ఇళ్ల అనుమతులకు టీఎస్‌ బీ-పాస్‌

ABN , First Publish Date - 2020-11-19T06:20:41+05:30 IST

స్థలం, ఆర్థిక వనరులు ఉన్నప్పటికి ఇల్లు నిర్మించడం అంత సులభం కాదనేది వాస్తవం.

ఇళ్ల అనుమతులకు టీఎస్‌ బీ-పాస్‌
బీ-పాస్‌

- స్వీయ ధ్రువీకరణతో ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం 

- 21 రోజుల్లోనే అనుమతి 

- నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు 

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ఇల్లు కట్టి చూడు..పెళ్లి చేసి చూడు.. అనే నానుడి ఉంది. స్థలం, ఆర్థిక వనరులు ఉన్నప్పటికి ఇల్లు నిర్మించడం అంత సులభం కాదనేది వాస్తవం. ఇల్లు కట్టడం ఒక ఎత్తైతే... ఆ ఇంటికి గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి అనుమతి తీసుకోవడం మరో ఎత్తు. ఇకపై పట్టణాలు, నగరాల్లో ఎలాంటి కష్టాలు పడకుండా, దళారుల అవసరం లేకుండా, అధికారుల చు ట్టూ తిరుగకుండానే భవన నిర్మాణ అనుమతులు జారీ చేసేందుకు రాష్ట్ర ప్ర భుత్వం టీఎస్‌ బీ-పాస్‌ (తెలంగాణ స్టేట్‌ బిల్లిండ్‌ అప్రూవల్‌ అండ్‌ సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ సిస్టమ్‌)ను అమల్లోకి తెచ్చింది. టీఎస్‌ బీ-పాస్‌ ద్వారా భవన నిర్మాణ అనుమతులకు సంబంధిత డాక్యుమెంట్లను జతచేసి స్వీయ ధ్రువీకరణతో దరఖాస్తు చేసుకుంటే పోస్ట్‌ వెరిఫికేషన్‌ టీం పరిశీలన అనంతరం 21 రోజుల్లో మున్సిపల్‌ నుంచి భవన నిర్మాణ అనుమతి జారీ అవుతుంది. స్వీయ ధ్రువీకరణ చేసి సమర్పించిన డాక్యుమెంట్లలో తప్పులు ఉంటే ఆ దరఖాస్తులను రద్దు చేసి భారీ జరిమానా విధిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలను చేపడితే కఠిన చర్యలు తీసుకుంటారు. 

సిటిజన్‌ చార్టర్‌ ప్రకారంగా 21 రోజుల్లోనే ఇళ్ల అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. వివిధ కొర్రీలతో సిటిజన్‌ చార్టర్‌ను అటకెక్కించడంతో అనుమతుల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ముడుపులు ఇవ్వనిదే భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడం లేదనే విమర్శలునాయి. వీటన్నిటిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు, ఇంజనీర్ల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, వాటిని పరిశీలించి అధికారులు నిర్ణీత గడువు 21 రోజుల్లోనే అనుమతి ఇస్తారని ఆన్‌లైన్‌ సేవలకు శ్రీకారం చుట్టింది. ఆన్‌లైన్‌తో ఇక తమ కష్టాలు గట్టెక్కుతాయని ప్రజలు భావించగా టౌన్‌ప్లానింగ్‌ అధికారులు పలు రకాల కారణాలను చూపుతూ పెండింగ్‌లో పెట్టడంతో ఇటు లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు, అటు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ఇలాంటి వాటికి చెక్‌పెట్టి భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేయడంతోపాటు పారదర్శకత, అక్రమ భవన నిర్మాణాలను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌ బీ-పాస్‌ విధానాన్ని సోమవారం నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ విధానంలో ఇళ్లు నిర్మించుకునే వారు ఎవరి వద్దకు వెళ్లకుండా తామే స్వీయ ధ్రువీకరణ ద్వారా ఆన్‌లైన్‌లోనే సంబంధిత డాక్యుమెంట్లను జతచేసి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా సర్వేయర్లు, ఇంజనీర్ల ద్వారా ్టటఛఞ్చటట.్ట్ఛజ్చూుఽజ్చుఽ్చ.జౌఠ్టి.జీుఽ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసి ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. వారికి 21 రోజుల్లో అధికారులు అనుమతులు జారీ చేయాల్సి ఉంటుంది. 


