పెండింగ్‌ పనులను త్వరగాపూర్తిచేయాలి

ABN , First Publish Date - 2020-12-20T04:38:51+05:30 IST

అన్నిశాఖలకు సంబంధించిన పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కె శశాంక అన్నారు.

పెండింగ్‌ పనులను త్వరగాపూర్తిచేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కె శశాంక

కలెక్టర్‌ కె శశాంక

కరీంనగర్‌, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అన్నిశాఖలకు సంబంధించిన పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కె శశాంక అన్నారు. శనివారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో అన్ని శాఖల ఇంజనీరింగ్‌ అధికారులతో కన్వర్‌జెన్సీ సమావేశం నిర్వహించారు. అన్నిశాఖలకు సంబంధించిన ఇంజనీరింగ్‌ పనులు, ఏమైనా పెండింగ్‌లో ఉన్న పనులు, వాటి ప్రగతిపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతినెల సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. శాఖల వారీగా ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పూర్తి చేయాలని అన్నారు. పీఆర్‌, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌, పబ్లిక్‌ హెల్త్‌, ఇరిగేషన్‌, కల్వర్టు, బ్రిడ్జి, కెనాల్స్‌, డ్రింకింగ్‌వాటర్‌, మిషన్‌ భగీరథ పనుల్లో ఎలాంటి పెండింగ్‌ లేకుండా పనులను తొందరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

భూసేకరణను త్వరగా పూర్తి చేయాలి..

ఎన్‌హెచ్‌ 563 భూసేకరణను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఎన్‌హెచ్‌563 భూసేకరణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గట్టుదుద్దెనపల్లి, మానకొండూర్‌ గ్రామాల సర్వేపనులను త్వరగా పూర్తిచేసి ఎస్‌డీఆర్‌ను తయారుచేయాలనికోరారు. సర్వే పూర్తైన గ్రామాలకు సేల్స్‌వాల్యూ తీసుకోవాలని, భూసేకరణలో కోల్పోతున్న వెల్స్‌, పైపులైన్స్‌, చెట్లు ఏమైనా ఉంటే సంబంధిత అధికారులకు ఎస్టిమేషన్‌ కొరకు పంపించాలని సూచించారు. అధికారులు సమన్వయంతో భూసేకరణ పనులనుత్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. అదనపుకలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, మున్సిపల్‌కమిషనర్‌క్రాంతి పాల్గొన్నారు.

అన్నివిభాగాల వైద్యసేవలు పునరుద్ధరించాలి..

సుభాష్‌నగర్‌: జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని అన్ని విభాగాల వైద్యసేవలను పునరుద్ధరించాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. శనివారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి, ప్రోగ్రాం అధికారులు, ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్‌, పల్మనాలజి, జనరల్‌, పిల్లలు, డెంటల్‌, ఆర్థో, చెవి, ముక్కు, గొంతు, అనస్థీషియా, చర్మ సంబంధ, తదితర అన్ని విభాగాల ప్రధాన వైద్యాధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించి పలుఆదేశాలు జారీచేశారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కొరకు ఎంతమంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ను గుర్తించింది, ఎంతమంది పారామెడికల్‌ సిబ్బందికి ట్రైనింగ్‌ ఇచ్చింది తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ముఖ్యంగా సాధారణ కాన్పులను పెంచవలసిందిగా ఆదేశించారు. ఇందుకుగాను వైద్యాధికారులు ప్రణాళికలు తయారు చేసుకోవాలని అన్నారు. కొవిడ్‌ వ్యాధి తీవ్రత తగ్గుతున్న దృష్ట్యా జిల్లా ప్రధాన ఆస్పత్రిలో అన్ని విభాగాల్లో ఓపీ సంఖ్యను, అన్నిరకాల సర్జరీల సంఖ్యను పెంచి సాధారణ పరిస్థితి కొనసాగేలా చూడాలని ఆదేశించారు. అర్హులైన, ఇద్దరు పిల్లలు కలిగిన దంపతులను గుర్తించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయుటకు క్యాంపులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ జి సుజాత, జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రత్నమాల, గైనకాలజిస్టు డాక్టర్‌ మంజుల, జిల్లా ప్రధాన ఆసుపత్రిలోని అన్నివిభాగాల వైద్యాధికారులు పాల్గొన్నారు.

Read more