బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌

ABN , First Publish Date - 2020-03-12T08:47:31+05:30 IST

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ నియమితులయ్యారు. ఆ పార్టీ జాతీయ నాయకత్వం కరీంనగర్‌ జిల్లాకు మరోసారి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌

 జిల్లాకు మరోసారి దక్కిన అవకాశం

 కమలశ్రేణుల్లో కదనోత్సాహం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ నియమితులయ్యారు. ఆ పార్టీ జాతీయ నాయకత్వం కరీంనగర్‌ జిల్లాకు మరోసారి అరుదైన అవకాశాన్ని కల్పించింది. ఉమ్మడి జిల్లాకు చెందిన చెన్నమనేని విద్యాసాగర్‌రావు గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించగా ఇప్పుడు మళ్లీ ఆ అవకాశం సంజయ్‌కుమార్‌కు దక్కింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మార్చి కొత్తవారికి అవకాశం కల్పిస్తారని కొద్ది నెలలుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ను తిరిగి కొనసాగిస్తారని ఆయనను మార్చి బండి సంజయ్‌కుమార్‌, డీకే అరుణ, జితేందర్‌రెడ్డిల్లో ఎవరో ఒకరికి అధ్యక్ష పదవిని అప్పగిస్తారని పార్టీ వర్గాలు రెండు మూడు నెలలుగా చర్చించుకుంటున్నాయి.


ఉత్తరాదిలో బీజేపీకి ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతో దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు పెంచుకోవాలని ఆ పార్టీ జాతీయ నాయకత్వం భావించింది. అందుకనుగుణంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలపై దృష్టి సారించింది. తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు లేకుండానే స్వయంగా ఎదగాలని భావించిన బీజేపీ జాతీయ నాయకత్వం గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులను పోటీకి దింపింది. 

 దూకుడే ఆయుధం

అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేక పోయిన పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి బీజేపీ గాలి వీచి ఉత్తర తెలంగాణలో నాలుగు పార్లమెంటు స్థానాలను దక్కించుకున్నది. కరీంనగర్‌ పార్లమెంటు స్థానం నుంచి బండి సంజయ్‌కుమార్‌ ఎంపీగా గెలుపొందారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు పార్టీ రాజకీయాల్లో కుడిభుజంగా వ్యవహరిస్తు వస్తున్న బి వినోద్‌కుమార్‌ను ఓడించి సంజయ్‌ ఘన విజయం సాధించడంతో భారతీయ జనతా పార్టీలో ఆయన ప్రాబల్యం పెరిగింది. హిందుత్వ వాదాన్ని బలంగా వినిపిస్తూ కరీంనగర్‌లో, జిల్లాలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న సంజయ్‌కుమార్‌ ఎంపీగా గెలవడంతో వివిధ జిల్లాలలోని పార్టీ శ్రేణుల్లో బలమైన నాయకుడిగా ముద్రను వేశారు.


ఎక్కడ ఏ అంశం ప్రధానంగా తెరమీదకు వచ్చినా అక్కడికి వెళ్తూ తన వాణిని బలంగా వినిపిస్తు హిందుత్వ ప్రతినిఽధిగా పార్టీ శ్రేణుల్లో సుస్తిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు పార్టీని రాష్ట్రంలో బలమైన శక్తిగా నిలపాలంటే హిందుత్వ వాదాన్ని బలంగా వినిపించే వ్యక్తి దూకుడుగా శ్రేణులను నడిపించే వ్యక్తి అవసరమని అటు ఆర్‌ఎస్‌ఎస్‌, ఇటు బీజేపీ జాతీయ నాయకత్వం భావించి అందుకు సరైన వ్యక్తిగా సంజయ్‌ని ఎంపిక చేశారు.

 ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు

సంజయ్‌ ఎంపికలో ఆర్‌ఎస్‌ఎస్‌ క్రియాశీల పాత్రను నిర్వహించింది. ఇతర పార్టీ నుంచి బీజేపీలో చేరిన వారికి వెంటనే పార్టీ నాయకత్వం అప్పగించవద్దని జాతీయ నాయకత్వం ఒక నిర్ణయానికి రావడంతో డీకే అరుణ పేరు పక్కకు వెళ్లింది.  సీనియర్‌ నాయకులంతా డాక్టర్‌ లక్ష్మణ్‌కే మద్దతు పలికినా రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులు అవసరాల దృష్ట్యా సంజయ్‌కి నాయకత్వం అప్పగించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ బలంగా ప్రతిపాదించడంతో జాతీయ నాయకత్వం కూడా ఆయన వైపే మొగ్గు చూపింది. దీంతో సంజయ్‌కుమార్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 

 విద్యార్థి దశ నుంచే..

విద్యార్థి దశ నుంచే స్వయం సేవకుడిగా ఏబీవీపీ సభ్యుడిగా సంజయ్‌ పని చేస్తు వస్తున్నారు. ఏబీవీపీ పట్టణ కన్వినర్‌గా, ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో ఎన్నికల ప్రచార ఇన్‌ఛార్జిగా పనిచేశారు. బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, ఉపాధ్యక్షుడిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, జాతీయ కార్యదర్శిగా పనిచేసిన బండి సంజయ్‌ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో బీజేవైఎం ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు. ఎల్‌కే అద్వాని రథ యాత్రలో వాహన ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. వరుసగా రెండు సార్లు బీజేపీ కరీంనగర్‌ పట్టణ  అద్యక్షుడిగా పని చేశారు. ఒక వైపు పార్టీ పనులు నిర్వహిస్తునే అర్బన్‌ బ్యాంకు డైరెక్టర్‌గా పోటీ చేసి రాజకీయాల్లోకి వచ్చారు.


1994 నుంచి 2003 వరకు రెండు పర్యాయాలు ఈ బ్యాంకులో డైరెక్టర్‌గా ఉన్నారు. కరీంనరగ్‌ కార్పొరేషన్‌ ఏర్పడిన తర్వాత 48వ డివిజన్‌ నుంచి రెండు సార్లు కార్పొరేటర్‌గా గెలుపొందారు. 2014 అసెంబ్లి ఎన్నికల్లో కరీంనగర్‌ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 52 వేల ఓట్లు సాధించి రెండోస్థానంలో నిలిచాడు. 2019లోనూ తిరిగి ఇదే నియోజక వర్గం నుంచి మళ్లి పోటీ చేసి 66,009 ఓట్లను సాధించి మళ్లీ రెండో స్థానంలోనే నిలిచారు.


రాష్ట్రంలో అసెంబ్లీకి పోటీ చేసిన అందరు బీజేపీ అభ్యర్థుల్లో ఆయనే ఎక్కువ ఓట్లు సాధించారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్‌ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 96 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించి కార్పొరేటర్‌ పదవి నుంచి ఎంపీ స్థానానికి ఎదిగారు. ఇప్పుడు ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులు కావడంతో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తిగా ఆ పార్టీలో నిలిచారు. 


Updated Date - 2020-03-12T08:47:31+05:30 IST