చిక్కుల్లో మక్కల రైతులు

ABN , First Publish Date - 2020-12-02T05:04:04+05:30 IST

ప్రభుత్వం నియంత్రిత సాగు విధానంలో భాగంగా మొక్కజొన్న సాగు చేయవద్దని ఆదేశించడంతో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు.

చిక్కుల్లో మక్కల రైతులు

నియంత్రిత సాగుతో మార్కెట్‌ కష్టాలు 

ఆన్‌లైన్‌లో నమోదు కాక పోవడంతో కొనని కేంద్రాలు 

మద్దతు ధర రాకున్నా ప్రైవేట్‌లో అమ్ముకునే పరిస్థితి 

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ప్రభుత్వం నియంత్రిత సాగు విధానంలో భాగంగా మొక్కజొన్న సాగు చేయవద్దని ఆదేశించడంతో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల కంటే ముందే మొక్కజొన్న సాగుకు సన్నద్ధమైన రైతు ఆఖరి క్షణంలో ఆ పంటకు బదులుగా వేరొక పంట వేసుకునే అవకాశం లేక పోవడంతో విధిలేని పరిస్థితిలో సాగు చేశాడు. ఇప్పుడు అదే ఇబ్బందిగా మారింది. కేంద్రం మొక్కజొన్నకు క్వింటాల్‌కు 1850 రూపాయల మద్దతు ధర ప్రకటించినా రైతులు ఆ ధరను పొందే పరిస్థితి జిల్లాలో కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న రైతుల నుంచి వచ్చిన నిరసనతో ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు చేయాలని నిర్ణయించినా వ్యవసాయశాఖ వద్ద ఆయా రైతులు తమ పేర్లు నమోదు చేసుకోలేదనే కారణంతో  కొనుగోలు చేయడం లేదు. దీంతో క్వింటాల్‌కు 500 నుంచి 600 రూపాయల నష్టపోతూ రైతులు ప్రైవేట్‌ వ్యాపారులకు తమ పంటను విక్రయించుకోవలసిన పరిస్థితి వచ్చింది. జిల్లాలో సాధారణంగా ప్రతి వానా కాలంలో సుమారు 30వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేస్తారు.  2018లో 27వేల 18 6 ఎకరాల్లో,  2019లో 30వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగుచేశారు. 2020లో కూడా అదే మొస్తరులో మొక్కజొన్న సాగు చేసేందుకు రైతులు సిద్ధం కాగా ప్రభుత్వం నియంత్రిత సాగు విధానంలో భాగంగా ఈ పంటను సాగు చేయవద్దని ఆదేశించింది. ఒకవేళ రైతులు మొక్కజొన్నను సాగు చేస్తే వచ్చే దిగుబడిని కొనమని తేల్చి చెప్పింది. వరి, పత్తి పంటలను మాత్రమే సాగు చేయాలని, ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా సాగు చేస్తే రైతుబంధు పథకం వర్తించదని అధికారయంత్రాంగం ప్రచారం చేసింది. 

 సాగు చేసింది ఎనిమిది వేల ఎకరాల్లో.. ఆన్‌లైన్‌ నమోదైంది 4,163 ఎకరాలు

చివరి క్షణంలో పంట మార్పిడి చేసుకునే వీలు లేని రైతులు ఎనిమిది వేలకు పైగా ఎకరాల్లో మొక్కజొన్న సాగును చేశారని అంచనా వేస్తున్నారు. వ్యవసాయశాఖ అధికారుల వద్ద మాత్రం 4,163 ఎకరాల్లో మాత్రమే సాగు చేసినట్లు వివరాలు నమోదై ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 15 మండలాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. అనధికారిక లెక్కల ప్రకారం 1.6 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న దిగుబడి వచ్చింది. అధికారుల లెక్కల ప్రకారం చూసుకున్నా 83,260 క్వింటాళ్ల మొక్కజొన్న దిగుబడి వచ్చింది. వ్యవసాయశాఖ అధికారుల వద్ద సాగు వివరాలు నమోదు చేయించని రైతులకు సంబంధించిన మొక్కజొన్నను కొనుగోలు చేయలేమని కొనుగోలు కేంద్రాల్లో తిరస్కరిస్తున్నారు. దీంతో జిల్లాలో మొక్కజొన్న సాగు చేసిన రైతుల్లో సగానికి పైగా మంది తమ మక్కలను మద్దతు ధరను అమ్ముకునే వీలు లేకుండా పోతున్నది.

