ను నిధులు రూ. 50 లక్షలు, బీవైనగర్‌, వెంకంపేట, శాంతినగర్‌, విద్యానగర్‌ల చౌరస్తాల అభివృద్ధికి రూ. 20 లక్షలు, ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులతో అభివృద్ధి చేయాలని ఆమోదించారు. పట్టణంలో కరోనా వైరస్‌ నేపథ్యంలో మహిళ సంఘాల ద్వారా మాస్కులు తయారు చేసి పంపిణీకి సంబంధించి రూ. 8 లక్షలు కేటాయించారు. సమావేశంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, కమిషనర్‌ సమ్మయ్య, అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-05-22T10:20:43+05:30 IST