ఆరో విడత హరితహారం పనులు వేగంగా పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2020-06-25T10:28:43+05:30 IST

జిల్లాలో ఆరో విడత హరితహారం పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కె శశాంక అన్నారు

ఆరో విడత హరితహారం పనులు వేగంగా పూర్తిచేయాలి

కలెక్టర్‌ కె శశాంక


కరీంనగర్‌, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ఆరో విడత హరితహారం పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కె శశాంక అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో కరీంనగర్‌, జమ్మికుంట, హుజురాబాద్‌, కొత్తపల్లి కమిషనర్లతో హరితహారం కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆరో విడత హరితహారం గురువారం నుంచి మొదలవుతు న్నందున ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి ఆరు మొక్కలను, పండ్లు, పూలు, కృష్ణతులసి మొక్కలు అందేలా చూడాలని సూచించారు. పెద్ద మొక్కలను కొనుగోలు చేసి ప్రతి మండలంలో మంకీ ఫుడ్‌ కోర్టు, మియావాకీలలో ప్లాంటేషన్‌ చేయాలని అన్నారు. ఫారెస్ట్‌లలో కడియం మొక్కలు, ఇతర జిల్లాల నుంచి కొనుగోలుచేసి వాటిని నాటి ట్రీగార్డ్స్‌ ఏర్పాటు చేయాలని, పట్టణ ప్రగతిలో వచ్చిన నిధుల నుంచి పదిశాతం హరితహారం కోసం ఖర్చు చేయాలని అన్నారు.


డంపింగ్‌యార్డుల చుట్టూ మూడు వరుసల మొక్కలు నాటాలన్నారు. ఏ వార్డులో ఎన్ని మొక్కలు నాటాలో ముందుగా గుర్తించి నాణ్యమైన మొక్కలు నాటాలని మున్సిపల్‌ కమిషనర్లకు సూచించారు. పల్లె ప్రగతిలో భాగంగా సర్పంచులు, వార్డు మెంబర్లు ఆయా వార్డుల్లో నాటిన మొక్కలను కాపాడుకోవాల్సిన పూర్తి బాధ్యత వారిదేనని అన్నారు. ప్రతి మున్సిపాలిటీలో మియావాకీ తప్పనిసరిగా ఉండాలని అన్నారు. డంపింగ్‌యార్డులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నర్సరీలలో మొక్కలు అందుబాటులో ఉండేవిధంగా చూడాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - 2020-06-25T10:28:43+05:30 IST