-
-
Home » Telangana » Karimnagar » CORONA EFFECT ON ANJANA JAYANTI PROGRAM
-
అంజన్న జయంత్యుత్సవాలకు కరోనా ఎఫెక్ట్
ABN , First Publish Date - 2020-03-23T10:00:37+05:30 IST
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో ఏప్రిల్ 6 నుంచి 8 వరకు మూడు రోజుల పాటు నిర్వహించే చిన్న హనుమాన్ జయంత్యుత్సవాలపై...

- ఈ నెలాఖరు వరకు దర్శనాల నిలిపివేత
- చిన్న జయంతి వేడుకలపైనా ప్రభావం
- గతంలోని వేడుకలకు లక్షలాదిగా దీక్షాపరుల రాక
- పూజలతోనే సరిపెట్టాలంటున్న భక్తులు
మల్యాల, మార్చి 22: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో ఏప్రిల్ 6 నుంచి 8 వరకు మూడు రోజుల పాటు నిర్వహించే చిన్న హనుమాన్ జయంత్యుత్సవాలపై కరోనా ప్రభావం పడనుంది. ప్రతి ఏటా చైత్రపౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించే ఈ జయంత్యుత్సవాలకు మన రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి దాదాపు మూడు లక్షలకు పైగా దీక్షాపరులు, భక్తులు తరలివస్తుంటారు. దీనికి జయంత్యుత్సవాలకు 41 రోజలు ముందు నుంచే 41, 21, 11 రోజుల దీక్షలను భక్తులు చేపట్టి జయంతి సందర్భంగా విరమణ చేయడం ఆనవాయితీ. అయితే ఇటీవల కరోనా వైరస్ మహ మ్మరీ విజృభింస్తుండడంతో దీక్షల స్వీకరణ అంతంతమాత్రమే కాగ జయంత్యుత్సవాలపై కరోనా ఎఫెక్ట్ స్పష్టంగా ఏర్పడింది.
దీంతో గత శుక్రవారం నుంచి ఆలయ దర్శనాలను నిలిపివేశారు. దర్శనాల నిలిపివేతతో భక్తులు కొండగట్టుకు రావడం లేదు. జయంత్యుత్సవాలకు పది రోజుల ముందు నుంచే కొండకు భక్తుల తాకిడి నెలకొంటుండగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జనాలు గుంపులుగా ఉండకూడదని, వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలని ప్రభుత్వం సూచనలు జారీ చేస్తుండగా భక్తులు ఇక వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కొండగట్టు జయంత్యుత్సవాలకు వచ్చే భక్తులు అంతా సమూహాలుగానే వస్తూంటారు. ఇప్పుడు అలా వచ్చే పరిస్థితి లేదు. సామాజిక సహకారంతో కరోనా వైరస్‌ను నియంత్రించాల్సి ఉండడంతో జయంత్యుత్సవాల నిర్వహణపై అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆలయంలో భక్తుల దర్శనాలను ఈ నెల 31 వరకు నిలిపివేయాలని ప్రభుత్వం ఇది వరకే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కరోనా వైరస్ రెండవ దశకు చేరిన దృష్ట్యా అప్రమత్తత చర్యలు తీసుకున్నారు. తీవ్రతను బట్టి ప్రభుత్వ ఆదేశాలకు అనుగునంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గత శుక్రవారం కలెక్టర్‌తో జరిగిన సమావేశంలోనూ ఆలయ అధికారులు, అర్చకులు జయంత్యుత్సవాలపై ప్రస్తావించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అంజన్న కొండకు భక్తుల తాకిడి లేకపోవడంతో దేవస్థానం వెలవెలబోతుండగా ప్రస్తుత తరుణంలో పూజల నిర్వహణతోనే సరిపెట్టాలని పలువురు కోరుతున్నారు. జయంత్యుత్సవాలకు ఇంకా 10రోజులకు పైగా సమయం ఉన్నప్పటికీ భక్తులు అటు తర్వాత కూడా కరోనా భయాందోళనతో రాకపోవచ్చునని అభిప్రాయపడుతున్నారు. దీని ప్రభావం మే 17న జరిగే పెద్ద హనుమాన్ జయంత్యుత్సవాలపై కూడా పడే అవకాశాలు లేకపోలేవని పేర్కొంటున్నారు.