వైద్యులకు మెమోలు జారీచేయాలి

ABN , First Publish Date - 2020-12-04T05:23:39+05:30 IST

విధులకు గైర్హాజరైన వైద్యాధికారులకు వెంటనే మెమోలు జారీ చేయాలని, ప్రభుత్వ ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ బి రత్నమాలను కలెక్టర్‌ కె శశాంక ఆదేశించారు.

వైద్యులకు మెమోలు జారీచేయాలి
అధికారులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

సమయపాలన పాటించని వైద్యులపై కఠినచర్యలు తప్పవు

ఆర్‌ఎంవో నిర్లక్ష్యమే అపరిశుభ్రతకు కారణం

కలెక్టర్‌ కె శశాంక

సుభాష్‌నగర్‌, డిసెంబరు 3: విధులకు గైర్హాజరైన వైద్యాధికారులకు వెంటనే మెమోలు జారీ చేయాలని, ప్రభుత్వ ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ బి రత్నమాలను కలెక్టర్‌ కె శశాంక ఆదేశించారు. గురువారం జిల్లా ప్రధాన ఆస్పత్రిని ఆయన ఆసక్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వైద్యాధికారులు ప్రతిరోజు విధిగా సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించాలని అన్నారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎమర్జెన్సీ ఓపీ, జనరల్‌ ఓపీలను పరిశీలించారు. ఎమర్జెన్సీ, జనరల్‌ ఓపీలు ఒకేచోట నిర్వహిస్తున్నట్లు గమనించి వెంటనే రెండు ఓపీలను వేర్వేరుగా నిర్వహించాలని అన్నారు. అలాగే ఆస్పత్రికి వచ్చిన రోగులకు క్షుణ్ణంగా అర్థమ్యే రీతిలో బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఆస్పత్రిలోని పలు వార్డులను పరిశీలించారు. ఆర్‌ఎంవో నిర్లక్ష్యం వల్లనే వార్డులు శుభ్రంగా లేవని అన్నారు. ఇకనైనా నిర్లక్ష్యం విడనాడి ప్రతిరోజు వార్డులు, పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని, అలాగే రోగుల వార్డులలో ప్రతిరోజు శానిటైజ్‌ చేయించాలని ఆర్‌ఎంవోను ఆదేశించారు. అనంతరం ఆస్పత్రిలో గల వివిధ విభాగాల్లో ఆపరేషన్లను నిర్వహించే థియేటర్లను పరిశీలించారు. ఈఎన్‌టీ విభాగంలో నవంబర్‌లో ఎన్ని నిర్వహించారని అడగారు. రెండు నిర్వహించామని చెప్పగా 15రోజులకు ఒక ఆపరేషన్‌ చేస్తున్నారా అని వారిని నిలదీశారు. తాను గతనెలలో ఆస్పత్రిని సందర్శించిన సమయంలో పలు సూచనలు, సలహాలు ఇచ్చినప్పటికి మీలో ఎలాంటి మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకముందు కూడా ఇదే ధోరణిలో వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని అన్నారు. ఆస్పత్రిలోని డిస్పెన్సరీ, ల్యాబ్‌, ఐసీయూ, ఎక్స్‌రే, రక్త పరీక్షలు, టాయిలెట్లు లాంటి ప్రదేశాలను పరిశీలించిన అనంతరం వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కొవిడ్‌ సమస్యలు ఉన్నప్పుడు 80నుంచి 90శాతం మంది వైద్యులు విధి నిర్వహణలో మంచి ప్రతిభ కనబర్చి వైద్యసేవలందించడం అభినందనీయమని అన్నారు. ప్రస్తుతం విధుల పట్ల ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. అన్ని జిల్లాల్లోకెల్లా కరీంనగర్‌ జిల్లా ఆస్పత్రిలో ఎక్కువ సౌకర్యాలు ఉన్నాయని అన్నారు. అయినప్పటికీ ఆపరేషన్ల సంఖ్య ఎందుకు పెంచలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి అన్ని విభాగాల్లో రోజుకు కనీసం ఒక ఆపరేషన్‌ అయినా చేయాలని అన్నారు. వైద్యాధికారులు సమయపాలన పాటించకుండా వచ్చి వెళ్లుట వలననే పేషంట్లు రావడం లేదన్నారు. ఇక ముందు ప్రతి నెల ఏదో ఒకరోజు ఆస్పత్రిని తనిఖీ చేస్తానని, అప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంటే సీరియస్‌గా ఉంటుందని హెచ్చరించారు. డిస్పెన్సరీలో రోగులకు అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని అన్నారు. అలాగే ఆస్పత్రిలో సీసీ కెమెరాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఫైర్‌ సేఫ్టీ కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా ఆస్పత్రిలో నిరుపయోగంగా ఉన్న పాత సామగ్రి మొత్తం లిస్టు తయారు చేసి అమ్మేయమని ఆదేశించారు. అంతేగాక ఆస్పత్రి పాత భవనంలో అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న మరమ్మతులకు ఎస్టిమేషన్‌ తయారుచేసి ఆ పనులను వెంటనే పూర్తి చేయాలని, వైద్యఆరోగ్యశాఖ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రత్నమాల, ఆర్‌ఎంవో శౌరయ్య, వైద్య, ఆరోగ్యశాఖ డీఈ వెంకటరమణ, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T05:23:39+05:30 IST