కరోనాతో గజగజ
ABN , First Publish Date - 2020-07-08T10:25:24+05:30 IST
జిల్లా ప్రజలను కరోనా వైరస్ గజగజ వణికిస్తోన్నది. వారం రోజులుగా జిల్లాలో కేసుల ఉధృతి రోజురోజుకు పెరుగుతున్నది.

జిల్లాలో మరో 9 మందికి పాజిటివ్
ఇందులో ఇద్దరు అధికారులకు సోకిన వైరస్
అధికార, ఉద్యోగ వర్గాల్లో కలవరం
జిల్లాలో 70కి చేరిన కేసుల సంఖ్య
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి): జిల్లా ప్రజలను కరోనా వైరస్ గజగజ వణికిస్తోన్నది. వారం రోజులుగా జిల్లాలో కేసుల ఉధృతి రోజురోజుకు పెరుగుతున్నది. సోమవారం ఒక్కరోజే 11 మందికి కరోనా రాగా, మంగళవారం మరో 9 మందికి కరోనా వైరస్ సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. ఇందులో రెవెన్యూ శాఖకు చెందిన ఒక అధికారి, ఒక పోలీస్ శాఖాధికారికి కూడా వైరస్ సోకడంతో ఆయా శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. అలాగే సదరు అధికారులు ఉన్నత స్థాయి సమావేశాలకు కూడా హాజరుకావడంతో జిల్లా అధికార వర్గాలు కొంతమేరకు కలవరానికి గురవుతున్నారు.
ప్రతిరోజు కలెక్టరేట్లో కలెక్టర్ మంగళవారం ఎలాంటి సమీక్షా సమావేశాలు నిర్వహించకపోవడం గమనార్హం. సదరు అధికారులు తమ విధుల రీత్యా ఎక్కడెక్కడికి వెళ్లారు, ఏయే సమావేశాల్లో పాల్గొన్నారు. రోజుకు ఎంత మందికి కలిశారు, తమ కుటుంబ సభ్యులను కలిశారా, తమ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది కలిశారా తదితర అంశాలపై వైద్య, ఆరోగ్య శాఖాధికారులు ఆరా తీస్తున్నారు. సదరు అధికారులను హైదరాబాద్‌కు తరలించారు.
అలాగే పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి, గోదావరిఖని పట్టణానికి చెందిన ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. వారి కాంటాక్టులను కొందరిని హోం ఐసోలేషన్‌కు తరలించగా, మరికొందరిని హోం క్వారంటైన్ చేశారు. వారికి పరీక్షలు నిర్వహించేందుకు స్వాబ్ నమూనాలను సేకరిస్తున్నారు. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 70కి చేరుకున్నది. ఇందులో ఆరుగురు మరణించగా, 11 మంది ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు.
14 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 39మందిని ఇంటివద్దనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు లేనివారికి కూడా కరోనా సోకుతున్నదని అధికారులు తెలుపుతున్నారు. అలాంటి వారికి ఇంటికే పరిమితం చేసి వైద్యం అందిస్తున్నారు. ఊపిరి పీల్చుకోవడం ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని హైదరాబాద్, కరీంనగర్ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. కొందరు హైదరాబాద్‌కు వెళ్లి ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారు.
సామాజిక వ్యాప్తి ద్వారా వైరస్..
ఒక వ్యక్తికి వైరస్ సోకితే, అతడి ద్వారా పలువురికి వైరస్ సోకుతుండగా, కొందరికైతే ఎవరి ద్వారా వైరస్ సోకిందనే విషయం తెలియకుండాపోతున్నది. వైరస్ సామాజిక వ్యాప్తి చెందుతున్న కారణంగానే జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడం, శానిటైజర్లు వాడకపోవడం, బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడం, పొగాకు ఉత్పత్తులు, గుట్కాలు తిని ఉమ్మి వేయడం వల్ల కూడా వైరస్ వ్యాప్తిచెందుతున్నది. షాపుల వద్ద, మార్కెట్ల వద్ద జనాలు భౌతికదూరం పాటించడం లేదు.
దూరం పాటించే విధంగా ఆయా షాపుల యజమానులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. షాపుల ముందు బాక్సులను వేయడం లేదు. బ్యాంకుల వద్ద కూడా రైతులు, మహిళలు, వృద్ధులు గుమిగూడుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రజలు భౌతికదూరం పాటించే విధంగా అప్రమత్తం చేయడంలేదు. వైరస్ సోకుతుందని తెలిసి కూడా ప్రజలు షాపుల వద్ద గుమిగూడుతూనే ఉన్నారు. ఒకరు తర్వాత ఒకరు తమకు కావాల్సిన సరుకులను తీసుకోవడం లేదు. వేచి చూసే ధోరణిని కనబర్చడం లేదు.
జిల్లాలో 50 పడకలతో ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు..
జిల్లాలో ప్రస్తుతానికి సుల్తానాబాద్ టీబీ ఆసుపత్రిలో మాత్రమే 40 పడకల ఐసోలేషన్ కేంద్రం ఉండగా, అదనంగా మరో 50 పడకలను ఏర్పాటుచేశారు. పెద్దపల్లి ప్రధానాసుపత్రిలో 20 పడకలు, గోదావరిఖని ఏరియా ఆసుపత్రిలో 30 పడకలను సిద్ధం చేశారు. పెద్దపల్లి ఆసుపత్రికి ఇన్‌చార్జీగా డాక్టర్ వాసుదేవారెడ్డి 9949016111, గోదావరిఖని ఏరియా ఆస్పత్రికి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి 98491 26140 బాధ్యులుగా అందుబాటులో ఉంటారు. కరోనా వ్యాధిపై అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు, పెద్దపల్లి నియోజకవర్గానికి డాక్టర్ ఫణింద్ర 99631 36002, రామగుండం నియోజకవర్గానికి డాక్టర్ కృపాబాయి 98866 76563, మంథని నియోజకవర్గానికి డాక్టర్ శంకరాదేవి 91603 05534, ధర్మపురి నియోజకవర్గానికి డాక్టర్ సంపత్‌రెడ్డి 9573598024 అందుబాటులో ఉంటారు.
వీరేగాకుండా డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రమోద్‌కుమార్ 98490 22772, డీఎంఓ డాక్టర్ శ్రీరాం 9849017852 సేవలందించనున్నారు. ఇందులో ఎవరికి కాల్ చేసినా సమస్యను పరిష్కరిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటుచేసిన ఐసోలేషన్ కేంద్రాలు మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. కరోనా కేసులు రోజురోజుకు మరిన్ని పెరగనున్నాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రదీప్‌కుమార్ ప్రజలను కోరారు.