-
-
Home » Telangana » Karimnagar » Corona Karimnagar
-
కరీంనగర్‌లో ప్రమాదఘంటికలు
ABN , First Publish Date - 2020-03-24T11:23:31+05:30 IST
కరోనా కరీంనగర్‌లో ప్రమాదకర స్థాయికి చేరుకున్నది. సెకండరీ ఇన్‌ఫెక్షన్ మొదలై ఇండోనేషియా మతప్రచారకులతో సన్నిహితంగా మెలిగిన స్థానికుడికి ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది.

స్థానికుడికి కరోనా పాజిటివ్
రెడ్‌జోన్‌గా ముకరంపుర, కాశ్మీరుగడ్డ
జిల్లాలో ప్రారంభమైన సెకండరీ ఇన్‌ఫెక్షన్
ఇండోనేషియన్లు తిరిగిన ప్రాంతం చుట్టూ పోలీసుల బారికేడింగ్
ప్రజలు ఎవరూ బయటకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు
రేషన్, పాలు, తాగునీరందిస్తామన్న అధికారులు
మతప్రచారకులతో తిరిగిన వారికి ఐసోలేషన్‌కు వెళ్ళాలని సూచన
మరో నలుగురు అనుమానితులకు క్వారంటైన్
పరిస్థితిని ఫోన్‌లో సమీక్షించిన సీఎం కేసీఆర్...
అవసరమైతే కఠినంగా వ్యవహరించాలని ఆదేశం
కరీంనగర్, మార్చి 24 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): కరోనా కరీంనగర్‌లో ప్రమాదకర స్థాయికి చేరుకున్నది. సెకండరీ ఇన్‌ఫెక్షన్ మొదలై ఇండోనేషియా మతప్రచారకులతో సన్నిహితంగా మెలిగిన స్థానికుడికి ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. అతడిని హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి పంపించారు. దీంతో జిల్లావ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్‌లో నెలకొన్న పరిస్థితులపై కలెక్టర్ శశాంక, పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి సమీక్షించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి, ప్రజలందరి ఆరోగ్యాలను పరిరక్షించడానికి వీలుగా అవసరమైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
మత ప్రచారకులతో సన్నిహితంగా మెదిలిన వారి గుర్తింపు
సోమవారం కొత్తగా మరో నలుగురు కరోనా లక్షణాలతో అధికారులను సంప్రదించడంతో హాస్పిటల్ ఐసోలేషన్ వార్డుకు పంపించారు. ఇండోనేషియా మతప్రచారకులతో సన్నిహితంగా మెదిలిన 72 మందిని జిల్లా అధికార యంత్రాంగం గుర్తించింది. ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండే అవకాశమున్నదని అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కరోనా సెకండరీ ఇన్‌ఫెక్షన్ మొదలై స్థానికుడు ఒకరికి పాజిటివ్ రిపోర్టు రావడంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం మతప్రచారకుడు బస చేసిన, తిరిగిన ప్రాంతాన్ని ప్రమాదకరంగా గుర్తించి బారికేడింగ్ చేసింది. ఈ ప్రాంతం నుంచి ఏ ఒక్క మనిషిని కూడా బయటకు రాకుండా, అక్కడికి ఎవరూ వెళ్లకుండా కట్టుదిట్టం చేసి పోలీసు పహారా ఏర్పాటు చేశారు.
ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారందరికి అవసరమైన రేషన్, కూరగాయలు, పాలు అందిస్తామని ప్రకటించారు. ఆస్పత్రి అవసరాలున్నా అధికార యంత్రాంగాన్ని సంప్రదించాలని సూచించారు. ఆ ప్రాంతంలో కలెక్టర్ శశాంక, పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి, ఇతర అధికారులు పర్యటించి అక్కడ నివసించే వారితో మాట్లాడారు. కరోనా వ్యాధి తీవ్రతను, దానివల్ల కలిగే దుష్పలితాలను వివరించి తమ ప్రాణాలతోపాటు తమ కుటుంబసభ్యుల ప్రాణాలను ప్రజల ప్రాఫణాలను కాపాడేందుకు వీలుగా మతప్రచారకులతో కలిసి తిరిగిన వారు ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా వెల్లడించాలని కోరారు. చల్మెడ వైద్య కళాశాల ఆసుపత్రిలో అన్ని వసతులు ఉన్న ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశామని, ఇండోనేషియన్లతో కలిసి తిరిగిన వారు ప్రార్థనా స్థలంలో సన్నిహితంగా మెలిగిన వారు స్వచ్ఛందంగా ఆసుపత్రికి వెళ్లి వైద్య సేవలు పొందాలని కోరారు. ఇండోనేషియన్లతో సన్నిహితంగా ఉన్న వారిని 72 మందిని గుర్తించారు.
వీరిలో సగం మంది ఇప్పటికే ఆస్పత్రి క్వారంటైన్‌లో ఉండగా మిగతావారు తాము ఆరోగ్యంగానే ఉన్నామని ఇంట్లోనే ఉంటామని చెప్పడంతో ఆప్రాంతం నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా ఏర్పాట్లు చేశారు. ఇండోనేషియా నుంచి వచ్చిన మతప్రచారకులతో సన్నిహితంగా సంచరించిన వారు కచ్చితంగా కరీంనగర్ ప్రభుత్వ ప్రాదాన ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కోవిడ్ రిసప్షన్ సెంటర్‌కు వచ్చి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈనెల 31వ తేదీ వరకు ప్రజలందరూ అత్యవసరమైతే తప్ప ఇళ్లకే పరిమితం కకావాలని కలెక్టర్ కోరారు.
విదేశాల నుంచి వచ్చిన వారికి స్టాంపింగ్
మార్చి 1 తర్వాత విదేశీ ప్రయాణం చేసి వచ్చిన వారిని గుర్తించి స్టాంపింగ్ చేశారు. కరోనా వైరస్ ప్రభావిత దేశాలే కాకుండా ఇతర దేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారిని గుర్తించి స్టాంపింగ్ చేయాలని మండలస్థాయిలో ఏర్పాటు చేసిన ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను కలెక్టర్ శశాంక ఆదేశించారు. వివిధ దేశాల నుంచి రాజీవ్‌గాంధీ విమానాశ్రయం నుంచి జిల్లాకు 371 మంది విదేశీ ప్రయాణికులు వచ్చారు. వీరిలో గంగాధర మండలంలో 58 మంది, రామడుగులో 48 మంది, చొప్పదండిలో 39 మంది ఉన్నారు. ఇప్పటికే వీరిలో పలువురికి ఎడమ చేతి మణికట్టుపైన ఇండిబుల్ ఇంక్‌తో స్టాంపులు వేశారు. విదేశాల నుంచి వచ్చిన వారు ఇళ్ల నుంచి బయటకు రాకుండా జియో ట్యాగింగ్ కూడా చేయాలని ఆదేశించారు.
ఈనెల 31 వరకు జరుగనున్న అన్ని వివాహాల్లో 100 మందికి మించకుండా ఆహ్వానితులు పాల్గొనేలా చూడాలని ఆదేశించారు. మందిరాలు, మసీదులు, చర్చిల్లో ప్రజలు గుమిగూడకుండా చూడాలని సాధ్యమైనంత వరకు వాటిని మూసేసే ప్రయత్నం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఉగాది, శ్రీరామనవమి పండుగలను ప్రజలు నిరాడంబరంగా ఇళ్లలోనే జరుపుకోవాలని కోరారు. వారిని 28 రోజులపాటు ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించారు. వారిపై ఆయా గ్రామ ప్రజలతో కమ్యూనిటీ వాచ్ ఏర్పాటు చేశారు. 31వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించినందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. మంగళవారం ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి ప్రజలను చేరవేస్తున్న 210 ఆటోలు, ఇతర వాహనాలను సీజ్ చేశారు. బైక్‌లపై సంచరిస్తున్న వారిని అడ్డుకొని 156 బైక్‌లను కూడా సీజ్ చేశారు. పలు ప్రాంతాల్లో గుంపులుగుంపులుగా ప్రజలు బజార్లకు రావడంతో పోలీసులు వెళ్ళి వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇళ్లకు పంపించారు. షాపులవద్ద ముగ్గురు, నలుగురు గుమిగూడిన సందర్భాల్లో అలాంటి షాపులను మూసివేయించారు.
రెండో రోజు ఇళ్లకే పరిమితమైన జనం...
రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతో సోమవారం ప్రజలు రెండో రోజూ ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్‌డౌన్ నుంచి నిత్యావసర వస్తువులు, పాలు, కూరగాయలు, మెడికల్ షాపులను, పెట్రోల్ బంక్‌లను మినహాయించడంతో అవి తప్ప మిగిలిన వ్యాపార సంస్థలను మూసివేశారు. ఆదివారం జనతా కర్ఫ్యూతో ఇళ్ళకే పరిమితమైన జనం ఈనెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్ ప్రకటించడంతో సోమవారం ఉదయం చాలా మంది ఇళ్ల నుంచి బయటకు వచ్చి నిత్యావసరవస్తువులు, కూరగాయలు కొనేందుకు దుకాణాల ముందు బారులు తీరారు. నిత్యావసర వస్తువుల, కూరగాయలను అధిక ధరలకు విక్రయించుకుండా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటికి రైతు బజార్లలోగానీ, మార్కెట్లలోగానీ అధికారులు ధరలు నిర్ణయించక పోవడంతో వ్యాపారులు ధరలను రెట్టింపు చేసి ఇష్టారాజ్యంగా విక్రయించారు. కొంత మంది నిత్యావసర వస్తువుల ధరలను కూడా పెంచి విక్రయించారని, వీటిని నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం :
హెల్త్ ఎమర్జెన్సీ దృష్ట్యా మల్టీ ఏజెన్సీల కంట్రోల్‌రూం, కలెక్టరేట్, ఫస్ట్‌ఫ్లోర్, కరీంనగర్ ల్యాండ్ లైన్ నంబర్ 0878 - 2234732 ఏర్పాటు చేశారు. ఈ కింది కారణాల గురించి ప్రజలు ఈ నెంబరుకు కాల్‌చేయవచ్చు.
అనుమానాస్పదమైన కరోనా కేసులకు సంబంధించిన ఫిర్యాదులు
లాక్‌డౌన్ ఉల్లంఘన
అవసరమైన వస్తువుల కొరత
అవసరమైన వస్తువుల ధరల పెరుగుదల గురించి ఫిర్యాదులు
లా అండ్ ఆర్డర్ సమస్యలకు సంబంధించినఫిర్యాదులు
వైద్య, అత ్యవసర పరిస్థితుల గురించి ఫిర్యాదులు
మందుల కొరత గురించి ఫిర్యాదులు