ఉపాధిహామీ టార్గెట్లను పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-06-19T07:07:16+05:30 IST

జిల్లాకు కేటాయించిన ఉపాధిహామీ పథకం టార్గెట్లు శాఖల వారీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ కె. శశాంక అన్నారు.

ఉపాధిహామీ టార్గెట్లను పూర్తి చేయాలి

కలెక్టర్‌ కె శశాంక


కరీంనగర్‌, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాకు కేటాయించిన ఉపాధిహామీ పథకం టార్గెట్లు శాఖల వారీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ కె. శశాంక అన్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఉపాధి హామీ పనులపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులు గట్ల వెంబడి, బ్లాక్‌ పద్ధతిలో టేకు, మల్బరి, వేప, యూకలిప్టస్‌ మొక్కల పెంపకం చేపట్టేలా ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో మొత్తం 1,60,000 మంది రైతులు రైతుబంధు పొందుతున్నారని, వారందరూ మొక్కలు నాటుకొనే విధంగా మండల వ్యవసాయ అధికారులు, ఏఈవోలు పూర్తి బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఉద్యానవనశాఖ ద్వారా శ్రీగంధం, పండ్ల తోటల పెంపకం చేపట్టుటకు రైతులను గుర్తించి వారి వివరాలు సేకరించాలన్నారు. పశుసంవర్థక శాఖ గడ్డి పెంపకం, గొర్రెల, మేకల షెడ్లు, పౌల్ర్టి షెడ్లు, వాటర్‌ ట్రాప్‌లు ఏర్పాటు చేసుకోవడానికి మండల వెటర్నరీ అసిస్టెంట్లు ఎంపీడీవోలతో  సమన్వయం చేసుకొని, ఇదివరకే మంజూరైన పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు.


మంజూరు పొందిన అన్ని చెరువుల్లో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్‌రావు, జడ్పీ సీఈవో వెంకట మాధవరావు, వ్యవసాయశాఖ అధికారి శ్రీధర్‌, హార్టికల్చర్‌ డీడీ శ్రీనివాస్‌, ఫిషరీస్‌ డీడీ ఖాదీర్‌ అహ్మద్‌, పశుసంవర్థకశాఖ అధికారి అశోక్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌, సీపీవో పూర్ణచంద్రరావు, డీపీవో రఘువరన్‌, వయోజన విద్యాశాఖ అధికారి జయశంకర్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-19T07:07:16+05:30 IST