కరోనా అనుమానితులకు నిర్దారణ పరీక్షలు

ABN , First Publish Date - 2020-03-21T11:34:30+05:30 IST

కరోనా వైరస్‌తో బాధపడే అనుమానితులను గుర్తించి కచ్చితమైన నిర్దారణ పరీక్షలు చేయాలని కలెక్టర్‌ కె శశాంక వైద్యాధికారులను ఆదేశించారు.

కరోనా అనుమానితులకు నిర్దారణ పరీక్షలు

 జిల్లా కలెక్టర్‌ కె శశాంక


కరీంనగర్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి, ప్రతినిధి): కరోనా వైరస్‌తో బాధపడే అనుమానితులను గుర్తించి కచ్చితమైన నిర్దారణ పరీక్షలు చేయాలని కలెక్టర్‌ కె శశాంక వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సీపీ కమలాసన్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతి, వైద్యాధికారులతో కరోనా వైరస్‌ నియంత్రణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఇండోనేషియ నుంచి వచ్చిన మత ప్రచారకులు తిరిగిన మసీదులు, సంచరించిన ప్రాంతాలలోని నివాసితులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించాలన్నారు. వారిని ముందుగా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో పరీక్షలునిర్వహించి చల్మెడ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించాలని తెలిపారు. కరోనా లక్షణాలతో ఉన్నఅనుమానితులను హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిచాలన్నారు. అనుమానితులను హైదరాబాద్‌ తీసుకెళ్లేందుకు వాహనాను  సిద్థంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. వైద్య పరీక్షలకు తీసుకవచ్చే అనుమానితుల సెల్‌ఫోన్‌ నెంబర్లు, వారి చిరునామా రికార్డు చేయాలన్నారు. దగ్గు, జ్వరం, శ్వాస ఇబ్బందులతో బాధ పడుతున్న వారు స్వచ్చందంగా వైద్య పరీక్షలు చేయించుకునేలా అవగాహనకల్పించాలని అధికారులను ఆదేశించారు.


జిల్లాలోని 16 మండలాల్లో అధికారులు మార్చి 1వ తేదీ నుంచి జిల్లాకు వచ్చిన విదేశీ ప్రయాణీకులను గుర్తించి వారికి వైద్యపరీక్షలు నిర్వహించాలన్నారు. వైద్యాదికారులు, మున్సిపల్‌, రెవెన్యూ, పోలీసు అధికారులుసమన్వయంతో పనిచేసి కరోనా వ్యాధి ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.కరోనా అనుమానితులను పరిక్షించిన అనంతరం నెగెటివ్‌ వచ్చినయెడల వారికి హోం క్వారంటైన్‌ ముద్ర వేసి ఇంటికి పంపించాలన్నారు. వారు 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండేలా చూడాలన్నారు. కరోనా అనుమానితులకు హాస్పిటల్‌ క్వారంటైన్‌ ముద్ర వేసి పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రి, చల్మెడ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డులకు తరలించాలన్నారు. ఈ సమావేశంలో పోలీస్‌కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అజయ్‌కుమార్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుజాత, వైద్యులు ఆలీం, జ్యోతి, శ్రీధర్‌, తదితరులు పాల్గొన్నారు.


వైద్య బృందాలను తనిఖీచేసిన కలెక్టర్‌

ఇండోనేషియా నుంచి వచ్చిన మత ప్రచారకులు తిరిగిన ప్రదేశాల్లోని నివాసితుల ఇళ్లను వైద్య బృందాలు పరిశీలిస్తున్న క్రమాన్ని కలెక్టర్‌ కె శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతి వెళ్లి తనిఖీచేశారు. మంకమ్మతోట 36వ డివిజన్‌లోని గృహాల యజమానులతో కలెక్టర్‌ మాట్లాడారు. అనంతరం మంచిర్యాల చౌరస్తాలోని మసీద్‌ ఎ మహమ్మదీ మసీద్‌ వద్ద మతపెద్దలతో కలెక్టర్‌ మాట్లాడారు. ప్రార్థన సమయంలో మాస్కులు ధరించాలని గుంపుగా ఉండకుండా దూరంగా నిలబడి ప్రార్థనలు చేసుకోవాలని కోరారు. చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. 


