-
-
Home » Telangana » Karimnagar » collector
-
టీఎస్-బీపాస్‌తో తక్షణమే భవన నిర్మాణ అనుమతులు
ABN , First Publish Date - 2020-11-22T04:49:52+05:30 IST
టీఎస్-బీపాస్ ద్వారా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, నగర కార్పొరేషన్ పరిధిలో తక్షణమే భవన నిర్మాణ అనుమతులు లభిస్తాయని కలెక్టర్ కె శశాంక ఒక ప్రకటనలో తెలిపారు.

కలెక్టర్ కె శశాంక
కరీంనగర్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): టీఎస్-బీపాస్ ద్వారా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, నగర కార్పొరేషన్ పరిధిలో తక్షణమే భవన నిర్మాణ అనుమతులు లభిస్తాయని కలెక్టర్ కె శశాంక ఒక ప్రకటనలో తెలిపారు. సమీప మీసేవా కేంద్రాల్లోకానీ, సెల్‌ఫోన్ ద్వారాకానీ భవన నిర్మాణాలకు అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని అన్నారు. అలాగే భవన నిర్మాణల అనుమతి స్వీయ ధ్రువీకరణ ఆధారంగా తక్షణమే ఇస్తారని అన్నారు. 75 చదరపు గజాల విస్తీర్ణంగల ఫ్లాట్లకు ఎలాంటి అనుమతి అవసరం లేదని అన్నారు. కేవలం ఒక రూపాయి మాత్రమే చెల్లించి తక్షణమే రిజిస్ర్టేషన్ సర్టిఫికెట్ పొందవచ్చని అన్నారు. అలాగే 239 చదరపు గజాల నుంచి 598 చదరపు గజాల వరకు ఫ్లాట్లకు గ్రౌండ్‌ఫ్లోర్, రెండు అంతస్తుల వరకు స్వీయ ధ్రువీకరణ ఆధారంగా తక్షణ అనుమతి ఇస్తామని అన్నారు. 598చదరపు గజాల కన్నా ఎక్కువగాను, గ్రౌండ్ ఫ్లోర్, రెండు అంతస్తులకన్నా ఎక్కువ ఉండే ఫ్లాట్లలో, అన్ని నివాసేతర భవనాలకు సింగిల్ విండో విధానం ద్వారా టీఎస్-బిపాస్ ద్వారా అనుమతులు ఇస్తామని అన్నారు. టీఎస్-బీపాస్ కింద ప్రజలు ఒకే ఉమ్మడి దరఖాస్తు చేసుకోవచ్చని, అలాగే నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ కొరకు ఇతర శాఖలను సంప్రదించనవసరం లేదన్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 21రోజుల్లో భవన నిర్మాణ అనుమతులు జారీ చేస్తామని అన్నారు. ఒకవేళ అనుమతులు 21 రోజుల్లో రాకపోతే అనుమతులు వచ్చినట్టుగానే భావించవచ్చునని అన్నారు. నివాసేతర భవనాలన్నింటికీ స్వాధీనత ఽధ్రువీకరణ 15 రోజుల్లోగా జారీ చేస్తామని అన్నారు. స్వీయ ధ్రువీకరణ ఆధారంగా జారీ చేసిన అన్ని అనుమతులకు తదుపరి తనిఖీలు ఉంటాయని, వాస్తవాలను తప్పుగా తెలిపి నిర్మాణాలను చేసినట్లయితే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే జరిమానాలు, కూల్చివేయడం, స్వాధీనపర్చుకోవడం, సీల్ చేస్తామని పేర్కొన్నారు
.