ఆగని కరోనా వ్యాప్తి

ABN , First Publish Date - 2020-06-18T10:31:20+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి ఆగడం లేదు. నిన్నమొన్నటి వరకు హుజురాబాద్‌లో తన ప్రతాపాన్ని చూపిస్తూ వస్తున్న కరోనా మళ్లీ కరీంనగర్‌ పట్టణంలో కలవరం

ఆగని కరోనా వ్యాప్తి

ఆందోళనలో ప్రజలు 

కరీంనగర్‌లో మరో నాలుగు కొత్త కేసులు 

ఇక్కడి లింక్‌తో సుల్తానాబాద్‌లో వ్యాధిబారిన మరో నలుగురు


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కరోనా వైరస్‌ వ్యాప్తి ఆగడం లేదు. నిన్నమొన్నటి వరకు హుజురాబాద్‌లో తన ప్రతాపాన్ని చూపిస్తూ వస్తున్న కరోనా మళ్లీ కరీంనగర్‌ పట్టణంలో కలవరం కలిగిస్తున్నది. బుధవారం పట్టణంలోని నలుగురికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ కాగా, ఇక్కడి లింక్‌తో సుల్తానాబాద్‌కు చెందిన మరో నలుగురు ఆ వ్యాధి బారిన పడ్డారు. కరీంనగర్‌ పట్టణానికి సమీపంలో బొమ్మకల్‌కు చెందిన స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ కానిస్టేబుల్‌కు ఈ నెల 9న కరోనా వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. ఆయన హైదరాబాద్‌లో డ్యూటీ నిర్వహిస్తుండగా అస్వస్థతకు గురై ఇంటికి వచ్చి నాలుగు రోజులపాటు విశ్రాంతి తీసుకున్నాడు. జ్వరం తదితర లక్షణాలతో ఆయన ఈ నెల 8న కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి రాగా కరోనా పరీక్షలు నిర్వహించారు. 9న ఆయనకు వ్యాధి నిర్ధారణ కావడంతో ఆయన కుటుంబసభ్యులు, ఆయన ఎవరెవరిని కలిశారన్న విషయాలను ఆరా తీశారు. అతని భార్య, బిడ్డ, అత్త, మామ, మరుదలు, వారి కుటుంబానికి చెందిన మరో వృద్ధురాలు అతన్ని కలిసినట్లు గుర్తించారు. వీరందరికి కరోనా పరీక్షలు నిర్వహించగా వ్యాధి సోకినట్లు బుధవారం నిర్ధారణ అయింది. అలాగే కరీంనగర్‌ పట్టణంలోని మంకమ్మతోటకు చెందిన ఒక మహిళకు, విద్యానగర్‌కు చెందిన మరో మహిళకు కూడా కరోనా వ్యాధి సోకింది. మంకమ్మతోటకు చెందిన మహిళ, బిడ్డలు ఇద్దరు హైదరాబాద్‌లో చదువుకుంటున్నారు. వారు ఇటీవలే హైదరాబాద్‌ నుంచి ఇంటికి తిరిగి వచ్చారు.


నాలుగు రోజులుగా ఈ మహిళకు జ్వరం లక్షణాలతో అస్వస్థతకు గురికాగా కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు అనుమానంతో కరోనా పరీక్షలు నిర్వహించగా వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. విద్యానగర్‌కు చెందిన మహిళ కొద్దిరోజుల క్రితం వరంగల్‌ పట్టణంలో అనారోగ్యానికి గురైన తన తండ్రిని చూసిరావడానికి వెళ్లింది. అయితే ఆ తర్వాత తండ్రికి కరోనా వ్యాధి సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనితో ఆ మహిళ కూడా కరీంనగర్‌ ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించి తన శాంపిల్స్‌ ఇవ్వగా ఆమెకు కూడా కరోనా వ్యాధి పాజిటివ్‌ వచ్చింది. ఒకేరోజు కరీంనగర్‌ ప్రపభుత్వ ఆసుపత్రి నుంచి శాంపిల్స్‌ పంపించిన వారిలో ఎనిమిది మందికి వ్యాధి నిర్ధారణ కాగా ఇటు కరీంనగర్‌లో అటు కానిస్టేబుల్‌ బంధువుల స్వగ్రామమైన సుల్తానాబాద్‌లో కలవరం మొదలైంది. కానిస్టేబుల్‌ మామ సుల్తానాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో వీఆర్‌ఏగా పనిచేస్తున్నారు.


ఆయన తన అల్లుడిని కలిసినప్పటి నుంచి విధులకు వెళ్లకుండా తన కుటుంబసభ్యులతో కలిసి హోంక్వారంటైన్‌లోనే ఉన్నారని చెబుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా వ్యాధి సోకడం సుల్తానాబాద్‌ ప్రజల్లో తీవ్రభయాందోళనకు కారణమవుతున్నది. కరీంనగర్‌ మంకమ్మతోట మహిళ కుటుంబంలో భర్త, అత్త, మామ, ఇద్దరు కూతుళ్లు, విద్యానగర్‌ మహిళ ఇంట్లో భర్త, కూతురు ఉండడంతో వారందరినీ హోంక్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు. ఈ ఇద్దరు మహిళలకు అలాగే కానిస్టేబుల్‌ భార్య, బిడ్డలకు, వారి వారి ఇళ్లలోనే ఉంచి చికిత్స అందించాలని నిర్ణయించారు. సుల్తానాబాద్‌కు చెందిన నలుగురికి మాత్రం కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలోని కోవిడ్‌ వార్డులో చికిత్స చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 48 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరు మరణించగా 22 మంది చికిత్స అనంతరం కోలుకోగా మరో 24 మంది యాక్టివ్‌ కేసులుగా చికిత్సపొందుతున్నారు. 

Updated Date - 2020-06-18T10:31:20+05:30 IST