 20 శాతం దాటని కొనుగోళ్లు

 జిల్లావ్యాప్తంగా కరీంనగర్‌, చొప్పదండి, చిగురుమామిడి, గన్నేరువరం, సైదాపూర్‌ మండలాల్లో ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. చొప్పదండిలో 162 మంది రైతుల నుంచి 4,075 క్వింటాళ్లు, చిగురుమామిడిలో 183 మంది రైతుల నుంచి 4,243, గన్నేరువరంలో 160 మంది రైతుల నుంచి 4,560, సైదాపూర్‌లో 73 మంది రైతుల నుంచి 1,401.5, కరీంనగర్‌లో 78 మంది రైతుల నుంచి 2,040 క్వింటాళ్ల మక్కలను కొన్నారు. ఈఐదు కేంద్రాల్లో ఇప్పటి వరకు 656 మంది రైతుల నుంచి 16,320 క్వింటాళ్ల మక్కలను కొనుగోలు చేశారు. వీటి విలువ 3 కోట్ల 2 లక్షల రూపాయలు ఉంటుంది. అధికారుల లెక్కల ప్రకారం చూసినా 83,260 క్వింటాళ్ళ మొక్కజొన్న దిగుబడి రాగా 20 శాతం మక్కలను కూడా ఇప్పటికి కొనుగోలు చేయలేదు. చాలా మంది రైతులు మొక్కజొన్న సాగు చేసినట్లు నమోదు చేసుకుంటే రైతుబంధు వర్తిస్తుందో లేదోనని,  నియంత్రిత సాగులో వద్దన్న పంటను సాగు చేసినట్లు చెబితే అధికారులు ఇతరత్రా పంటల విషయంలో సహకరించరేమోనని నమోదు చేసుకోలేదు. ఇప్పుడు వారికి వచ్చిన దిగుబడిని అమ్ముకోవడం కష్టమవుతున్నది.  గతంలో మాదిరిగా రైతు మక్కలు పండించారని వ్యవసాయ విస్తరణ అధికారి ధృవీకరిస్తే ఆ పంటను కొనాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. కేంద్రం మొక్కజొన్నకు క్వింటాల్‌కు 1,850 రూపాయల మద్దతు ధరను ప్రకటించగా కొనుగోలు కేంద్రాల్లో అదే ధరను చెల్లించి తీసుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల పేర్లు ఆన్‌లైన్‌లో లేకపోవడంతో వారు ఆ పంటను కొనడం లేదు. దీంతో రైతులు 1,300 నుంచి 1,500 రూపాయలకే క్వింటాల్‌ మక్కలను ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ముకొని ఒక్కో క్వింటాల్‌పై 350 నుంచి 550 రూపాయల వరకు నష్టపోతున్నారు. ప్రభుత్వం ఈ సీజన్‌ వరకు ఎటువంటి నిబంధనలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన మక్కలన్నిటిని మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. మరోవైపు ఈనెల 7వ తేదీ వరకు మక్కల కొనుగోలు పూర్తిచేయాల ని జిల్లా యంత్రాంగం ఆదేశిస్తుండడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికీ రైతుల వద్ద అమ్ముకోగా మిగిలిన మక్కలు సుమారు 40 వేల క్వింటాళ్ల వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్‌ వరకైనా పండించిన మొత్తం మక్కలను కొనేలా ఆదేశాలివ్వాలని రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2020-12-02T05:04:04+05:30 IST