కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తున్న కేంద్రం

ABN , First Publish Date - 2020-11-19T06:33:37+05:30 IST

కార్పొరేట్‌ శక్తులకు కేంద్ర ప్రభుత్వం ఊడిగం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు

కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తున్న కేంద్రం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి

- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి

భగత్‌నగర్‌, నవంబర్‌ 18: కార్పొరేట్‌ శక్తులకు కేంద్ర ప్రభుత్వం ఊడిగం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు బుధవారం కరీంనగర్‌ సీపీఐ కార్యాలయం బద్దం ఎల్లారెడ్డిభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్‌ పెట్టుబడిదారులకు లాభం చేకూర్చే విధంగా కేంద్రప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. రానున్న రోజుల్లో ప్రజలపై ప్రత్యక్షంగా భారం వేసి ప్రజలను నిలువునా ముంచుతారన్నారు. నూతన వ్యవసాయ చట్టంతో రైతులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నల్గొండ, కామారెడ్డి ప్రాంతాల్లో మద్ధతు ధర లేక, వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను  రైతులు కాల్చి వేశారన్నారు. మద్ధతు ధర విషయంలో హరీష్‌రావు అడిగిన ప్రశ్నలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ సమాధానం చెప్పాలన్నారు. ఏ పంటలు వేసుకోవాలో చెప్పి కేసీఆర్‌ మద్ధతు ధర విషయంలో మాట మార్చాడన్నారు. దుబ్బాక ఎన్నికల్లో మద్యం, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేశారన్నారు. నిరుద్యోగులు కేసీఆర్‌ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారన్నారు. హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ గ్రేటర్‌ఎన్నికల్లో వామపక్షాల పార్టీలతో కలిపి యాభై స్థానాలకు పోటీ చేస్తామన్నారు. వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో సమా వేశం ఏర్పాటు చేసి గ్రేటర్‌ మెనిఫెస్టో కూడా రూపొందిస్తామన్నారు.  ముఖ్య నేతలతో కోర్‌ కమిటీని ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ పడుతు న్నామన్నారు. రెండురోజుల్లో అభ్యర్థుల జాబితా కూడా ప్రకటించను న్నట్లు తెలిపారు. గ్రేటర్‌ ఎన్నికల షెడ్యుల్‌ను ఆఘమేఘాల మీద విడుదల చేయడంలో సైతం రాజకీయ నాయకులు జిమ్మిక్కులు ప్రదర్శించారన్నారు. ప్రజాసమస్యలు ఎన్నికల హామీలు నెరవేర్చక పోవడం వల్లే ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న వ్యతిరేకత దుబ్బాక ఎన్నికల్లో కనిపించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తోందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలు పెద్దఎత్తున పోరాటానికి సిద్ధమయ్యే రోజులు దగ్గర పడుతు న్నాయన్నారు. విలేకరుల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పొనగంటి కేదారి, కొయ్యడ సృజన్‌కుమార్‌, బోయిని అశోక్‌, రమణారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-11-19T06:33:37+05:30 IST