పోస్ట్‌ వెరిఫికేషన్‌ టీమ్స్‌ ఏర్పాటు

ఇళ్ల నిర్మాణ అనుమతుల జారీలో అవకతవకలకు, అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకత కోసం మున్సిపల్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులతోపాటు ఇతర శాఖల అధికారులతో పోస్ట్‌ వెరిఫికేషన్‌ టీమ్స్‌ను కలెక్టర్‌ ఏర్పాటు చేశారు. కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఆరుగురు మున్సిపల్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులతోపాటు నలుగురు డిప్యూటీ తహసీల్దార్లు, ఇద్దరు ఇరిగేషన్‌శాఖ ఏఈలతో పోస్ట్‌ వెరిఫికేషన్‌ టీమ్‌ను ఏర్పాటు చేశారు. జిల్లాలోని జమ్మికుంట, హుజురాబాద్‌, కొత్తపల్లి, మున్సిపాలిటీలో ఒక టౌన్‌ప్లానింగ్‌ అధికారితోపాటు రెవెన్యూ, ఇంజనీరింగ్‌శాఖల అధికారి ఒకరితో పోస్ట్‌ వెరిఫికేషన్‌ టీంలను ఏర్పాటు చేశారు. ఈ పోస్ట్‌ వెరిఫికేషన్‌ బృందాలు బీపాస్‌లో వచ్చిన దరఖాస్తులను వేర్వేరుగా పరిశీలించి డాక్యుమెంట్లు, స్వీయ ధ్రువీకరణ పత్రం సరిగా ఉన్నట్లు గుర్తిస్తే వారికి అనుమతులు జారీ చేస్తారు. నిబంధనలకు విరుద్ధంగా దరఖాస్తు చేసినట్లు వారి పరిశీలనలో గుర్తిస్తే సంబంధిత దరఖాస్తులను రద్దు చేయడంతోపాటు భారీ జరిమానా విధిస్తారు.  


75 చదరపు గజాలలోపు ఇంటి నిర్మాణానికి రూపాయి ఫీజు

రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన మున్సిపల్‌ కొత్త చట్టం ప్రకారం 75 చదరపు గజాలలోపు స్థలంలో ఇంటి నిర్మాణం చేసేందుకు ఆన్‌లైన్‌లో రూపాయి రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే సరిపోతుంది. ఎలాంటి అనుమతులు అవసరముండదు.  ఒక రూపాయి చెల్లించకుండానే టీఎస్‌బీపాస్‌లో దరఖాస్తు చేసుకుంటే ఆస్తిపన్నులో రూపాయిని కలిపి తీసుకుంటారు. ఇక 75 చదరపు గజాల నుంచి 600 గజాలలోపు స్థలంలో భవన నిర్మాణం చేసేందకు ఇంటి నిర్మాణ విస్తీర్ణాన్ని బట్టి ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి స్వీయ ధ్రువీకరణతో అనుమతులు తీసుకోవచ్చు. ఫీజు మొత్తాన్ని ఒకేసారి కాకుండా నాలుగువాయిదాల్లో చెల్లించే వెసులుబాటు ఉంది. మొదటి వాయిదా ఫీజును చెల్లించి ఇంటిని నిర్మించుకొని ఆ తర్వాత మిగిలిన వాయిదాలను చెల్లించాల్సి ఉంటుంది. 


500 చదరపు మీటర్లపైన ఉన్న నిర్మాణాలకు సింగిల్‌విండో పద్ధతిలో అనుమతులు

500 చదరపు మీటర్లు అంటే 600 గజాలకు పైన ఉన్న స్థలంలో జీప్లస్‌-2 లేదా బహుళ అంతస్తు భవన నిర్మాణాలకు సింగిల్‌ విండో ద్వారా అనుమతులు ఇస్తారు. గతంలో ఆ భవన నిర్మాణదారులు ఫైర్‌, పొల్యూషన్‌, ఎలక్ర్టిసిటీ తదితర సంబంధితశాఖల నుంచి నో ఆబ్జక్షన్‌ సర్టిఫికేట్లు (ఎన్‌వోసీ) తీసుకొని  దరఖాస్తుతోపాటు వాటిని జతచేయాల్సి ఉండేది. బీ-పాస్‌లో వాటిని జతచేసినా లేక చేయక పోయినా నిబంధనలకు లోబడి నిర్మాణాలు చేపడితే అందుకు మున్సిపల్‌ అధికారులు అనుమతి జారీ చేస్తారు. బీ-పాస్‌లో దరఖాస్తు చేసుకుంటే సంబంధితశాఖల అధికారులు ఆయా దరఖాస్తులను పరిశీలించి వాటికి ఎన్‌వోసీలను ఆన్‌లైన్‌లోనే మున్సిపాలిటీలకు పంపిస్తారు. 


బీ-పాస్‌తో అనుమతుల జారీకి ఏర్పాట్లు 

కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తోపాటు హుజూరాబాద్‌, జమ్మికుంట, కొత్తపల్లి, చొప్పదండి మున్సిపాలిటీల్లో బీ పాస్‌ దరఖాస్తులతో ఇళ్ల అనుమతులను మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులన్నిటిని పాత విధానంలోనే అనుమతులు జారీ చేసి ఇకపై బీపాస్‌ ద్వారా జారీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. బీపాస్‌లో వచ్చే దరఖాస్తులను పోస్ట్‌ వెరిఫికేషన్‌ టీం పరిశీలించి, ఆ తర్వాత నిబంధనల మేరకు అన్ని డాక్యుమెంట్లు సరిగా ఉంటే 21 రోజుల్లోనే అనుమతి ఇస్తామని, లేనిపక్షంలో ఆయా దరఖాస్తులను రద్దు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ విధానంతో పారదర్శకంగా, ఇబ్బందులు లేకుండా ఇళ్ల అనుమతులు పొందవచ్చని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2020-11-19T06:20:41+05:30 IST