‘మా ఆయనకు బోరింగ్‌ నీళ్లు తాగితే జలుబు చేస్తుంది. ఆమాత్రం దానికే’...

ABN , First Publish Date - 2020-03-16T22:24:36+05:30 IST

మండలంలోని సుందరగిరి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి (60) కరోనా లక్షణాలు ఉన్నాయని...

‘మా ఆయనకు బోరింగ్‌ నీళ్లు తాగితే జలుబు చేస్తుంది. ఆమాత్రం దానికే’...

సుందరగిరి గ్రామస్థుడికి కరోనా లక్షణాలు

హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలింపు

నెగెటివ్‌గా తేలడంతో డిశ్చార్జి


చిగురుమామిడి(కరీంనగర్): మండలంలోని సుందరగిరి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి (60) కరోనా లక్షణాలు ఉన్నాయని ఆదివారం ఉదయం హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సుందరిగిరికి చెందిన ఓ వ్యక్తి జీవనోపాధి కోసం మస్కట్‌ వెళ్లాడు. ఈ నెల 6న స్వగ్రామానికి వచ్చాడు. కొద్ది రోజులకు పొడి దగ్గు, జలుబుతో అనారోగ్యానికి గురయ్యాడు. స్థానిక ఏఎన్‌ఎం ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు తెలిపింది. వారు గ్రామానికి వచ్చి ఆ వ్యక్తిని పరీక్షించారు. అతనికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించి అతడిని హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు చేసి అతనికి కరోనా లక్షణాలు లేవని తేల్చారని, ప్రస్తుతం హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జి చేస్తున్నట్లు అతని కుమారుడు తెలిపాడు.


మా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేశారు

‘నేను కొన్ని సంవత్సరాలుగా జీవనోపాధి కోసం మస్కట్‌కు పోతున్నాను. కాని ఇంత పాపం ఎప్పుడు జరుగలేదు. మస్కట్‌ నుంచి వచ్చిన తర్వాత కొద్ది రోజులకు దగ్గు, జలుబు చేసింది. స్థానిక ఏఎన్‌ఎంను ఇంజక్షన్‌ వెయ్యమన్న పాపానికి నాకు కరోనా లక్షణాలు ఉన్నాయని హైదరాబాద్‌కు పంపించారు’ అని సుందరగిరికి చెందిన బాధితుడు అన్నాడు. ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో ఫోన్‌లో మాట్లాడుతూ గాంధీ ఆస్పత్రిలో అన్ని పరీక్షలు చేశారని, ఏమీలేదని డిశ్చార్జి చేశారని తెలిపారు. తాను మస్కట్‌ నుంచి ఇంటికి వచ్చేముందు అన్ని రకాల పరీక్షలు చేసి పంపారని చెప్పారు. మళ్లీ హైదరాబాద్‌ ఎయిర్‌‌పోర్టులో పరీక్షలు చేసిన తర్వాతనే బయటికి పంపించారన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత జలుబు చేసిన పాపానికి తనకు కరోనా ఉందని హడావుడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.


మా ఆయనకు బోరింగ్‌ నీళ్లు తాగితే జలుబు చేస్తుంది

‘మా ఆయనకు బోరింగ్‌ నీళ్లు తాగితే జలుబు చేస్తుంది. ఆమాత్రం దానికే ఆయనకు కరోనా వ్యాధి ఉందని తమను ఇబ్బంది పెట్టారు’ అని బాధితుడి భార్య అన్నారు. తమతో పాటు గ్రామస్థులను ఇబ్బందులకు గురి చెయ్యడం సరైంది కాదన్నారు.

Updated Date - 2020-03-16T22:24:36+05:30 IST