కార్యాలయాల వద్ద కట్టడి

ABN , First Publish Date - 2020-07-19T06:39:08+05:30 IST

కరోనా భయం అన్ని వర్గాలను వెంటాడుతోంది. ఎప్పుడు సోకుతుందో?..

కార్యాలయాల వద్ద కట్టడి

  • ఉద్యోగులను వెంటాడుతున్న కరోనా భయం
  • అత్యవసరమైతేనే సందర్శకులకు అనుమతి 
  • కార్యాలయాల ఎదుట బాక్సుల ఏర్పాటు 
  • ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచనలు 
  • జిల్లాలో 189కి పెరిగిన కొవిడ్‌ కేసులు 


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల): కరోనా భయం అన్ని వర్గాలను వెంటాడుతోంది. ఎప్పుడు సోకుతుందో? ఎలాంటి ప్రమాదం తలెత్తుతుందోననే ఆందోళన అధికమవుతోంది. రోజురోజుకు పెరుగుతున్న మహమ్మారి ఉధృతితో బిక్కుబిక్కమంటూ గడపాల్సిన పరిస్థితి నెలకొంటోంది. వలసకార్మికులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారిలో ఎక్కువగా కనిపించిన వైరస్‌ ప్రభుత్వ ఉద్యోగులను కలవరపెడుతోంది. కరోనా ఎఫెక్ట్‌తో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల వద్ద కట్టడి పెంచారు.  సర్కారు నుంచి ప్రజలకు కావాల్సిన పనులు కష్టంగా మారాయి. కార్యాలయాల వద్ద దరఖాస్తుదారులతో ఉద్యోగులు మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. కలెక్టరేట్‌ నుంచి మొదలుకుంటే కింది స్థాయి కార్యాలయాల వరకు కట్టడి  పెంచారు.  మొదట్లో చేతులు శుభ్ర చేసుకునేందుకు కార్యాలయాల వద్ద  శానిటైజర్లు ఏర్పాటు చేశారు. అనంతరం పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో కొద్ది మందికి మాత్రమే అనుమతులు ఇచ్చారు. ప్రస్తుతం మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తుండడంతో అత్యవసరం అనుకుంటే తప్ప అధికారిని కలిసే వీలు కల్పించడం లేదు. కార్యాలయాల లోపలికి అనుమతించకుండానే దరఖాస్తులను బాక్సుల్లో వేసే ఏర్పాటు చేశారు. వీలైనంత వరకు కార్యాలయాలకు రావద్దని ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఉద్యోగులు సైతం మండలాల నుంచి ఈమెయిల్‌, వాట్సప్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కార్యాలయా ప్రధాన గేటు నుంచి లోపలికి వెళ్లేవరకు అడుగడుగునా  నిబంధనలు ఎదరవుతుండడంతో దరఖాస్తు దారులు కూడా రావడానికి ఇబ్బంది పడుతున్నారు. 


ఆందోళనలో దరఖాస్తుదారులు 

‘ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా పనులు సకాలంలో కావు’అనేది ప్రజల్లో ఉన్న భావన. దీనికి తోడు కరోనా ఎఫెక్ట్‌తో కార్యాలయాల్లోకి అనుమతించడం లేదు.  పల్లెల్లో ఉన్న భూ తగాదాలు, రేషన్‌కార్డులు, పింఛన్‌ దారులు, పట్టాదారు పుస్తకాలు, వివిధ సర్టిఫికెట్ల కోసం కార్యాలయాలకు వెళ్తున్నా పనులు కాకపోవడంతో వెనుదిరుగుతున్నారు. కనీసం ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి  నెలకొంది.  


జిల్లాలో 189 పాజిటివ్‌ కేసులు... 

జిల్లాలో కరోనా వ్యాప్తి పెరుగు తోంది. శనివారం జిల్లాలో  3 కేసులు నమోదయ్యాయి. సిరిసిల్ల పట్టణంలో అశోక్‌నగర్‌లో ఒకరు, కోనరావుపేటలో ఒకరు, వేములవాడ మండలం రుద్ర వరంలో ఒకరు కొవిడ్‌ బారిన పడ్డారు. జిల్లాలో ఇప్పటి వరకు 189 మంది కరోనా కేసులు నమోదయ్యాయి.ఇందులో 154  యాక్టివ్‌గా ఉన్నాయి. 30 మంది డిశ్చార్జి అయ్యారు. ఐదుగురు మృతి చెందారు.

Updated Date - 2020-07-19T06:39:08+05:30 IST