బండి సంజయ్ దీక్ష విరమణ
ABN , First Publish Date - 2020-10-28T11:29:28+05:30 IST
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ నిరాహార దీక్షను విరమించారు. రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గడంతో ఆయనను వైద్యుల సూచన మేరకు అపోలో ఆస్పత్రికి తరలించారు

షుగర్ లెవల్స్ తగ్గడంతో అపోలో ఆస్పత్రికి తరలింపు
నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన జితేందర్‌రెడ్డి, వివేక్
ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై పోరాటం కొనసాగిస్తామని ప్రకటన
పరామర్శించిన డీకే అరుణ, పెద్దిరెడ్డి, బాబు మోహన్
జిల్లావ్యాప్తంగా ఆందోళనలు
కరీంనగర్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ నిరాహార దీక్షను విరమించారు. రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గడంతో ఆయనను వైద్యుల సూచన మేరకు అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, డాక్టర్ వివేకానంద్ ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపపజేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ పాలన, విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని, అప్పటి వరకు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు తమ పార్టీ విశ్రమించదని వారు ఈ సందర్భంగా ప్రకటించారు. దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సోమవారం సిద్ధిపేటకు వెళ్లారు. సిద్ధిపేట నుంచి ఆయన దుబ్బాక వెళ్లే అవకాశం ఉన్నందున అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటాయనే కారణంతో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా తనతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని, చాతిపై చేయివేసి వ్యాన్‌లోకి నెట్టేశారని, దురుసుగా వ్యవహరించారని బండి సంజయ్ ఆరోపించారు. ఎంపీని అనే కనీస గౌరవం ఇవ్వకుండా అనుచితంగా ప్రవర్తించిన పోలీసుల వైఖరికి కారకులైన సిద్దిపేట పోలీస్ కమిషనర్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన సోమవారం రాత్రి కరీంనగర్‌లోని తన పార్లమెంటరీ కార్యాలయంలో స్వీయ నిర్బంధంలోకి వెళ్లి నిరాహార దీక్ష చేపట్టారు. మంగళవారం కూడా ఆయన నిరాహార దీక్షను కొనసాగించగా మధ్యాహ్నం వరకు తీవ్ర నీరసానికి గురయ్యారు. గుండె సంబంధిత వ్యాధిగ్రస్తుడైన ఆయనకు ప్రైవేట్ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. గ్లూకోజ్ లెవల్స్ తగ్గుతున్నట్లు వారు తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఆయన నిరాహార దీక్షను కొనసాగిస్తుండగా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ శౌరయ్య నేతృత్వంలో వైద్యుల బృందం దీక్షా శిబిరానికి చేరుకొని ఎంపీ సంజయ్‌కి వైద్య పరీక్షలు నిర్వహించారు. షుగర్ లెవల్స్ తగ్గిపోవడాన్ని గమనించిన వారు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాల్సిందిగా సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సకు బీజేపీ నేతలు అంగీకరించలేదు. ఆ సమయంలో అక్కడే ఉన్న మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, డాక్టర్ వివేకానంద్ అధికారులతో మాట్లాడి అపోలో ఆస్పత్రికి తరలించారు. అపోలో ఆస్పత్రిలో వారిరువురు సంజయ్‌కి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
అంతకు ముందు దీక్షలో ఉన్న సంజయ్‌ని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ నాయకులు ఇనుగాల పెద్దిరెడ్డి, మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, గడ్డం వివేకానంద్, మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్, రాష్ట్ర అధికార ప్రతినిధులు కొల్లి మాధవి, రాకేష్ రెడ్డి, పలువురు స్థానిక నేతలు పరామర్శించారు. సంజయ్‌తో పోలీసుల అనుచిత వైఖరికి నిరసన తెలుపుతూ జిల్లావ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆ పార్టీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. శంకరపట్నం మండల కేంద్రంలో కరీంనగర్-వరంగల్ రహదారిపై బీజేపీ ధర్నా చేపట్టింది. చిగురుమామిడి, చొప్పదండి, జమ్మికుంటలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. చెంజర్లలో ధర్నా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది కార్యకర్తలు కరీంనగర్‌కు తరలివచ్చి సంజయ్‌ని పరామర్శించి ఆయన ఆస్పత్రికి వెళ్లేంత వరకు అక్కడే ఉన్నారు.
దుబ్బాకలో బీజేపీ గెలుపు ఖాయం- బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం కావడంతో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ అరాచకాలకు పాల్పడుతున్నదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపు ఖాయం కావడంతో టీఆర్ఎస్ ఎలాగైనా ఆ స్థానం దక్కించుకోవడానికి పలు కుతంత్రాలకు పాల్పడుతున్నదని, పోలీసుల సాయంతో జులూం ప్రదర్శిస్తున్నదని ఆమె విమర్శించారు. కరీంనగర్లో స్వీయ నిర్బంధంలో దీక్ష చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌ను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దుబ్బాకలో గెలుపు తమదేనన్న ధీమాతో ఉన్న టీఆర్ఎస్ పార్టీ సర్వే ఫలితాలు తమకు ప్రతికూలంగా రావడంతో కుట్రలు, కుతంత్రాలకు తెరలేపిందని అన్నారు. పోలీసులు టీఆర్ఎస్ నేతల అడుగులకు మడుగులు ఒత్తడం సిగ్గుచేటని ఆమె విమర్శించారు.
టీఆర్ఎస్కు దుబ్బాక ఉప ఎన్నిక చెంపపెట్టు...బీజేపీ జాతీయ నాయకుడు ఇనుగాల పెద్దిరెడ్డి
దుబ్బాక ఉప ఎన్నిక ఫాంహౌస్‌కు, ప్రగతి భవన్‌కే పరిమితమైన ముఖ్యమంత్రికి, టీఆర్ఎస్ పార్టీకి చెంపెట్టులా మారబోతున్నదని బీజేపీ జాతీయ నాయకుడు ఇనుగాల పెద్దిరెడ్డి అన్నారు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేక కేసీఆర్, హరీష్‌రావు బీజేపీ అభ్యర్థి బంధువుల ఇళ్లపై దాడులు చేయిస్తున్నారని, విధ్వంసాలు సృష్టించి గెలుపొందాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ నేతల జాతకాలన్నీ కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయని, ముఖ్యమంత్రులుగా కొనసాగిన అనేక మంది అవినీతి బండారాలు బయటపడడంతో జైలులో ఊచలు లెక్కపెడుతున్న విషయాన్ని గమనించాలని ఆయన హెచ్చరించారు. దుబ్బాకలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగే దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం కృషి చేయాలని ఆయన కోరారు.
బండి సంజయ్‌పై దాడి హరీష్‌రావు ప్రణాళికే...మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై హరీష్‌రావు ప్రణాళిక ప్రకారమే పోలీసులు దాడి చేశారని, మామ కేసీఆర్ వద్ద మార్కులు కొట్టేందుకే హరీష్‌రావు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ విమర్శించారు. దుబ్బాకలో బీజేపీ గెలుపు ఖాయమని తేలిపోవడంతో భయంతో అలజడులు సృష్టిస్తూ బీజేపీ కార్యకర్తలపైకి పోలీసులను ఉసిగొలుపుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఉప ఎన్నికల్లో ఓడిపోతే టీఆర్ఎస్ అడ్రస్ భవిష్యత్‌లో గల్లంతవుతుందనే భయంతోనే అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు.