మరో ఇద్దరికి కరోనా

ABN , First Publish Date - 2020-06-22T10:44:00+05:30 IST

జిల్లాలో మరో ఇద్దరికి కరోనా వ్యాధి సోకింది. జమ్మికుంట మున్సిపల్‌ పరిధిలోని రామన్నపల్లికి చెందిన కూరగాయల వ్యాపారికి వ్యాధి నిర్ధారణ అయింది.

మరో ఇద్దరికి కరోనా

ఒకరి మృతి..జిల్లాలో ఇప్పటి వరకు 62 కేసులు


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

జిల్లాలో మరో ఇద్దరికి కరోనా వ్యాధి సోకింది. జమ్మికుంట మున్సిపల్‌ పరిధిలోని రామన్నపల్లికి చెందిన కూరగాయల వ్యాపారికి వ్యాధి నిర్ధారణ అయింది. 10 రోజుల క్రితం అతడికి శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో స్థానిక ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యుల సూచన మేరకు నాలుగు రోజుల క్రితం వరంగల్‌ ఎంజీఎంలో చేరాడు. అక్కడ డాక్టర్లు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ రిపోర్టు వచ్చింది. శ్వాసలో ఇబ్బందులు తొలగకపోవడంతో అతని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఈలోగా మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహించగా శనివారం అతనికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. ఆదివారం తెల్లవారుజామున అతను మృతిచెందాడు. ఇతనికి ఈ వ్యాధి ఎలా సోకిందన్న విషయమై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. కొద్దిరోజుల క్రితం సమీపబంధువు ఒకరు వీరి ఇంటికి వచ్చి వెళ్లారని తెలిసింది. అతను కూరగాయల వ్యాపారంలో భాగంగా ఎక్కడెక్కడ తిరిగాడనే కోణంలో కూడా అధికారులు విచారిస్తున్నారు.


కరీంనగర్‌లోని కశ్మీరుగడ్డకు చెందిన ఓ మహిళ ఈనెల 16న ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. అక్కడ ఆమెకు శ్వాస సమస్య ఏర్పడగా హైదరాబాద్‌కు పంపించారు. హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఆమెకు ఎలా వ్యాధి సోకిందనే విషయం తేల్చుకోలేక పోతున్నారు. మూడు నెలలుగా వారు ఎక్కడికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉన్నారని సమాచారం. జిల్లాలో మార్చి 17న తొలి కరోనా కేసు నమోదు కాగా ఇప్పటి వరకు 62 మంది వ్యాధి బారిన పడ్డారు. వారిలో 30 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు. ముగ్గురు మృతిచెందారు. మృతి చెందిన ముగ్గురూ హుజురాబాద్‌ డివిజన్‌కు చెందిన వారే. మరో 29 మంది చికిత్స పొందుతనాఆ్నరు. వీరిలో 20 మందిని ఇళ్ళ వద్దనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆరుగురు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఇద్దరు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో, ఒకరు ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 


నేటి నుంచి మధ్యాహ్నం రెండు వరకే దుకాణాలు

కరీంనగర్‌ టౌన్‌: జిల్లాలో కరోనా విజృంభిస్తుండడంతో వ్యాపార సంస్థల అసోసియేషన్లు, సంఘాలు స్వచ్చందంగానే దుకాణాలను మూసివేసేందుకు ముందుకు వస్తున్నాయి. జిల్లా కిరాణా మర్చంట్స్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు కరీంనగర్‌తోపాటు ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు పట్టణాల్లో కిరాణ దుకాణాలను సోమవారం నుండి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని వ్యాపారులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. టవర్‌సర్కిల్‌ పరిధిలోని వాసవీ స్ర్టీట్‌ మెటీరియల్స్‌ అండ్‌ సారీస్‌ షాప్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆదివారం సమావేశమై సోమవారం నుంచి ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే దుకాణాలను తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకుంది. 

Updated Date - 2020-06-22T10:44:00+05:30 IST