ఖరీఫ్‌ కార్యాచరణ సిద్ధం...

ABN , First Publish Date - 2020-04-28T10:32:20+05:30 IST

రబీలో రికార్డు స్థాయిలో సుమారు ఐదున్నర లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చిన జిల్లాలో ఖరీఫ్‌

ఖరీఫ్‌ కార్యాచరణ సిద్ధం...

3.34 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు 

2.09 లక్షల ఎకరాల్లో వరి, 77వేల ఎకరాల్లో పతి, 30వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు 

అందుబాటుల్లో ఇప్పటికే 39వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు


(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌): రబీలో రికార్డు స్థాయిలో సుమారు ఐదున్నర లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చిన జిల్లాలో ఖరీఫ్‌ సాగు కోసం వ్యవసాయశాఖ కార్యాచరణ ప్రణాళికను ఇప్పటికే రూపొందించింది. నైరుతీ రుతుపవనాల ఆగమనానికి 15, 20 రోజుల ముందు నుంచే రైతులు ఖరీఫ్‌ సాగు కోసం దుక్కులు దున్నుకొని సిద్ధమవుతుంటారు. జూన్‌ మొదటివారాంతం నుంచి రెండో వారంలోగా రాష్ట్రంలో నైరుతీ రుతుపవనాలు వచ్చే ఆనవాయితీ కొనసాగుతున్నది.


రుతుపవనాలు సకాలంలో వచ్చినా, రాకున్నా వచ్చి విస్తరించకున్నా జిల్లాలోని జలవనరులన్నిటిలో ఇప్పటికే నీరు ఉండడంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నిత్యం నీరు ఎత్తిపోసుకొని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుతోపాటు మిడ్‌మానేరు, ఎల్‌ఎండీ, ఎల్లంపల్లి ప్రాజెక్టులు నింపుకొనే అవకాశముండడంతో ఖరీఫ్‌కు నీటి సమస్య అనేదే ఉండే అవకాశం లేదు. దీంతో జిల్లా వ్యవసాయశాఖ ఖరీఫ్‌సాగుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ సంవత్సరం ఖరీఫ్‌లో జిల్లాలో 3,34,110 ఎకరాలలో వివిధ పంటలు సాగు చేస్తారని జిల్లా వ్యవసాయశాఖ అంచనా వేసింది. గత సంవత్సరం జిల్లాలో 3,28,842 ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా ఈ సంవత్సరం కూడా ఇంచుమించుగా అదే విస్తీర్ణంలో సాగు జరుగుతుందని, పెరిగినా 10, 20వేల ఎకరాల్లో పెరిగే అవకాశముంటుందని భావిస్తున్నారు.


ఈమేరకు సబ్సీడీ విత్తనాలు, అవసరమైన ఎరువులను సమకూర్చడంతో జిల్లా వ్యవసాయశాఖ అధికారి వాసిరెడ్డి శ్రీధర్‌ నేతృత్వంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నది. ఈ ఖరీఫ్‌లో 2,09,250 ఎకరాల్లో వరి, 30 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 77 వేల ఎకరాల్లో పత్తి, 3,500 ఎకరాల్లో కంది, వేయి ఎకరాల్లో పెసర, 1,125 ఎకరాల్లో మిర్చి, 635 ఎకరాల్లో పసుపు, 25 ఎకరాల్లో వేరుశనగ, 25 ఎకరాల్లో మినుము, 11,250 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. 


15 వేల ఎకరాల్లో పెరుగనున్న వరి సాగు

గత సంవత్సరంతో పోలిస్తే 15వేల ఎకరాల్లో వరి సాగు పెరుగవచ్చని, మూడు వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు తగ్గిపోవచ్చని వ్యవసాయశాఖ అంచనా వేసింది.  మరో 10 నుంచి 15వేల ఎకరాల్లో పత్తి సాగు తగ్గిపోతుందని కూడా వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఈ మేరకు జిల్లాకు 41,219 మెట్రిక్‌ టన్నుల యూరియా, 8,115 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 17,227 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్సు, 10,717 మెట్రిక్‌ టన్నుల ఎంవోపీ, 600 మెట్రిక్‌ టన్నుల ఎస్‌ఎస్‌పీ ఎరువులు అవసరమవుతాయని అంచనా వేశారు.


21,547 క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలను జిల్లాకు కేటాయించాలని ప్రతిపాదించారు. రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యాలయానికి ఈమేరకు ప్రతిపాదనలు వెళ్లగా కార్యాచరణ ప్రణాళిక ఖరారైంది. జిల్లాలో 77 వేల ఎకరాల్లో పత్తి సాగు జరుగనున్నది అంచనా వేసిన వ్యవసాయశాఖ సుమారు మూడు లక్షల ప్యాకెట్ల పత్తి విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేసింది. 450 గ్రాముల బరువు ఉండే ఆ పత్తి విత్తనాల ప్యాకెట్లను మార్కెట్‌లో రైతులకు అందుబాటులో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది.


