ప్రభుత్వ భూములను కాపాడాలి
ABN , First Publish Date - 2020-09-12T11:09:16+05:30 IST
లీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు సంయుక్తంగా పనిచేసి ప్రభుత్వ భూములను కాపాడాలని ..

కలెక్టర్ కె శశాంక
కరీంనగర్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు సంయుక్తంగా పనిచేసి ప్రభుత్వ భూములను కాపాడాలని కలెక్టర్ కె శశాంక అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సీపీ కమలాసన్ రెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీరాజ్‌కు సంబంధించి 2010-11తర్వాత బొమ్మకల్లు గ్రామపంచాయతీకి జరిగిన వివిధ రకాల పనులపై తనిఖీ చేశామన్నారు. కమర్షియల్ స్ట్రక్చర్స్‌కు ఎన్ని పర్మిషన్లు ఉన్నవి, లేనివి పంచాయతీరాజ్ వారు తెలపాలని అన్నారు.
ఎన్‌క్రోచ్ అయిన భూమి వెనక్కి తీసుకోవాలని, గుర్తించిన అన్ని భూముల్లో బోర్డులు పెట్టాలని అన్నారు. రాళ్లతో బౌండరీలు వేసి కలర్‌వేసి జియో ట్యాగింగ్ చేయాలని, భూములను ఆక్రమించేందుకు ప్రోత్సహించిన వారిపై కేసులు పెట్టాలని, రికార్డులలో కరెక్ట్‌గా ఉందా లేదా అని పరిశీలించి అధికారులు వారిపై చర్య తీసుకోవాలని అన్నారు. అనంతరం పోలీసు కమిషనర్ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ బొమ్మకల్‌లో భూములు ఆక్రమించిన వారిని గుర్తించుటకు రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. భూ ఆక్రమణకు పాల్పడిన 17మందిపై కేసులు పెట్టామని అన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకట మాధవరావు, ఏసీపీ రష్మీ పెరుమాళ్, జిల్లా పంచాయతీ అధికారి బుచ్చయ్య, ఆర్డీవో ఆనంద్ కుమార్, ఎమ్మార్వోలు, సర్వేయర్లు పాల్గొన్నారు.
డబుల్ బెడ్‌రూం ఇళ్లు వేగవంతంగా పూర్తిచేయాలి
జిల్లాలో మంజూరైన 6,494 డబుల్ బెడ్‌రూం ఇళ్లను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ కె శశాంక అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆర్‌అండ్‌బీ, మిషన్ భగీరథ, సీపీవో అధికారులతో అర్బన్ డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు 6,494 డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు. ఇందులో 784 ఇప్పటికే పూర్తికాగా 1993 వివిధ దశల్లో ఉన్నాయని, వీటిని సెప్టెంబరు-2020 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ ఇళ్లకు విద్యుత్, నీటి సరఫరా, రోడ్లు, డ్రెయినేజీ పనులకు కావలసిన నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తయిన గృహాలు దసరా వరకు లబ్ధిదారులకు అందజేసే విధంగా కృషి చేయాలని అన్నారు. ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ మాధవరావు, ఆర్‌అండ్‌బీ ఈఈ బి సాంబశివరావు, మిషన్ భగీరథ ఈఈ ఉప్పలయ్య, గ్రిడ్ ఈఈ చల్మారెడ్డి, పీహెచ్ ఈఈ చిన్నారావు, ముఖ్య ప్రణాళికా అదికారి పూర్ణచంద్రారావు పాల్గొన్నారు.
మొక్కల సంరక్షణ బాధ్యత అధికారులదే
రాజీవ్ రహదారి వెంట నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత అధికారులదే అని కలెక్టర్ కె శశాంక అన్నారు. శుక్రవారం మొగ్దుంపూర్ నుంచి కరీంనగర్ వరకు రాజీవ్‌రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరెంట్ వైర్ల కింద పూలు, తక్కువ ఎత్తు ఎదిగే మొక్కలను నాటాలని అన్నారు. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణపై దృష్టి పెట్టాలని అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వెంకటేశ్వర్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి బుచ్చయ్య పాల్గొన్నారు.