మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-12-15T05:46:59+05:30 IST
వివాహాది శుభకార్యాల కారణంగా కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. ఒక వైపు చలితీవ్రత పెరగడంతోపాటు మరోవైపు కనీస జాగ్రత్తలు పాటించకుండా పెళ్లిళ్లు, శుభకార్యాల్లో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొంటుండడంతో కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్నది.
ఒకరి మృతి, 72 మందికి పాజిటివ్
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
వివాహాది శుభకార్యాల కారణంగా కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. ఒక వైపు చలితీవ్రత పెరగడంతోపాటు మరోవైపు కనీస జాగ్రత్తలు పాటించకుండా పెళ్లిళ్లు, శుభకార్యాల్లో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొంటుండడంతో కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్నది. నిన్న, మొన్నటి వరకు జిల్లాలోని 16మండలాల్లో సగానికిపైగా మండలాల్లో కేసులేవీ నమోదుకాకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం కరీంనగర్ పట్టణంతోపాటు మరో ఆరు మండలాల్లో మాత్రమే కరోనా పాజిటివ్‌కేసులు నమోదుకాగా సోమవారం 11మండలాల్లో పలువురికి వ్యాధి నిర్ధారణ అయింది. జిల్లాలోని ఒద్యారం గ్రామానికి చెందిన 68సంవత్సరాల వృద్ధుడు హైదరాబాద్‌లోని గాంధీఆస్పత్రిలో కరోనా చికిత్స పొం దుతూ మరణించారు. అలాగే 72మందికి కరోనా వ్యాధి సోకినట్లు నిర్ధారణ కాగా అందులో 32మంది కరీంనగర్ పట్టణంలోనే ఉన్నారు. 10మం డలాల్లో 40మందికి వ్యాధి సోకిందని సమాచారం. ఇల్లందకుంట మండలంలో అత్యధికంగా 12మందికి కరోనా వ్యాధి సోకింది. ఈ మండలంలో కొద్ది రోజులుగా ఒకరిద్దరికి మినహా పాజిటివ్ రావడం లేదు. అలాంటి మండలంలో ఒకేసారి 12మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ కావడంతో మండల ప్రజలు ఉలిక్కిపడ్డారు. చొప్పదండి మండలంలోని పెద్దకుర్మపల్లి గ్రామంలో ప్రత్యేక క్యాంపు నిర్వహించి కరోనా పరీక్షలు చేశారు. ఈ మండలంలో 157 మందికి పరీక్షలు నిర్వహించగా 9మందికి వ్యాధి నిర్ధారణ అయింది. హుజురాబాద్‌లో ఐదుగురికి, గంగాధర మండలంలో నలుగురికి, వీణవంక, రామడుగు మండలాల్లో ముగ్గురేసి చొప్పున వ్యాధి సోకింది. కొత్తపల్లి, చిగురుమామిడి, మానకొండూర్, సైదాపూర్ మండలాల్లో ఒక్కొక్కరికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. జిల్లాలోని తిమ్మాపూర్, గన్నేరువరం, కరీంనగర్ రూరల్, శంకరపట్నం, జమ్మికుంట మండలాల్లో కరోనా కేసులు నమోదు కాలేదు. ఒకవైపు వ్యాధి విజృంభణ పెరుగుతూ ఉంటే మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం ఈ నెల 25 నుంచి వ్యాధి నిరోధక టీకా ఇచ్చేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నది. దేశవ్యాప్తంగా ఈ నెలలోనే వ్యాధి నిరోధక టీకా ఇవ్వడానికి శ్రీకారం చుడతారని ప్రధాని ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లను చేస్తున్నది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలల్లో ఉన్న డాక్టర్లు, సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60సంవత్సరాలు దాటిన వృద్ధులు, 50సంవత్సరాలపైబడి ఉండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి వివరాలను సేకరించి నమోదు చేశారు. ఇంకా అదనంగా ఎవరైనా ఉంటే ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చే కేంద్రాలను గుర్తించే పనిని చేపడుతున్నారు. అలాగే సోమవారం టీకా ఇచ్చే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర చర్యలపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.