చల్మెడ ఆస్పత్రిని పరిశీలించిన కలెక్టర్‌..

చల్మెడ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డులను కలెక్టర్‌ పరిశీలించారు. ఐసోలేషన్‌ వార్డులోని బెడ్స్‌ ఏర్పాటుచేసిన సదుపాయాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కరోనా అనుమానితులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహనకల్పించాలని వైద్యులకు సూచించారు. కరోనా అనుమానంతో వైద్యపరీక్షలకు వచ్చే వారి వివరాలను రికార్డు చేయాలని, రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. వార్డులో శుభ్రంగా ఉండేందుకు బ్లీచింగ్‌, క్లినింగ్‌ లిక్విడ్‌లు అందజేయాలని మున్సిపల్‌ కమీషనర్‌ క్రాంతికి సూచించారు. ఐసోలేషన్‌ వార్డులకు ఇతర వార్డుల వారు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. వైద్యులు, సిబ్బంది ఫిప్టుల వారీగా 24 గంటల పాటు విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఐసోలేషన్‌ వార్డులో ఉండే అనుమానితుల కోసం టీవీ, వైపై ఏర్పాటు  చేయాలని ఆసుపత్రి నిర్వాహకులను ఆదేశించారు.


విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి స్టాంపింగ్‌ చేయాలి

కరోనా వైరస్‌ ప్రభావిత దేశాలే కాకుండా ఇతర దేశాల నుంచి జిల్లాకు వచ్చిన విదేశీ ప్రయాణీకులను గుర్తించి వారికి స్టాంపింగ్‌చేయాలని కలెక్టర్‌ కె శశాంక మండల ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీం అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎస్‌హెచ్‌వోలు, ఎంపీవోలు, సర్పంచ్‌లతో కలెక్టరేట్‌ నుంచి వీడియా కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రాజీవ్‌ గాంధీ విమానాశ్రయం నుంచి జిల్లాకు 371 మంది విదేశీ ప్రయాణీకులు వచ్చారని తెలిపారు. వారిలో అత్యధికంగా గంగాధర మండలంలో 58 మంది, రామడుగులో 48 మంది, చొప్పదండిలో 39 మంది ఉన్నారన్నారు. మిగతా మండలాల్లో తక్కువ సంఖ్యలో విదేశీ ప్రయాణీకులు ఉన్నారని ఆయన తెలిపారు. వీరిని వెంటనే గుర్తించి వారి ఎడమ చేతి మణికట్టుపైన ఇండిబుల్‌ ఇంక్‌తో స్టాంపు వేయాలని రెస్పాన్స్‌ టీం అధికారులను ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చిన వారు ఇంటికే పరిమితం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. వారిపైన కమ్యూనిటీ వాచ్‌ ఉండేలా చూడాలని తెలిపారు. పోలీస్‌ అధికారులు ప్రతి రోజు పెట్రోలింగ్‌చేస్తూ తనిఖీచేయాలన్నారు. వారు బయటకు రాకుండా జియో ట్యాగింగ్‌ చేయాలన్నారు. 


ప్రభుత్వ శాఖల అధికారులు పూర్తి సమాచారంతో సిద్థంగా ఉండాలి

ప్రభుత్వ శాఖల అధికారులు పూర్తిసమాచారంతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ కె శశాంక అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రికలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అధికారులు జిల్లా సమాచారంపై అవగాహనకలిగి ఉండడంతో పాటు పైళ్లతో సిద్ధంగా ఉండాలన్నారు. కరోనా వైరస్‌ప్రభావం జిల్లాలో  తీవ్రంగా ఉన్నందున సూపర్‌మార్కెట్లు, దుకాణాదారులు, నిత్యావసర సరుకులను బ్లాక్‌చేస్తున్నారని అటువంటి వారిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. శనివారం నుంచి అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తారన్నారు. 

Updated Date - 2020-03-21T11:34:30+05:30 IST