అందుబాటులో 21,547 క్వింటాళ్ల విత్తనాలు

 జిల్లాకు 18 వేల క్వింటాళ్ల సబ్సిడీ వరి విత్తనాలు, 2,866 క్వింటాళ్ల జీలుగ, 300 క్వింటాళ్ల జనుము, 190 క్వింటాళ్ల కంది, 186 క్వింటాళ్ల మొక్కజొన్న, 90 క్వింటాళ్ల పెసర సబ్సిడీ విత్తనాలను జిల్లాలో రైతులకు అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయశాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నది. గత సంవత్సరం 17,700 క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలను రైతులకు సమకూర్చగా ఈసారి 21,547 క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలను అందుబాటులోకి తేనున్నారు.


రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వెయ్యి క్వింటాళ్ల జీలుగా విత్తనాలను జిల్లాకు కేటాయించింది. సబ్సిడీ విత్తనాలు అందుబాటులో ఉన్నా ఇంకా వాటి ధరలను ప్రభుత్వం ప్రకటించాల్సి ఉన్నది.  వర్షాభావ పరిస్థితులు ఉన్నా ప్రాజెక్టులన్నిటికి కాళేశ్వరం నీటితో నింపే అవకాశమున్నందున ఖరీఫ్‌లో అంచనాలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో సాగు జరుగుతుందని భావిస్తున్నారు. గతంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే శ్రీరాంసాగర్‌ ఆయకట్టు మొత్తం సాగులోకి రాకుండా పోయేంది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేనందువల్ల రైతులు ఖరీఫ్‌ సాగుపై కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. 


భూసారం పెంచేందుకు జీలుగ, జనుము విత్తండి... జిల్లా వ్యవసాయాధికారి వాసిరెడ్డి శ్రీధర్‌ 

జిల్లాలోని సాగుభూమి అంతటికి నీటిని అందించే ప్రాజెక్టులు కాళేశ్వరం నీటితో సమృద్ధిగా ఉన్నందువల్ల ఖరీఫ్‌ సాగుకు ఎలాంటి సమస్యలేదు. జిల్లాలో రైతులు ఖరీఫ్‌కు సమానంగా రబీలోనూ వరి సాగు చేశారు. రికార్డు స్థాయిలో వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేశారు. ఇప్పుడు మళ్లీ అదే విస్తీర్ణంలో అవే భూముల్లో ఖరీఫ్‌సాగుకు సిద్ధమవుతున్నందున దిగుబడి తగ్గకుండా చూసేందుకు భూసారాన్ని పెంచుకోవలసిన అవసరమున్నది. భూసారాన్ని పెంచడానికి రైతులు వెంటనే జీలుగ, జనుము విత్తనాలను విత్తి అవి కొంత ఎదగగానే దున్నితే భూసారం పెరిగి దిగుబడి పెరిగే అవకాశమున్నంది.


రాష్ట్ర ప్రభుత్వం జీలుగ, జనుము విత్తనాలను 65 శాతం సబ్సిడీతో సరఫరా చేస్తున్నది. జీలుగా విత్తనం కిలో 53 రూపాయల 95 పైసులు ఉండగా రైతుల 18 రూపాయల 88 పైసలు చెల్లిస్తే సరిపోతుంది. జనుము విత్తనాలు కిలో 66 రూపాయలు ఉండగా రైతులు 23 రూపాయల పది పైసలకు పొందవచ్చు. వరి, కంది, మినుములు, సోయ విత్తనాలను  సబ్సిడీపై సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లుచేశాం. ప్రభుత్వం నుంచి సబ్సిడీ ధర వివరాలు రాగానే రైతులకు విక్రయించడం ప్రారంభిస్తాం. జిల్లాలో ఖరీఫ్‌ సాగుకు ఎరువుల కొరత లేకుండా ఇప్పటికే అవసరమైన నిలువలు ఉన్నాయి. జిల్లాలో 9,641 మెట్రిక్‌ టన్నుల యూరియా, 5,566 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 23వేల మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్సు, 1,032 మెట్రిక్‌ టన్నుల ఎంవోపీ ఎరువులు అందుబాటులో ఉన్నాయి.


రైతుల అవసరాలకు ఇవి మూడు నెలల వరకు సరిపోతాయి. రాష్ట్ర వ్యవసాయశాఖ ఎప్పటికప్పుడు నెలవారిగా రైతుల అవసరాలను తీర్చేందుకు ఎరువులను ప్రణాళికాబద్ధంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నది. ఎరువులు, విత్తనాల కోసం రైతులు ఆందోళన పడాల్సిన అవసరములేదు. వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు నిత్యం అందుబాటులో ఉండి సాంకేతిక సలహాలు ఇస్తూ పంటల పరిరక్షణలో అదిక దిగుబడి సాధించడానికి తోడ్పడుతారు. రైతులు వారి సేవలను వినియోగించుకోవాలి. 


Updated Date - 2020-04-28T10:32:20+05:30 IST